Magazines

భావితరాలకు స్ఫూర్తి.. మేరీ క్యూరీ

41 నిమిషాల క్రితం

Inspiration
avatar
balaji

ప్రచురించబడింది నవం 06, 2026 | 3 నిమిషాల చదవడం

భద్రమైన జీవితాన్ని, వ్యక్తిగత, కుటుంబ సుఖాలను త్యాగం చేసి జీవితాన్ని ప్రయోగశాలలకే అంకితం చేసిన శాస్త్రవేత్తలలో మేరీ క్యూరీ ప్రముఖురాలు. తాను కనుగొన్న రేడియంపై పేటెంటు తీసుకుంటే లక్షలాది డాలర్లు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ, దానిని మానవాళి సౌభాగ్యానికి అంకితం చేశారు. ఆమె పరిశోధనలు క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల జీవితకాలం పెరగడానికి ఎంతగానో దోహదపడ్డాయి. నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళగా, రెండు వేర్వేరు శాస్త్రాలలో రెండు నోబెల్ బహుమతులు పొందిన ఏకైక వ్యక్తిగా చరిత్రలో నిలిచారు.


1867 నవంబర్ 7న పోలెండ్‌లోని వార్సాలో మేరీ క్యూరీ జన్మించారు. ఐదుగురు పిల్లల్లో చివరివారు. ఆమె తల్లిదండ్రులు, తాత ఉపాధ్యాయులు. వారంతా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని ఆస్తులు కోల్పోయారు. తమ ఇంటినే విద్యార్థుల వసతిగృహంగా మార్చి జీవించారు. పోలెండ్‌లో సొంత భాషలో మాట్లాడటానికి ఆంక్షలు, మహిళలు చదువుకోవడాన్ని సమాజం అంగీకరించని పరిస్థితులు ఉండేవి. చిన్నప్పటి నుంచే మేరీకి శాస్త్రవిజ్ఞానంపై ఆసక్తి కలిగింది. హైస్కూలు విద్యార్థులకు శాస్త్రీయ ప్రయోగాలు చేయడాన్ని అక్కడి ప్రభుత్వం నిషేధించింది. నేపథ్యంలో తండ్రి ప్రయోగశాల పరికరాలను ఇంటికి తరలించడం ఆమెకు ఎంతో ఉపయోగపడింది. వాటితో అనేక ప్రయోగాలు చేసేవారు.

ఇబ్బందులు ఎదుర్కొంటూనే

అక్క వైద్య విద్య అభ్యసించడానికి ఆర్థికంగా సహాయం చేయాలని నిర్ణయించుకున్న మేరీ, తాను పనిచేస్తూ ఆమె చదువుకు తోడ్పడ్డారు. ట్యూషన్లు చెప్పడంతో పాటు ఇళ్లలో గవర్నెస్‌గా పనిచేశారు. కుటుంబంలో సోదరుడు, తల్లి మరణించడంతో తీవ్ర విషాదానికి గురయ్యారు. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత ఉన్నత విద్య కోసం పారిస్ వెళ్లారు. రైల్లో నాలుగో తరగతి పెట్టెలో నిలబడి ప్రయాణం చేసిన ఆమె, తక్కువ అద్దెకోసం ఇంటి అటకపై నివసించారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే చదువుపై ఏకాగ్రతను కోల్పోకుండా భౌతికశాస్త్రం, గణితశాస్త్రంలో డిగ్రీలు సంపాదించారు. పరిశోధనలు చేయడానికి అర్హత సాధించారు.

