Magazines

సొంతిటి కలను సాకారం చేయాలి

55 నిమిషాల క్రితం

Make your own dream come true.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 2 నిమిషాల చదవడం

ఇది మరో ఎన్నికల వాగ్ధానం కావొద్దు

లేకుంటే సింగరేణిలో మరో ఉద్యమం : సీఐటీయూ

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

సొంత ఇంటి కల పథకంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేసిన ప్రకటనను సీఐటీయూ స్వాగతించింది. అయితే ఆ ప్రకటన మరో ఎన్నికల వాగ్ధానం కావొద్దని కోరింది. భట్టి ప్రకటించిన అంశాలన్నింటిని వెంటనే అమల్లోకి తీసుకురావాలనీ, లేకుంటే సింగరేణిలో మరో ఉద్యమం తప్పదని హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. డిప్యూటీ సీఎం చేసిన ప్రకటనలో కొన్ని సానుకూల అంశాలు, మరికొన్ని పరిష్కరించాల్సి అంశాలున్నాయని పేర్కొంది. అందులో ముఖ్యంగా సీఐటీయూ యూనియన్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సొంతింటి కల నెరవేర్చాలని ప్రభుత్వం పోరాటం చేస్తున్న అంశం కూడా ఉందని తెలిపింది. సొంతింటి కల నెరవేర్చడం కోసం లేఅవుట్‌లు నిర్మించి పండిట్ జవాహర్‌లాల్ నెహ్రూ హౌసింగ్ కాలనీ పేరుతో నిర్మించడంతో పాటు నివాసయోగ్యంగా లేని క్వార్టర్స్ కూల్చి, నూతనంగా నిర్మించి ఉద్యోగులకు శాశ్వతంగా ఇచ్చేందుకు నివేదిక తెప్పించుకుని పనులు ప్రారంభిస్తామనడాన్ని సీఐటీయూ స్వాగతించింది.

అన్ని ఏరియా హాస్పిటల్స్‌ని అప్‌గ్రేడ్ చేసి కార్పొరేట్ స్థాయిలో సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పడం కూడా మంచి విషయమని సీఐటీయూ పేర్కొంది. బొగ్గు గనుల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓవర్ బర్డెన్ డంపింగ్ ప్రాంతాల్లో ప్రజలు అనేక రకాల రోగాలతో, ముఖ్యంగా క్యాన్సర్ వంటి రోగాలతో బాధపడుతున్నారని గుర్తుచేసింది. ఇలాంటి వారిని గుర్తించేందుకు అన్ని పల్లెల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తామనడాన్ని స్వాగతించింది. సీఐటీయుగా గత అనేక సంవత్సరాలుగా పోరాటంలో డిమాండ్ అయిన పెర్క్స్‌పై ఇన్‌కమ్‌టాక్స్‌ను రీ`ఎంబర్స్ చేయాలని, కోలిండియా మాదిరిగా తిరిగి చెల్లించాలని కోరుతుందని, దాన్ని కూడా చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించారని తెలిపింది. బినామీ పేర్ల సమస్యగా, రీ`ఎంప్లాయిమెంట్ సమస్యగా అవ్వచ్చు దాన్ని కూడా త్వరలోనే పరిష్కారం చేస్తామని చెప్పారని తెలిపింది.

కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు కనీసం రూ.10 వేలు బోనస్ ఇవ్వాలి

దసరాకు లాభాల్లో 34 శాతం ప్రకటించారనీ, ప్రతి కార్మికునికి రూ.1,53,912 బోనస్ క్రింద అందుతుందని సీఐటీయూ తెలిపింది. కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5 వేలు మాత్రమే ప్రకటించి అన్యాయం చేశారని విమర్శించింది. భట్టి ప్రకటన 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను నిరాశపరిచిందని ఆక్షేపించింది. కనీసం రూ.10 వేలు ప్రకటించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్