పిల్లలకు దసరా సెలవులు ఇచ్చేశారు. ఇక ఇల్లంతా సందడే సందడి. వారి ఆటపాటలతో ఆనందాల వెల్లువ. ఈ సందర్భంగా.. పది రోజులపాటు నిలవుండే వంటకాలు చేశారంటే.. సాయంత్రం చిరుతిళ్లకు సిద్ధంగా ఉంటాయి. పిల్లలకు బయట దొరికే వాటిని పెట్టడం కంటే ఇంట్లోనే చేసి పెడితే ఆరోగ్యానికి మంచిది. అయితే అవి చాలా రుచిగా ఉండాలి. అలాంటి కొన్ని వంటకాలు మీ కోసం...
బేసన్ లడ్డు
కావల్సిన పదార్థాలు: శనగపిండి (బేసన్) - రెండు కప్పులు, నెయ్యి, పంచదార పొడి - కప్పు చొప్పున, యాలకుల పొడి - అర స్పూన్, జీడిపప్పులు - రెండు టేబుల్ స్పూన్లు, బాదం, పిస్తా - టేబుల్ స్పూన్ చొప్పున
తయారు చేసే విధానం: కడాయిలో నెయ్యి వేడిచేసి.. బాదం, పిస్తా జీడిపప్పులను వేయించి ప్లేటులోకి తీయాలి. అదే కడాయిలో శనగపిండిని మంచి వాసన వచ్చే వరకూ వేయించాలి. సెగ తీసేసి, పంచదార పొడి, వేయించిన బాదం, పిస్తా జీడిపప్పులు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. పిండి కొద్దిగా చల్లారాక.. చేతులతో గట్టిగా నొక్కుతూ లడ్డూలు చుట్టుకోవాలి. అన్నీ అయ్యాక.. గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. పిండిని.. సన్న సెగ మీద మెల్లగా వేయిస్తేనే బేసన్ లడ్డూ రుచిగా ఉంటుంది. పిండి సరిగ్గా వేగకపోతే పచ్చివాసన వస్తుంది. వేగంగా పనైపోవాలని ఎక్కువ సెగ మీద వేయించినా రుచి బాగుండదు. సరైన పద్ధతిలో చేస్తే ఇవి రెండు వారాల వరకూ తాజాగా ఉంటాయి.
సీడై
కావల్సిన పదార్థాలు: బియ్యప్పిండి - రెండు కప్పులు, పుట్నాలపప్పు - పావు కప్పు, నువ్వులు, ఎండుకొబ్బరి తురుము, వెన్న - రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, ఉప్పు - తగినంత, ఇంగువ - పావు స్పూన్, జీలకర్ర - అర స్పూన్, నూనె - వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం: పుట్నాలపప్పును మెత్తగా గ్రైండ్ చేయాలి. అందులో వెన్న, తగినన్ని వేడి నీళ్లు, బియ్యప్పిండి, నువ్వులు, ఎండుకొబ్బరి తురుము, ఉప్పు, ఇంగువ, జీలకర్ర వేసి కలిపి, మూతపెట్టాలి. పావుగంట తర్వాత చిన్న ఉండలుగా చేసుకోవాలి. వాటిని గట్టిగా నొక్కి, పగుళ్లు రాకుండా చూడాలి. కడాయిలో నూనె వేడిచేసి.. మధ్యస్థమైన సెగ మీద లేత గోధుమ రంగులోకి మారే వరకూ వేయిస్తే.. కరకరలాడుతూ రుచిగా ఉండే చిరుతిండి సిద్ధం. చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో భద్రం చేసుకుంటే పదిరోజులు నిలవుంటాయి.
