సీఈసీ జ్ఞానేశ్వర్‌కుమార్‌ను తొలగించాలి
కరువు పరిస్థితులపై కేంద్రం స్పందించాలి
ఆర్టీసీ ఎన్నికల్లో ఎర్రజెండా సంఘాల విజయంపై అభినందనలు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఓటు హక్కు హరణ ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్య పునాదులనే దెబ్బతీస్తున్నదని విమర్శించారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విచారణ లేకుండా మూకుమ్మడిగా ఓట్లను తొలగించడం అన్యాయమన్నారు.
జంతర్‌మంతర్‌లో నిరసనలకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును అణచివేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో 315 మండలాల్లో కరువు పరిస్థితులున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నదనీ, వాటిని వెంటనే కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరువు సహాయం విషయంలో కేంద్రం సహకరించాలని కోరారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులను పెంచాలని నొక్కి చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగిన ఆర్టీసీ ఎన్నికల్లో ఏఐటీయూసీ అనుబంధ సంఘం విజయం సాధించడం కార్మిక వర్గ చైతన్యానికి నిదర్శనమన్నారు. నాయకులకు, కార్మికులకు అభినందనలు తెలిపారు. ఆర్టీసీలోనూ ఎర్రజెండా సంఘాలకు కార్మికులు పట్టం గట్టారనీ, సింగరేణిలోనూ కార్మికులు ఎర్రజెండా సంఘాలపై విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూకి బీఆర్‌ఎస్, బీజేపీ, ఇతర పార్టీలు మద్దతు ఇచ్చాయంటూ ఫలితాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. కమ్యూనిస్టులకు బీజేపీ వాళ్లు ఎక్కడైనా ఓట్లు వేస్తారా? అని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ తమ మద్దతు కోరలేదనీ, సీపీఐ(ఎం), స్వతంత్ర అభ్యర్థులు సంప్రదిస్తున్నారని తెలిపారు. ముందుగా ఓటర్ల నమోదు ప్రక్రియపై దృష్టి సారించామనీ, త్వరలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. రూ.5 వేల కోట్ల విద్యుత్ అదనపు భారాన్ని ప్రజలు భరించలేరన్నారు. అన్ని పక్షాలను సమావేశపరిచి, అందరికీ ఆమోదయోగ్యమైన మధ్యేమార్గాన్ని అన్వేషించాలని సూచించారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ మాట్లాడుతూ..కరువు పరిస్థితుల నేపథ్యంలో ఎకరాకు వరి రైతులకు రూ.30 వేలు, పత్తి రైతులకు రూ.50 వేలు, ఇతర పంటలకు రూ.20 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి యుద్ద ప్రతిపాదికన రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీఎస్.బోస్ మాట్లాడుతూ..ఎంప్లాయీస్ యూనియన్‌పై కార్మికులు విశ్వాసంతో విజయం అందించారనీ, ఆ తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.బాబు, కోశాధికారి ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ..ఆర్టీసీ ఎన్నికల్లో కార్మికుల తీర్పును వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.






కామెంట్‌లు (0)