రాస్తారోకో.. మెదక్‌లో
స్తంభించిన ట్రాఫిక్
నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని
రజక సంఘాల డిమాండ్
కొత్త విగ్రహం ఏర్పాటు
చేయాలని సీపీఐ(ఎం) విజ్ఞప్తి
నవతెలంగాణ-మెదక్ (రామాయంపేట)
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ విగ్రహం ధ్వంసమైన ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తతకు దారితీసింది. మెదక్ వెల్కమ్ బోర్డు సమీపంలోని ఐలమ్మ విగ్రహం విరిగి ముక్కలుగా పడి ఉండటాన్ని గుర్తించిన రజక సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం పట్టణంలో సుమారు రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులతో మాట్లాడటంతో నిరసన విరమించారు. ఈ సందర్భంగా రజక సంఘం పట్టణ అధ్యక్షులు మల్లేశం, యువజన నాయకులు బక్కవారి శివ, విజయ్, సంతోష్, వేణు, నవీన్ తదితరులు మాట్లాడారు. ఐలమ్మ విగ్రహం ధ్వంసం కావడం బాధాకరమన్నారు. ఘటనకు కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సీఐ మహేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ ఘటనపై వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు రజక సంఘం ఆందోళనకు మద్దతు తెలిపారు.
కోతుల దాడితోనే విగ్రహం ధ్వంసం: సీఐ
ఐలమ్మ విగ్రహాన్ని ఎవరూ ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయలేదని, కోతుల దాడి కారణంగానే విగ్రహం విరిగిపోయిందని పట్టణ సీఐ మహేశ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా నమోదయ్యాయని అన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కొత్త విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యే హామీ
ఐలమ్మ విగ్రహం ధ్వంసమైన విషయాన్ని మున్సిపల్ పాలకపక్ష నాయకులు నరేశ్‌గౌడ్, కానుగ రాజు, మాజీ వైస్‌చైర్మన్ రాగి అశోక్, గంగాధర్ తదితరులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే నాణ్యమైన కొత్త విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. ఇందుకు రజక సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఘటనపై సీపీఐ(ఎం) ఖండన
ఐలమ్మ విగ్రహం ధ్వంసమైన ఘటనను సీపీఐ(ఎం) మెదక్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. మంగళవారం విగ్రహం వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించిన పార్టీ జిల్లాకార్యదర్శి కె.నర్సమ్మ మాట్లాడుతూ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి అరెస్టు చేయాలని, కొత్త విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విగ్రహం కోతుల కారణంగా కూలిపోయిందని పోలీసులు చెబుతున్నట్టు ప్రస్తావించిన ఆమె, పక్కనే ఉన్న బతుకమ్మకు ఎలాంటి నష్టం జరగకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. విగ్రహం ఎలా కూలిపోయిందనే విషయంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కె.మల్లేశం, నాయకులు రెడ్డి, వెంకట్ పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)