Magazines

‌కొత్తగా ఆలోచించండి

38 నిమిషాల క్రితం

Think
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 3 నిమిషాల చదవడం

చాలా మంది జీవితంలో ఎన్నో సాధించాలని అనుకుంటారు. కానీ కొందరు మాత్రం కొన్ని మెట్ల తర్వాత ఆగిపోతారు. మరికొందరు మాత్రం ప్రతి మెట్టులో ప్రతికూలతలు ఎదురైనా వెనక్కి తగ్గరు. ‘ఫోర్బ్స్‌ సెల్ఫ్‌–మేడ్‌ ఉమెన్‌’ సంపన్నుల జాబితాలో వరుసగా తొమ్మిదవసారి చోటు సాధించిన డెబ్బై తొమ్మిది ఏండ్ల డయాన్‌ హెండ్రిక్స్‌ రెండో కోవకు చెందిన మహిళ. ‘పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్‌ కావాలి’ అని చిన్నప్పటి నుంచే కలలు కన్న ఆమె ఆ కలను సాకారం చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఖర్చుల కోసం టాయిలెట్లు శుభ్రం చేసిన రోజులూ ఆమె జీవితంలో ఉన్నాయి. ‘విజయం అంటే కొత్తగా ఆలోచించడం. మార్కెట్‌లోని లోటుని భర్తీ చేయడం’ అంటున్న ఆ మహిళా వ్యాపారవేత్త పరిచయం నేటి మానవిలో...


పదేండ్ల వయసు నుంచే ఎంటర్‌ప్రెన్యూర్‌ కావాలని కలలు కనేవారు డయాన్‌ హెండ్రిక్స్‌. ‘చిన్నప్పుడు ఎన్నో కలలు కంటాం.. అవి నిజమవుతాయా!’ అని ఆ తరువాత అనుకోలేదు డయాన్‌. తన ‘లక్ష్యం’ అనే మొక్కను పదిలంగా కాపాడుకుంటూ వచ్చారు. కలను సాకారం చేసుకొని ‘సెల్ఫ్‌–మేడ్‌ ఉమెన్‌ బిలియనీర్‌’గా జేజేలు అందుకుంటున్నారు డయాన్‌.


అప్పులు చేసి మరీ...

తొమ్మిదవసారి అమెరికా రిచెస్ట్‌ సెల్ఫ్‌–మేడ్‌ ఉమెన్‌(2026) జాబితాలో చోటు సాధించి తన ప్రత్యేకత నిలుపుకున్నారు డయాన్‌. ఆమె సంపదలో అధిక భాగం ఆమె రూఫింగ్‌ మెటీరియల్‌ కంపెనీ ‘ఏబీసీ సప్లై’కి చెందినదే. తన భర్త కెన్‌ హెండ్రిక్స్‌తో కలిసి 1989 లో ఈ కంపెనీని ఆమె స్థాపించారు. ఆరోజుల్లో వివిధ తయారీదారులు తయారు చేసిన రూఫింగ్‌ మెటీరియల్స్‌ ఒకేచోట దొరికే దుకాణాలు చాలా తక్కువగా ఉండేవి. ఇది గ్రహించిన డయాన్‌ ‘ఏబీసీ సప్లై’ కంపెనీకి శ్రీకారం చుట్టారు. ఈ కంపెనీ ప్రారంభించడానికి బ్యాంక్‌ నుంచి అప్పు చేయాల్సి వచ్చింది. ఆస్తులను తాకట్టు పెట్టాల్సి వచ్చింది. విస్కాన్సిన్‌లోని బెలోయిట్‌ కేంద్రంగా మొదలైన కంపెనీ కొన్నేండ్లలో లాభాల బాట పట్టింది.


మార్కెట్‌‌లోని లోటు భర్తీ చేయడమే...

‘నా విజయ రహస్యం...మార్కెట్‌లోని ఒక లోటును భర్తీ చేయడం’ అంటారు డయాన్‌. ఒస్సియో(యూఎస్‌)లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో పెరిగిన డయాన్‌ పెద్ద నగరంలో ఉండాలని, నీలం రంగు సూట్లు ధరించి, ఖరీదైన కార్లు నడపాలని కలలు కనేవారు. అయితే చిన్న వయసులోనే పెండ్లి జరిగింది. వెంటనే గర్భం దాల్చడంతో ఇంటి నుంచే చదువు పూర్తి చేశారు. కాలేజీ చదువు కంటే రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కెరీర్‌ వెదుక్కోవడానికి చిన్నాచితకా పనులు చేశారు. చిన్న వయసులో తల్లి అయిన డయాన్‌ తన ఖర్చుల కోసం ప్లేబాయ్‌ బన్నీ(ప్లేబాయ్‌ క్లబ్‌లో పనిచేసే కాక్‌టెయిల్‌ వెయిట్రెస్‌)గా కూడా పనిచేశారు. అంటే మొదటి నుండి స్వయం కృషితో బతకాలి అనేది ఆమె నిజమైన విజయ రహస్యంగా చెప్పుకోవచ్చు.


