Magazines

హ్యామ్ రోడ్ల పనులను వేగవంతం చేయాలి

50 నిమిషాల క్రితం

Minister Seethakka
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 2 నిమిషాల చదవడం

ఇంజినీరింగ్ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు

​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

హ్యామ్‌ రోడ్ల పనులను వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఇంజినీర్స్‌ ‌భవన్‌‌లో నిర్వహించిన ఇనిస్టిట్యూషనల్ స్ట్రెంతనింగ్‌ ప్రోగ్రామ్‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. హ్యామ్‌ రహదారుల అభివృద్ధి పనుల పురోగతి, లక్ష్యాలు, అమలు తీరుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 7,448 కిలోమీటర్లకు పైగా హామ్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామనీ, ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.రహదారులు కేవలం ప్రయాణ సౌకర్యాలు మాత్రమే కాదనీ, ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నాయనీ పేర్కొన్నారు. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడాలన్నా, అత్యవసర సమయంలో అంబులెన్స్ ఆస్పత్రికి చేరాలన్నా, గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు అందాలన్నా రహదారులు ఎంతో అవసరమన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల సౌకర్యం సరిగా లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు అక్కడ పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

రోడ్ల నిర్మాణంలో వేగంతో పాటు నాణ్యతకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. పనులు చేపట్టే ఏజెన్సీలతో అధికారులు నిరంతరం సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని సమీక్షించాలని ఆదేశించారు. ​గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణంతో పాటు ఇందిరా మహిళా శక్తి భవనాలు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఇందిరా మహిళా శక్తి భవనాల పనులను నవంబర్ 19న ఇందిరా గాంధీ జయంతి నాటికి పూర్తి చేసేలా కృషి చేయాలని సూచించారు. ​పనులు ప్రారంభించకుండా జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్ల విషయంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కాంట్రాక్టులను రద్దు చేసి ఇతర ఏజెన్సీలకు పనులు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు.

​ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు అంకితభావంతో పనిచేయాలని, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అధికారులకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిశోర్, ఈఎన్‌సీ జగదీశ్వర్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్