Magazines

అంతుపట్టని మస్క్‌ వ్యూహం

1 గంట క్రితం

Elon Musk
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 4 నిమిషాల చదవడం

అంబానీ సహా భారత కుబేరులపై ఆరోపణలు
స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారంటూ విమర్శలు

మరోవైపు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు భారీగా ఆర్థిక సాయం

న్యూఢిల్లీ : ట్రిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ వ్యూహమేమిటో అంతుపట్టడం లేదు. భారత ఉపగ్రహ మార్కెట్‌లోకి తన స్టార్‌లింక్‌ ప్రవేశించాలని అపర కుబేరుడైన ఎలాన్‌ మస్క్‌ కోరుకుంటున్నారు. అందులో తప్పేమీ లేదు. అయితే ప్రభుత్వ అనుమతుల కోసం ఆయన నిశ్శబ్దంగా వేచి చూడడం లేదు. సామాజిక మాధ్యమాల్లో వరుస పోస్టులు పెడుతూ తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలోని శక్తివంతమైన వ్యాపార వర్గాలు తన స్టార్‌లింక్‌ను అడ్డుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు. రిలయన్స్‌ ఇండిస్టీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీని లక్ష్యంగా చేసుకొని ఆయనపై అనేక ఆరోపణలు సంధించారు. ఆయనను 'ప్రధాని అంబానీ' అని సంబోధిస్తూ భారతదేశంలో కుబేరుల ప్రభావాన్ని ప్రశ్నించారు. అయితే మస్క్‌ ఆరోపణలలోని వైరుధ్యాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. మస్క్‌ ప్రదర్శిస్తున్న పరస్పర విరుద్ధ వైఖరులు ఆయన రెండు నాల్కల ధోరణికి అద్దం పడుతున్నాయి. అమెరికా రాజకీయాలపై ఆయన ఆర్థికంగా ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌పై ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన నేతృత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు మస్క్‌ ఆర్థికంగా సాయపడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకవైపు అమెరికాలో ట్రంప్‌, ఆయన రిపబ్లికన్‌ పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉంటూ మరోవైపు భారత్‌లోని కుబేరులపై విమర్శలు, ఆరోపణలు చేయడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా నిలుస్తోంది.

ఎవరికి ఎంత విరాళం ?

రాయిటర్స్‌ వార్తా సంస్థ నివేదిక ప్రకారం మధ్యంతర ఎన్నికల కోసం మస్క్‌ 366 మిలియన్‌ డాలర్లు (రూ.34,976 కోట్లు) ఖర్చు చేశారు. ఇందులో జూలై నుంచి చేసిన ఖర్చే 276 మిలియన్‌ డాలర్లు (రూ.26,343 కోట్లు). రిపబ్లికన్లకు ఎన్నికల విరాళాలు అందజేసిన వారిలో మస్క్‌దే అగ్రస్థానం. ఈ మొత్తంలో ఎక్కువ భాగం సెనెట్‌, ప్రతినిధులసభకు పోటీ చేస్తున్న రిపబ్లికన్‌ అభ్యర్థులకు మద్దతు ఇచ్చే బృందాలకే చేరింది. రిపబ్లికన్‌ పార్టీ తరఫున సెనెట్‌కు పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతు ఇస్తున్న సెనెట్‌ లీడర్‌షిప్‌ ఫండ్‌కు 158 మిలియన్‌ డాలర్లు (రూ.15,103 కోట్లు), మస్క్‌ సొంత రాజకీయ కార్యాచరణ కమిటీ అయిన అమెరికా ప్యాక్‌కు 76 మిలియన్‌ డాలర్లు (రూ.7,265 కోట్లు) చేరాయి. ప్రతినిధులసభకు పోటీ చేస్తున్న రిపబ్లికన్‌ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్‌షనల్‌ లీడర్‌షిప్‌ ఫండ్‌కు కూడా 20 మిలియన్‌ డాలర్లను (రూ.1,912 కోట్లు) మస్క్‌ విరాళంగా అందించారు. వీటితో పాటు టెక్సాస్‌ అటార్నీ జనరల్‌ కెన్‌ పాక్స్‌టన్‌ సెనెట్‌ ప్రచారానికి బాసటగా ఉంటున్న లోన్‌ స్టాన్‌ లిబర్టీ ప్యాక్‌కు పది మిలియన్‌ డాలర్లు, రిపబ్లికన్‌ గవర్నర్స్‌ అసోసియేషన్‌కు 10 మిలియన్‌ డాలర్లు (రూ.956 కోట్లు) అందాయి.

