ఢిల్లీలో నిరసనకారులపై
దాడులు చేస్తున్నదెవరు?
నేమ్ ప్లేట్లు లేకుండానే
విద్యార్థులపై దాడులు
ఐషీఘోష్ ప్రశ్నించడంతో
వీడియో చిత్రీకరణకు అడ్డంకులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసనకారులపై దాడులు చేస్తున్నది నిజంగా పోలీసులేనా? పోలీసు యూనిఫాంలు ధరించిన వారిలో కొందరి గుర్తింపు ఏమిటి? అనే ప్రశ్నలు తాజాగా వెలుగులోకి వచ్చిన దృశ్యాలతో తలెత్తుతున్నాయి. నిరసనకారుల మధ్య నిలిపి ఉంచిన ఓ పోలీసు వ్యాన్‌లో పోలీసు, కేంద్ర బలగాల యూనిఫాంలు పెద్ద సంఖ్యలో పేర్చి ఉంచిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఎన్నికల సంఘానికి, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో విద్యార్థి, యువజన సంఘాలు, సిజెపి, ప్రతిపక్ష పార్టీలు నిర్వహిస్తున్న ఆందోళనలను అణచివేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. పోలీసు యూనిఫాంలు ధరించిన పలువురు తమ నేమ్ ప్లేట్లు కనిపించకుండా విద్యార్థులు, ఇతర నిరసన కారులపై దాడులకు పాల్పడుతున్నారు. వారి గుర్తింపును ప్రశ్నించిన వారిని మరింతమంది చుట్టుముట్టి బలవంతంగా లాక్కెళ్తున్నారని, కొట్టడం జరుగుతుంది.
నేమ్ ప్లేట్ ఏదని అడిగితే..
ఇటీవల ఎస్‌ఎఫ్‌ఐ నాయకురాలు ఐషీ ఘోష్, ఇతర విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియోను వైరల్ అయింది. పోలీసు వ్యాన్‌లో ఉన్న యూనిఫాం ధరించిన ఓ మహిళను ఐషీఘోష్ నేమ్ ప్లేట్ గురించి ప్రశ్నించినట్లు ఆ వీడియోలో కనిపించింది. నేమ్ ప్లేట్ ఎక్కడ ఉందని ప్రశ్నించిన అనంతరం ఆ మహిళా సిబ్బంది నిరసనకారులను వ్యాన్ నుంచి కిందకు దింపేసింది. ఈ ఘటనను వీడియో తీసేందుకు ప్రయత్నించగా అడ్డంకులు సృష్టించింది. పోలీసు యూనిఫాంలో ఉన్నవారి గుర్తింపు గురించి ప్రశ్నించే హక్కు నిరసనకారులకు లేదా? అనే ప్రశ్నలు ఈ ఘటనతో ముందుకొస్తున్నాయి.
ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పరా?
పోలీసు వ్యాన్లలోకి ఎక్కించి తీసుకెళ్తున్న నిరసనకారులను ఎక్కడికి తరలిస్తున్నారనే విషయం కూడా వారికి తెలియజేయడం లేదు. విద్యార్థులను అదుపులోకి తీసుకెళ్లే చర్యల్లో గుర్తింపు స్పష్టంగా లేని వ్యక్తులు కూడా పాల్గొంటున్నారు. పోలీసు, కేంద్ర బలగాల యూనిఫాంలను ధరించి నిరసనకారులపై దాడులు చేయడానికి కొందరు జంతర్‌మంతర్‌కు వస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. నిరసనలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం అండదండలతో బయటి వ్యక్తులను ఉపయోగిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. అయితే, వ్యాన్‌లో కనిపించిన యూనిఫాంలు ఎవరివి? వాటిని ఎవరు ఉపయోగిస్తున్నారు? యూనిఫాంలు ధరించిన వ్యక్తుల అధికారిక గుర్తింపు ఏమిటి? అనే అంశాల గురించి బయటకు రావాల్సిన విషయాలు ఉన్నాయి.
ప్రజాస్వామ్య హక్కులపై ప్రశ్నలు
సర్‌ను రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీలో నిరసనలు నిర్వహిస్తున్నాయి. ఈ ఆందోళనల సందర్భంగా పోలీసుల బలప్రయోగం, నిరసనకారులపై దాడులు, మహిళా కార్యకర్తల పట్ల దురుసు ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలు వెలువడ్డాయి. నిరసనకారులపై దాడులు చేసిన వ్యక్తుల గుర్తింపును నిర్ధారించాలని, నిర్బంధ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును పరిరక్షిం చడంతోపాటు, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది గుర్తింపు స్పష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ పరిణామాలు ముందుకు తెస్తున్నాయి.







కామెంట్‌లు (0)