రాష్ట్రంలో కరువు కోరలు చాస్తోంది. తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండిపోతుండగా, పెట్టుబడులు నేలపాలై రైతులపై అప్పుల భారం పెరుగుతోంది. పంట నష్టాలు, అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక ఆదిలాబాద్‌కు చెందిన రైతు తీగల రమేశ్, సిద్దిపేటకు చెందిన కౌలురైతు లోకుల సైరాం ఆత్మహత్య చేసుకోవడం ఈ సంక్షోభ తీవ్రతకు నిదర్శనం. ఇది ఒక్కో కుటుంబ విషాదం మాత్రమే కాదు.. కరువు రైతు ఆర్థిక జీవితాన్ని ఎంతగా కుంగదీస్తుందో చెప్పే హెచ్చరిక. కరువు ముప్పు ముందే కనిపించినా, వర్షాలు తగ్గుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించినా, ఆ హెచ్చరికను రైతు రక్షణకు అవసరమైన చర్యలుగా మార్చడంలో కేంద్రం విఫలమైంది. కరువు ప్రకృతి వైపరీత్యమే, కాదనలేం. కానీ ముందే తెలిసిన ముప్పు రైతు ప్రాణాలు తీసే స్థితికి చేరడం మాత్రం పాలనా వైఫల్యం.
ఈ ఏడాది దేశవ్యాప్తంగా జూన్-సెప్టెంబర్ రుతుపవన వర్షపాతం సాధారణం కంటే 12.6 శాతం తక్కువగా నమోదైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఏప్రిల్ 13నే వర్షపాతం తగ్గే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణాది రాష్ట్రాల్లోనూ వర్షపాతం తగ్గే అవకాశం ఉందని కేంద్ర వ్యవసాయమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వెల్లడించారు. ప్రమాదం ముందే తెలిసిన ప్పుడు రాష్ట్రాలకు స్పష్టమైన కార్యాచరణ సూచనలు ఇవ్వడం, రైతులకు ముందస్తు సమాచారం చేరేలా వ్యవస్థను సిద్ధం చేయడం కేంద్రం బాధ్యత. రైతుకు వర్షాలు తగ్గుతాయని చెప్పడం మాత్రమే సరిపోదు. ఏ పంట వేయాలి? ఎప్పుడు విత్తాలి? తక్కువ నీటితో పండే పంట ఏది? ప్రత్యామ్నాయ పంటకు విత్తనాలు, రుణం ఎక్కడ లభిస్తాయి?
వంటి సమాచారం గ్రామస్థాయికి చేరాలి. ‘ఎల్‌నినో’ ప్రభావం శాస్త్రవేత్తలకు తెలిసినా రైతుకు దాని ప్రభావం అర్థమయ్యేలా సమా చారం అందకపోతే ముందస్తు హెచ్చరికకు ప్రయోజనం ఏమిటి?
తెలంగాణలో 235 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వం చెబుతోంది. నైరుతి రుతుపవన కాలం ముగిసే నాటికి రాష్ట్రంలో 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 33 జిల్లాల్లో 18 జిల్లాలు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నాయి. పలు జిల్లాల్లో పంటలు తీవ్ర ఒత్తిడికి గురవు తుండగా, చిన్న నీటివనరుల్లో నీటి నిల్వలు తగ్గాయి. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొ నేందుకు రూ.802.92 కోట్ల ప్యాకేజీని నిపుణుల కమిటీ సూచించినా, పలు ప్రాంతాల్లో రైతులు సాగునీటి కోసం ఆందోళనలకు దిగడం ప్రణాళిక అమలుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. కరువు మండలాల గుర్తింపులోనూ శాస్త్రీయత అవసరం. వర్షపాతం లోటుతోపాటు వర్షాలు లేని రోజుల సంఖ్య, సాగు విస్తీర్ణం, పంటల పరిస్థితి, దిగుబడి అంచనా, నీటి వనరుల స్థాయి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఉపగ్రహ పంట సూచికలు, వర్షపాతం గణాంకాలు, డ్రైస్పెల్, జలాశ యాల స్థాయిలు, క్షేత్రస్థాయి పరిశీలనలను కలిపి అంచనా వేయాలి. పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రాంతాలు కరువు ప్రాంతాలుగా గుర్తించబడుతున్నాయా అన్నదీ పరిశీలించాలి.
రైతు పెట్టుబడినీ నష్టంలో భాగంగా పరిగణించాలి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలు, డీజిల్, నీటి ఖర్చు.. పంట చేతికందకపోతే ప్రతి రూపాయి నష్టమే. బ్యాంకు రుణాలు తీర్చడం కష్టమై, ప్రైవేటు అప్పులపై వడ్డీ పెరుగు తుంది.
తదుపరి పంటకు పెట్టుబడి లేక రైతు మరింతగా అప్పుల చక్రంలో చిక్కుకుంటాడు. ఈ ఒత్తిడే చివరకు కుటుంబాలను విషాదంలోకి నెడుతోంది. కాబట్టి కరువు మండలంగా ప్రకటించడం మాత్రమే సరిపోదు. కేంద్రం తక్షణ సహాయ నిధులు, పంట బీమా పరిహారం, రుణ ఉపశమనంలో రాష్ట్రాలకు అండగా నిలవాలి. రాష్ట్రం గ్రామాల వారీగా పంట నష్టం నమోదు చేసి వెంటనే పరిహారం అందించాలి. రుణాల వసూళ్లపై తాత్కాలిక ఉపశమనం, రుణాల పునర్వ్యవస్థీకరణ, తదుపరి సాగుకు కొత్త రుణాలు కల్పించాలి. కౌలు రైతులను కూడా ఆదుకోవాలి.
పంట బీమా పరిహారం ఉంటే వెంటనే చెల్లించడంతో పాటు పశుగ్రాసం, తాగునీరు, గ్రామీణ ఉపాధి వంటి కుటుంబ అవసరాలనూ కరువు సహాయంలో భాగం చేయాలి. యాసంగి సాగుకు నీటి లభ్యతను బట్టి తక్కువ నీటితో పండే పంటలను ప్రోత్సహించాలి. అయితే పంట మార్చుకోవాలని చెప్పడం మాత్రమే సరిపోదు. ప్రత్యామ్నాయ పంటకు విత్తనం, పెట్టుబడికి రుణం, దిగుబడికి మార్కెట్, కనీస మద్దతు ధరకు కొనుగోలు హామీ కల్పించాలి. కరువు మండలాల ప్రకటనలతో రైతు సమస్య తీరదు. రైతుకు కావాల్సింది నష్టపోయిన పంటకు పరిహారం, తన అప్పుకు ఉపశమనం, తదు పరి పంటకు పెట్టుబడి, కుటుంబానికి భరోసా. ఐఎండి ముందే ఇచ్చిన హెచ్చరికలను కార్యాచరణగా మార్చడంలో విఫలమైతే, దాని మూల్యం రైతే చెల్లించాల్సి వస్తుంది. కరువు ముప్పును ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా సమన్వయంతో స్పందించాలి. కరువులో మొదటి ప్రాధాన్యత కేవలం పంటను కాపాడటమే కాదు.. రైతు ప్రాణాన్ని రక్షించడం కావాలి.
(ఏ)కరువు
58 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 05, 2026 | 3 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)