భారత్ సహా 37 దేశాల్లో అధ్యయనం
సామాజిక మాధ్యమాలు మంచివేనని కితాబు
సోషల్ మీడియాపై
ప్యూ రిసెర్చ్ సెంటర్ సర్వేలో భారతీయుల మనోగతం
న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యానికి సోషల్ మీడియా చెడు కంటే మంచే ఎక్కువ చేస్తోందని మెజారిటీ భారతీయులు అభిప్రాయపడ్డారు. భారత్ సహా 37 దేశాల్లో ప్యూ రిసెర్చ్ సెంటర్ సర్వే నిర్వహించగా మన దేశంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు సామాజిక మాధ్యమాలు మంచివేనని కితాబు ఇచ్చారు. నలుగురిలో ఒకరి కంటే తక్కువ మంది భారతీయులు మాత్రమే సోషల్ మీడియా చెడ్డదని చెప్పారు. కొన్ని దేశాలలో 55 శాతం మంది సోషల్ మీడియాను సమర్ధించగా భారత్, దక్షిణాఫ్రికా దేశాలలో 66 శాతం మంది సామాజిక మాధ్యమాల పాత్రపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 8 - ఏప్రిల్ 27 తేదీల మధ్య ఈ సర్వే జరిగింది. ప్యూ రిసెర్చ్ సంస్థ తన సర్వేలో 3,566 మంది భారతీయులను ఇంటర్వ్యూ చేసింది.
పేద దేశాలలోనే సానుకూలత
సోషల్ మీడియా విషయంలో అత్యంత సానుకూలత వ్యక్తం చేసినవి ఎక్కువగా పేద దేశాలే. ఈ జాబితాలో నైజీరియా అగ్రస్థానంలో ఉంది. అక్కడ పది మందిలో ఎనిమిది మంది సామాజిక మాధ్యమాలను సమర్ధించారు. సర్వే జరిగిన దేశాలలో అత్యంత సంపన్నమైన దేశం సింగపూర్ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. డచ్ వారిలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ మంది, అమెరికన్లలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది మాత్రమే ప్రజాస్వామ్యానికి సోషల్ మీడియా మంచిదేనని తెలిపారు. తలసరి స్థూల జాతీయోత్పత్తి తక్కువగా ఉన్న దేశాలలో ప్రజలకు సోషల్ మీడియా పట్ల చాలా తక్కువ వ్యతిరేకత ఉంది. ప్యూ సంస్థ ఉపయోగించిన ప్రపంచబ్యాంక్ గణాంకాల ప్రకారం 2025 నాటికి మన దేశంలో తలసరి ఆదాయం 2,702 డాలర్లుగా ఉంది. ప్యూ సర్వే చేసిన దేశాలన్నింటిలోనూ ఇదే తక్కువ. ఏడు సంపన్న దేశాలలో చాలా మంది ప్రజలు సోషల్ మీడియా వలన మంచి కంటే చెడే ఎక్కువ జరిగిందని తెలిపారు.
సామాజిక మాధ్యమాల ప్రభావంపై భిన్నాభిప్రాయాలు
మన దేశంలో ప్రతి పది మందిలో ఒకరి కంటే ఎక్కువ మంది సోషల్ మీడియా గురించి తమకేమీ తెలియదని చెప్పారు. ఇంటర్నెట్ లేదా సోషల్ మీడియా కారణంగా ప్రజలకు మరింత సమాచారం అందుతోందా, వారు రాజకీయాలపై తమ అభిప్రాయాలను బాగా చెప్పగలుగుతున్నారా, తప్పుడు సమాచారంతో మోసపోతున్నారా అని ప్యూ సంస్థ ప్రజలను ప్రశ్నించింది. ప్రజలకు మరింత సమాచారం అందుతోందని మూడింట రెండు వంతుల మంది భారతీయులు చెప్పారు. సోషల్ మీడియా ప్రజల మధ్య విభేదాలను సృష్టిస్తోందని సగం మంది కంటే ఎక్కువ మందే తెలియజేశారు. తప్పుడు సమాచారంతో ప్రజలను మోసం చేయడం తేలిక అవుతుందని ప్రతి ఐదుగురిలో ముగ్గురి కంటే ఎక్కువ మంది అన్నారు.
ఫేస్‌బుక్ వినియోగమే అధికం
ప్రజాస్వామ్యంపై సోషల్ మీడియా సానుకూల ప్రభావమే చూపుతోందని అనేక దేశాలలోని యువత అభిప్రాయపడ్డారు. మన దేశంలో 18 - 34 సంవత్సరాల మధ్య వయస్కులలో నలుగురిలో ముగ్గురు ఇదే మాట చెప్పగా, 35 - 49 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో ప్రతి పది మందిలో ఏడుగురు ఈ వాదనతో ఏకీభవించారు. మన దేశంలో ప్రతి పదిమందిలో ఏడుగురు ఫేస్‌బుక్‌ను ఫాలో అవుతున్నారు. ప్రతి ఐదుగురిలో ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తుండగా ఎక్స్‌్‌ను అతి తక్కువగా పది మందిలో ఒకరి కంటే తక్కువ మందే వినియోగిస్తున్నారు. ప్రతి ఐదుగురు భారతీయులలో ఒకరు స్నాప్‌ఛాట్‌ను వాడుతున్నారు. కొన్ని దేశాలలో టిక్‌టాక్ వినియోగం బాగానే ఉన్నప్పటికీ భారత్‌లో దానిని 2020 నుంచి నిషేధించారు.







కామెంట్‌లు (0)