పెప్పర్ సేవ్
కావల్సిన పదార్థాలు: శనగపిండి - రెండు కప్పులు, బియ్యప్పిండి - పావు కప్పు, వెన్న - రెండు టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి - స్పూన్, ఇంగువ - పావు స్పూన్, ఉప్పు - తగినంత, వాము - అర స్పూన్, నూనె - వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం: ఒక గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, వెన్న, రెండు టేబుల్ స్పూన్ల నూనె, తగినన్ని నీళ్లు, ఉప్పు, మిరియాల పొడి, ఇంగువ, వాము వేసి కలపాలి. పిండి మరీ గట్టిగా లేదా పలుచగా ఉండకూడదు. దాని మీద మూతపెట్టి, పది నిమిషాలు నాననివ్వాలి. కడాయిలో నూనెను వేడిచేయాలి. సేవ్ ప్రెస్‌లో లోపల కొద్దిగా నూనె రాసి, పిండిని నింపి.. గుండ్రంగా తిప్పుతూ పిండిని నూనెలోకి వత్తాలి. సెగ మధ్యస్థంగా ఉండాలి. ఒక వైపు వేగిన తర్వాత తిరగేసి.. అటు కూడా వేయించాలి. మిరియాల పొడి నిలవున్నది కాకుండా.. తాజాగా అప్పటికప్పుడు నూరి ఉపయోగిస్తే మంచి వాసన, రుచి వస్తాయి. బియ్యప్పిండి కలపడం వల్ల సేవ్ మరింత కరకరలాడుతుంది.
నిమ్కీ
కావల్సిన పదార్థాలు: మైదా - రెండు కప్పులు, నెయ్యి - మూడు టేబుల్ స్పూన్లు, వాము - స్పూన్, నల్ల జీలకర్ర - అర స్పూన్, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - అర స్పూన్, నూనె - వేయించడానికి సరిపడా
పొరల కోసం: మైదా, నెయ్యి - రెండు టేబుల్ స్పూన్ల చొప్పున
తయారు చేసే విధానం: ఒక పాత్రలో మైదా, నెయ్యి వేసి మెత్తని పేస్ట్‌లా కలిపి ఉంచాలి. మరో వెడల్పాటి గిన్నెలో మైదా, తగినన్ని నీళ్లు, ఉప్పు, నెయ్యి, వాము, నల్ల జీలకర్ర, మిరియాల పొడి వేసి కలపాలి. దాని మీద మూతపెట్టి నాననివ్వాలి. పావుగంట తర్వాత పలుచగా చపాతీలు ఒత్తుకోవాలి. ఒక రొట్టెపై నెయ్యి-మైదా మిశ్రమం పలుచగా పూయాలి. దానిపై మరో రొట్టె పెట్టి, మళ్లీ నెయ్యి మిశ్రమం పూయాలి. ఇలా రెండు లేదా మూడు పొరలు అయ్యాక.. చాపలా చుట్టి, దాంతో మళ్లీ రొట్టె చేయాలి. మిగిలిన పిండితోనూ ఇలాగే చేసి, త్రికోణాలుగా కట్ చేసుకోవాలి. అన్నీ అయ్యాక.. కాగుతున్న నూనెలో దోరగా వేయించాలి. నెయ్యి-మైదా మిశ్రమం పూయడం వల్ల పొరలు పొరలుగా వస్తాయి.
కాజూ కత్లీ
కావల్సిన పదార్థాలు: పంచదార - మూడు వందల గ్రాములు, జీడిపప్పు - రెండు వందల గ్రాములు, నెయ్యి - మూడున్నర స్పూన్లు, యాలకుల పొడి - పావు స్పూన్, రోజ్ వాటర్ - నాలుగైదు చుక్కలు
తయారు చేసే విధానం: జీడిపప్పును పల్స్ చేస్తూ గ్రైండ్ చేయాలి. మధ్యలో ఆపకుండా ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే అందులోంచి నూనె బయటకు వచ్చి ఉండలు కడుతుంది. పంచదారలో కొన్ని నీళ్లు పోసి వేడిచేయాలి. పంచదార కరిగిన తర్వాత.. జీడిపప్పు పొడి, యాలకుల పొడి జతచేసి కలియబెట్టాలి. దగ్గరగా అయ్యాక.. రోజ్ వాటర్, మూడు స్పూన్ల నెయ్యి జోడించి కలియతిప్పుతుండాలి. ఇంకొంత చిక్కగా అయ్యాక సెగ తీసేయాలి. పళ్లెంలో మిగిలిన నెయ్యి రాసి జీడిపప్పు మిశ్రమాన్ని సమంగా సర్దాలి. చల్లారాక.. డైమండ్ లేదా చతురస్రాకారంలో ముక్కలుగా కట్ చేసకుని గాలి చొరబడని డబ్బాలో భద్రం చేసుకోవాలి. వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు. ఇవి రుచే కాదు, బలం కూడా.







కామెంట్‌లు (0)