మణిపూర్ గడ్డపై మూడేండ్లుగా కారుతున్న నెత్తుటి ధారలు ఇంకా ఆగడం లేదు. రిజర్వేషన్ల వివాదంతో మొదలైన ఘర్షణలు జాతుల మధ్య చిచ్చురేపి, మనుషుల మధ్య శత్రుత్వాన్ని పెంచాయి. మహిళలను నగ్నంగా ఊరేగించడం, హత్యలు, ఇండ్ల దహనం, ఆయుధాలతో స్వైరవిహారం.. ఇవన్నీ ప్రపంచం ముందు భారత ప్రజాస్వామ్యాన్ని తలదించుకునేలా చేశాయి. ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. రాష్ట్రపతి పాలన విధించారు. కొత్త సీఎంను గద్దెనెక్కించారు. అయినా హింసకు తెరపడలేదు. తాజాగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, పద్నాలుగు ఇండ్లు దహనమయ్యాయి. పాలకులు మారినా ప్రజల బతుకులు మారకపోవడం, శాంతి హామీలు ఆచరణలోకి రాకపోవడం మణిపూర్ మానని గాయంగా మిగిలింది.
ఈ సంక్షోభానికి నేపథ్యం మెయితీ తెగకు షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) హోదా కల్పించాలనే డిమాండ్. 2023 ఏప్రిల్‌లో ఈ డిమాండ్‌ను పరిశీలించాలని మణిపూర్ హైకోర్టు ఆదేశించడంతో కుకీ-జో తదితర గిరిజన తెగల్లో ఆందోళన పెరిగింది. తమ రిజర్వేషన్లు, భూమి హక్కులు, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయనే భయాలు వ్యక్తమయ్యాయి. మే 3న మొదలైన నిరసనలు మరుసటి రోజుకే తీవ్ర హింసగా మారాయి. భూమి, రాజకీయ ప్రాతినిధ్యం, వనరులకు సంబంధించిన వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన పాలకులు సకాలంలో స్పందించకపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. అప్పటి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
మెయితీ వర్గానికి చెందిన ముఖ్యమంత్రి ఆ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే భావన బలపడింది. సాయుధ మూకలకు రాజకీయ రక్షణ కల్పించారనే ఆరోపణలు, పోలీస్‌స్టేషన్ల నుంచి దోచుకున్న ఆయుధాలపై తగిన చర్యలు తీసుకోలేదన్న ఆందోళనలు ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. అధికార యంత్రాంగం నిష్పాక్షికంగా వ్యవహరించకపోవడం కూడా హింసను మరింత పెంచింది.
2023 మే 4న ఇద్దరు కుకీ మహిళలను మూక నగ్నంగా ఊరేగించిన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మరో ఇద్దరు కుకీ మహిళలు లైంగిక దాడికి గురై మరణించినట్లు నమోదైన కేసులు పరిస్థితి తీవ్రతను వెల్లడించాయి. ఇలాంటి అమానవీయ ఘటనలపై సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంతగా దిగజారేది కాదు. దేశవ్యాప్తంగా కలకలం రేగిన తర్వాతే ప్రధాని స్పందించారు. అయినా మణిపూర్‌ను సందర్శించక పోవడం బాధితుల ఆవేదనను మరింత పెంచింది. హింస మొదలైన రెండేండ్లకు గానీ ప్రధాని ఆ రాష్ట్రంలో అడుగుపెట్టలేదు. అప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రజా ఉద్యమాలు ఉధృతమయ్యాయి. చివరకు బీరేన్ సింగ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. కేంద్రం రాష్ట్రపతి పాలన విధించి, అనంతరం దాన్ని ఎత్తివేసి యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్‌ను ముఖ్యమంత్రిగా నియమించింది. అయినా హింస ఆగలేదు. మెయితీ-కుకీ ఘర్షణలతో అట్టుడికిన రాష్ట్రంలో నాగా-కుకీ ఘర్షణలు కూడా తీవ్రరూపం దాల్చాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సెప్టెంబరు చివరి నాటికి ఈ ఘర్షణల్లో యాభై మందికి పైగా మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి.
తాజాగా నాలుగు రోజుల కిందట జరిగిన హింసలో తొమ్మిది మంది మరణించడం, పద్నాలుగు ఇండ్లు దహనం కావడం పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో తెలియజేస్తోంది. చాస్సాద్ ప్రాంతంలో భద్రతా బలగాల ఆపరేషన్ సందర్భంగా జరిగిన కాల్పుల్లో కుకీ మహిళ డోంఖోనెయ్ టౌతాంగ్ మరణించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. అనంతరం గ్రామాలపై దాడులు, ఇండ్ల దహనం, గ్రామ రక్షకుల హత్యలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల వెనుక ఉన్నవారెవరో దర్యాప్తులో తేల్చాలి. ఇప్పటివరకు హింసకు పాల్పడినవారిని ఎంతమందిని అరెస్టుచేశారు, శిక్షించారన్నది కూడా కీలకమే. ఎందుకంటే, పౌరుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వానికి ఇలాంటి పరిణామాలు తీవ్ర హెచ్చరికలు.
దేశమంతా ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని నమ్మబలికిన మోడీ పరివారం ఏకధాటిగా సాగుతున్న హింసను ఎందుకు ఆపడం లేదు? కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో ఉన్నా మణిపూర్ ప్రజలకు రక్షణ కల్పించడంలో ఎందుకు వైఫల్యం చెందుతోంది. శాంతి పునరుద్ధరణకు సహకరిస్తామన్న హామీలు ఆచరణలోకి రాకపోవడ వల్లే కదా? ప్రజలు ఏ తెగకు చెందినవారైనా వారి ప్రాణాలు సమానమే. హింసకు పాల్పడినవారిని శిక్షించాలి. నిరాశ్రయులకు పునరావాసం కల్పించాలి. కొండ, లోయ ప్రాంతాల ప్రజల మధ్య చర్చలకు మార్గం సుగమం చేయాలి. మణిపూర్‌లో శాంతి నెలకొనడమంటే తుపాకీ మోతలు తాత్కాలికంగా ఆగిపోవడం కాదు.. ప్రజలు భయం లేకుండా జీవించగలగడం. మూడేండ్లుగా మానని ఈ గాయానికి మందు వేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర పాలకులదే. మణిపూర్ ప్రజలకు శాంతి ఎప్పటికి దక్కుతుంది? ఈ మారణహోమానికి ముగింపు పలికేదెప్పుడు?
మానని గాయం
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 13, 2026 | 3 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)