క్యాన్సర్‌ను జయించి...

తన జీవిత ప్రయాణంలో రెండు సార్లు క్యాన్సర్‌ బారిన పడ్డారు డయాన్‌. తన సంకల్పబలమే క్యాన్సర్‌ను జయించే శక్తిని ఇచ్చింది. ఇక భర్త మరణం ఆమెను దుఃఖంలో ముంచెత్తింది. కష్టకాలంలో, నిరాశానిస్పృహల చీకటిలో కూడా... ‘సాధించాలి. తప్పకుండా సాధించాలి’ అని గట్టిగా ఒకటికి పదిసార్లు అనుకునేవారు డయాన్‌. ప్రారంభ రోజుల్లో ఖర్చుల కోసం టాయిలెట్లు శుభ్రం చేసేవారు. పాత ఇంటిని కొని స్వయంగా మరమ్మతు చేసి కాలేజీ స్టూడెంట్స్‌కు అద్దెకు ఇచ్చారు. ఇలా ఎన్నో కష్టాలు పడి జీవితం, డబ్బు విలువ తెలుసుకున్నారు.


నూతన ఆవిష్కరణలతో...

డయాన్‌ నాయకత్వంలో, మార్గదర్శకత్వంలో ‘ఏబీసీ సప్లై కో’ కంపెనీ ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు చేస్తూ మార్కెట్‌లో దూసుకుపోతోంది. మార్కెట్‌ పోకడలకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకుంటోంది. వ్యర్థాల తగ్గింపు, పర్యావరణ అనుకూల ఉత్పత్తులపై దృష్టి పెడుతోంది. రైతుబిడ్డ నుండి బిలియనీర్‌ వ్యాపారవేత్తగా డయాన్‌ ప్రయాణం అనేది పట్టుదల, అపారమైన ధైర్యసాహసాల కలబోత. ఎంతోమంది ఔత్సాహికులకు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే అపూర్వ విజయం ఆమె సొంతం.


కొత్తగా ఆలోచించాలి

‘ఎంటర్‌ప్రెన్యూర్‌ కావాలనుకునే యువతకు మీరు ఇచ్చే సలహా ఏమిటి?’ అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన జవాబు... ‘వ్యాపారవేత్తగా రాణించడం అనేది చాలా కష్టం. మూస ఆలోచనలు కాకుండా ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలి. మీరు చేయాలనుకుంటున్నది మార్కెట్‌కు ఎంత అవసరం... అనేది మీకు మీరు వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న. వ్యాపారంలో విలువైన సమయంతోపాటు, డబ్బు కూడా కోల్పోవలసి రావచ్చు. అలా అని భయపడకూదు. రిస్క్‌ తీసుకో వాలి. ఎంత రిస్కైనా సరే!’ అంటారు ఆమె. ఎంతో మంది ఔత్సాహికులు తమ కలలను నిజం చేసుకోవడంలో సహాయపడిన డయాన్‌ దాతృత్వ కార్యక్రమాలలోనూ ముందుంటారు.


సరైనదా కాదా?

‘కష్టపడి పనిచేసి నా కలలను నిజం చేసుకున్న ఒక సాధారణ అమెరికన్‌ అమ్మాయిని, రైతు బిడ్డను. వ్యక్తిగత, వృత్తి జీవితంలో నన్ను ఎక్కువగా ప్రభావితం చేసింది నా తల్లిదండ్రులు. మా నాన్న ఏది సరైనదో, ఏది కాదో చెప్పేవారు. ‘నేను చేస్తున్న పని సరైనదేనా అని నిన్ను నువ్వు ఎప్పటిక ప్పుడు ప్రశ్నించుకుంటే నిర్ణయాలు తీసుకోవడం సులభం అవుతుంది’ అని చెప్పేవారు. టెన్‌ కమాండ్‌మెంట్స్‌ నా వ్యక్తి గత జీవితంలోనే కాకుండా వృత్తిజీవి తంలోనూ ప్రభావాన్ని చూపుతున్నాయి. నేను వాటిని మళ్లీ మళ్లీ చదువుతాను. ఒక్కముక్కలో చెప్పాలంటే ఏది సరిౖయెనదో, ఏది తప్పో అవి వివరిస్తాయి’ అంటారు డయాన్‌.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్