Magazines

జంతర్‌ మంతర్‌లోకి సీజేపీ నేతలు

57 నిమిషాల క్రితం

Jantar Mantar
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 2 నిమిషాల చదవడం

అశుతోష్‌ రంకా, సౌరవ్‌ దాస్‌ సహా పలువురు కార్యకర్తల నిర్బంధం

నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలకు దశాబ్దాలుగా వేదికగా నిలిచిన జంతర్‌ మంతర్‌ను ఆందోళన స్థలాల జాబితా నుంచి తొలగించిన మరుసటి రోజే అక్కడికి సీజేపీ నేతలు ప్రవేశించి నిరసన చేప‌ట్టారు. మంగళవారం తెల్లవారుజామున జాతీయ జెండాలను చేతబూనిన కార్యకర్తలు బారికేడ్లు, గేట్లు దాటి జంతర్‌ మంతర్‌ వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడ మోహరించి ఉన్న పోలీసులు సీజేపీ నేతలు అశుతోష్‌ రంకా, సౌరవ్‌ దాస్‌, అజింక్య షిండేతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులు పట్టువదలకుండా జాతీయ జెండాలు ప‌ట్టుకుని ‘భారత్ మాతకు జై’, 'ఇంక్విలాబ్ జిందాబాద్' అంటూ నినాదాలు హోరెత్త‌తించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశారు. కొద్దిసేపటికే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.జంతర్‌ మంతర్‌ను నిరసనల వేదికగా తొలగించడంపై, నేతల నిర్బంధంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించారు. ఇది కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదని, ప్రజల నిరసన హక్కుకు ప్రతీక అని పేర్కొన్నారు.

నిరసన వేదికను అధికారికంగా తొలగించవచ్చేమో కానీ, ప్రజల స్ఫూర్తిని అడ్డుకోలేరన్నారు. నిర్బంధానికి ముందు జంతర్‌ మంతర్‌లోకి ప్రవేశించడాన్ని సీజేపీ నేతల విజయంగా అభివర్ణించారు. దేశంలో నియంతృత్వ ధోర‌ణి న‌డుస్తున్న‌ద‌ని దీప్కే మండిప‌డ్డారు. పాల‌కులు నిబంధనలను విస్మరిస్తున్నారని విమ‌ర్శించారు. త‌ప్పు చేయ‌కుండా వాళ్లు దేనికి భ‌య‌ప‌డుతున్నార‌ని ప్ర‌శ్నించారు. సీజేపీ ముఖ్య నాయ‌కుల‌ను అదుపులోకి తీసుకుని, వేర్వేరు చోట్ల నిర్బంధించార‌ని అన్నారు. వారితో పాటు ఉన్న 11 మంది వాలంటీర్లను వేరే ప్రాంతానికి తరలించారన్నారు. సీజేపీ లీగల్ హెడ్ రత్నాసింగ్‌తో మాట్లాడాన‌ని, న్యాయవాదులు పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లినప్పుడు పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదని చెప్పారు. త‌మ పార్టీకి చెందిన ఇతర వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు బెదిరించారని వెల్లడించారు. యువత తమ హక్కుల కోసం ఉద్యమాన్ని కొనసాగించాలని సౌరవ్‌ దాస్‌ పిలుపునిచ్చారు. జంతర్‌ మంతర్‌ నిరసనల వేదికగా కొనసాగాలని అశుతోష్‌ రంకా వ్యాఖ్యానించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్