నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మైనార్టీ గురుకుల స్కూల్,కాలేజ్ ధోబీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని మైనార్టీ గురుకుల స్కూల్స్, కాలేజీ ధోబి వర్కర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ఫైళ్ళ ఆశయ్య డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చెరుకు వెంకన్న అధ్యక్షతన అసోసియేషన్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆశయ్య మాట్లా డుతూ రాష్ట్రంలో 217 మైనార్టీ గురుకుల స్కూల్స్, కళాశాలల విద్యార్థినీ, విద్యార్థుల బట్టలు శుభ్రం చేయడానికి ఎన్నో ఏండ్ల నుంచి ధోబీ వర్కర్స్ పని చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం 10 సంవత్సరాల క్రితం నిర్ణయించిన అతి తక్కువ వేతనాలు ఇప్పటికీ ఇస్తున్నారనీ, అవి గిట్టుబాటు కాక ఆర్థికంగా వర్కర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో విద్యార్థికి డ్రెస్ ఉతికడానికి మండల కేంద్రాల్లో రూ:20, మున్సిపల్ పట్టణాల్లో రూ.25, కార్పొరేషన్ నగరంలో రూ.50 నిర్ణయించారే తప్ప అవి కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఇంటి అద్దెలు, రవాణా చార్జీల మూలంగా గిట్టుబాటు కాక దోబీ వర్కర్స్ ఆర్థికంగా చితికి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక హాస్టల్లో వృత్తి పని చేయడానికి సదుపాయాలైన నీరు, హౌస్ లు, బట్టలు ఆరేయడానికి తీగలు లేవనీ, వృత్తికి కావలసిన సౌకర్యాలు కల్పించి ధోబీ ఘాట్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. వృత్తికి కావాల్సిన ముడి సరుకులు సరుపు సబ్బు సోడా, బ్రెష్ అనేక హాస్టల్లో ధోబీ వర్కర్స్ కొనుగోలు చేసి పిల్లల బట్టలు శుభ్రం చేస్తున్నారని తెలిపారు. ఇచ్చే తక్కువ జీతాలతో ముడి సరుకులు కొనుగోలు చేయలేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే మైనారిటీ గురుకుల ధోబీ వర్కర్స్ ను గుర్తించి ప్రత్యేక ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎదునూరి మదార్ మాట్లాడారు.






కామెంట్‌లు (0)