​కొత్త మార్గాలకు పునాది

పరిశోధనల కోసం పియరీ క్యూరీతో కలిసి ఒక పాత గిడ్డంగిలో ప్రయోగశాలను ఏర్పాటు చేసుకున్నారు. వీరి పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. యురేనియం నుంచి వెలువడే కిరణాలపై పరిశోధనలు చేస్తూ రేడియోధార్మికత స్వభావాన్ని అధ్యయనం చేశారు. 1898లో పొలోనియం, రేడియం అనే రెండు మూలకాలను కనుగొన్నారు. తన మాతృదేశమైన పోలెండ్ పేరును గుర్తుచేసేలా మొదటి మూలకానికి పొలోనియం అని పేరు పెట్టారు. ఈ పరిశోధనలు భౌతికశాస్త్రంలో కొత్త మార్గాలకు పునాది వేశాయి. రేడియోధార్మికతపై ఆమె చేసిన పరిశోధనలు అణు భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం అభివృద్ధికి దోహదపడ్డాయి. వైద్యరంగంలో రేడియోధార్మికత వినియోగానికి కొత్త అవకాశాలను తెరిచాయి.

పరిశోధనలకే అంకితమై...

1903లో భర్త పియరీ క్యూరీ, మరో శాస్త్రవేత్తతో కలిసి భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు. అదే ఏడాది పారిస్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన తొలి మహిళగా నిలిచారు. నోబెల్ బహుమతి విషయంలోనూ ఆమె లింగవివక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. పరిశోధనలతో పాటు కుటుంబ బాధ్యతలను కూడా మేరీ సమానంగా నిర్వహించారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. 1906లో భర్త పియరీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇద్దరు కుమార్తెల బాధ్యతలను నిర్వహిస్తూనే పరిశోధనలు కొనసాగించారు. భర్త మరణం తర్వాత తన జీవితాన్ని పూర్తిగా పరిశోధనలకు అంకితం చేశారు. 1911లో రసాయనశాస్త్రంలో రెండో నోబెల్ బహుమతి అందుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో తాను రూపొందించిన ఎక్స్‌రే యంత్రాలను 20 వాహనాల్లో ఏర్పాటు చేసి, కుమార్తె ఐరీన్ సహాయంతో యుద్ధరంగానికి వెళ్లి గాయపడిన సైనికులకు వైద్య సహాయం అందించారు. జాతి వివక్షను ఎదుర్కొంటున్నప్పటికీ ఫ్రాన్స్ సైనికులకు సేవలందించడంలో వెనుకడుగు వేయలేదు. యుద్ధరంగంలో గాయపడిన సైనికులకు ఎక్స్‌రే పరీక్షలు అందించడంలో ఆమె చేసిన కృషి ఎంతో ఉపయోగపడింది. శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వినియోగించారు.

​మానవాళి అభ్యున్నతికై...

ఎక్కువకాలం రేడియోధార్మిక పదార్థాలతో పనిచేయడం వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతింది. అయినప్పటికీ పరిశోధనలను కొనసాగించి అనేక పరిశోధనా పత్రాలు ప్రచురించారు. పతకాలు, పురస్కారాలు పొందారు. ఆమె కుమార్తె ఐరీన్ క్యూరీ కూడా శాస్త్రవేత్తగా ఎదిగి పరిశోధనలు చేశారు. గ్రాము రేడియం విలువ లక్షా యాభై వేల డాలర్లుగా ఉన్న కాలంలో దాన్ని కనుగొన్నప్పటికీ, మేరీ క్యూరీ పేటెంటు తీసుకోవడానికి నిరాకరించారు. తన పరిశోధన ఫలితాలపై వ్యక్తిగత హక్కులు కోరుకోకుండా మానవాళి అభ్యున్నతికి అంకితం చేశారు. ఆమె పరిశోధనలు వైద్యరంగంలో తదుపరి ఆవిష్కరణలకు మార్గం సుగమం చేశాయి. శాస్త్రీయ పరిశోధనల పట్ల అంకితభావం, కుటుంబం పట్ల బాధ్యత, సమాజం పట్ల నిస్వార్థ సేవ చూపిన మేరీ క్యూరీ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం. ఈరోజు ఆమె జయంతి సందర్భంగా ఆ మహామానవిని స్మరించుకుందాం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్