టెక్సాస్‌లో జరుగుతున్న సెనెట్‌ పోటీలో మస్క్‌ విరాళం కీలక పాత్ర పోషిస్తోంది. అక్కడ రిపబ్లికన్‌ అభ్యర్థి పాక్స్‌టన్‌, డెమొక్రటిక్‌ స్టేట్‌ రిప్రజెంటేటివ్‌ జేమ్స్‌ టలారికో మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. టెక్సాస్‌లో 1994 నుంచి ఇప్పటి వరకూ ఒక్క డెమొక్రాట్‌ కూడా విజయం సాధించలేదు. టెక్సాస్‌ పోరుకు వంద మిలియన్‌ డాలర్లకు పైగా విరాళం అందిస్తానని సెనెట్‌ లీడర్‌షిప్‌ ఫండ్‌ హామీ ఇచ్చింది. మస్క్‌ అందజేసిన విరాళం ఆ రాష్ట్రంలో రిపబ్లికన్ల వ్యయాన్ని పెంచింది. రాయిటర్స్‌ కథనం ప్రకారం మస్క్‌కు చెందిన పీఏసీ ఏడు రాష్ట్రాలలో రిపబ్లికన్‌ అభ్యర్థులకు, 30 మందికి పైగా ప్రతినిధిసభ అభ్యర్థులకు మద్దతు ఇస్తోంది.

పెరిగిన విరాళాలు

మధ్యంతర ఎన్నికలు ట్రంప్‌కు అగ్నిపరీక్షగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇరాన్‌ యుద్ధం తర్వాత ఆయన రేటింగ్‌ దారుణంగా పడిపోయింది. కాంగ్రెస్‌పై పట్టు నిలుపుకోవడానికి రిపబ్లికన్లు చెమటోడ్చి పోరాడాల్సి వస్తోంది. మరోవైపు ఉభయసభలపై నియంత్రణ సాధించి ట్రంప్‌ దూకుడును అడ్డుకోవాలని డెమొక్రాట్లు ప్రయత్నిస్తున్నారు. తన 'రాజకీయ విరాళాల'ను తగ్గించుకుంటానని గతంలో చెప్పిన మస్క్‌ ఆ పని చేయకపోగా వాటిని మరింతగా పెంచేశారు. అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్‌కు ఆర్థిక సాయం అందించిన మస్క్‌ ఆ తర్వాత ప్రభుత్వంలో చేరారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే 'డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ' విభాగానికి నేతృత్వం వహించారు. అయితే దేశీయ విధానాలపై ట్రంప్‌తో విభేదించి ఆ పదవిని వదిలి పెట్టారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించిందుకు మస్క్‌కు ట్రంప్‌ 'నేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ సైన్స్‌'ను ప్రదానం చేశారు కూడా.

ధనదాహం తీరడం లేదా ?

వచ్చే నెల 3వ తేదీన అమెరికాలో జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల విజయం కోసం మస్క్‌ 366 మిలియన్‌ డాలర్లు వెచ్చించడాన్ని సెనెటర్‌ బెర్నీ శాండర్స్‌ ప్రశ్నించారు. 2024 అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్‌ గెలుపు కోసం మస్క్‌ 290 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారని కూడా ఆయన ఎత్తిచూపారు. ట్రంప్‌ విజయం తర్వాత మస్క్‌ సంపద ఇబ్బడిముబ్బడిగా పెరిగిందని గుర్తు చేశారు. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి మస్క్‌ 696 బిలియన్‌ డాలర్లు సంపాదించి ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌ అయ్యారని తెలిపారు. అయినా ఈ సంపద సరిపోవడం లేదని, మస్క్‌ ధనదాహం తీరడం లేదని ఎత్తిపొడిచారు. ఇకనైనా మస్క్‌ను నిలువరించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
బిలియనీర్ల ప్రభావంపై చర్చ
తాజాగా భారతీయ కుబేరులపై మస్క్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత బిలియనీర్ల ప్రమేయంపై చర్చ తెర పైకి వచ్చింది. కొద్ది మంది ధనవంతులు లేదా పలుకుబడి కలిగిన వ్యక్తుల చేతిలో రాజకీయ వ్యవస్థ కేంద్రీకృతమవుతోంది. కుబేరుల సంపద ప్రభుత్వ విధానాల పైన, ఎన్నికల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని సెనెటర్‌ శాండర్స్‌ చాలా కాలంగా వాదిస్తున్నారు. ధనవంతుడు రాజకీయ ప్రచారం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయగలడు. ఆ డబ్బు ప్రకటనలకు, ఓటర్లను చేరుకోవడానికి, ఇతర ప్రచార కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగపడుతుంది. ఫలితంగా ధనవంతుల మద్దతు ఉన్న అభ్యర్థులకు, వారి లక్ష్యాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఎన్నికలలో విజయం సాధించిన వారు తమకు ఆర్థికంగా చేయూత ఇచ్చిన వారి ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నిస్తారు. అంతిమంగా ప్రభుత్వ వ్యవస్థలో కుబేరుల జోక్యం పెరుగుతూ ఉంటుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్