Magazines

విద్యా వెనుకబాటుకు ‘పరీక్షే’ పరిష్కారమా?

1 గంట క్రితం

educational
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 3 నిమిషాల చదవడం

రాష్ట్రంలో 6,9 తరగతులకు మానిటరింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు ఎందుకు వెనుకబడుతున్నారో తెలుసుకోవాల్సిన విద్యాశాఖ.. ఆ కారణాలను పక్కనపెట్టి పరీక్షా పత్రాలు ఎవరు దిద్దాలన్న అంశానికే ప్రాధాన్యత ఇవ్వడం సరైంది కాదు. తెలంగాణలో విద్యాపరంగా వెనుకబడినట్లు గుర్తించిన తొమ్మిది జిల్లాల్లో 6వ తరగతి సంగ్రహాత్మక మూల్యాంకనం ప్రశ్నాపత్రాలను ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో దిద్దించాలని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇదే ప్రశ్నను లేవనెత్తుతోంది. భాషా, సామాజిక, ప్రాంతీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం మూల్యాంకన విధానాన్ని మార్చడం వల్ల విద్యార్థుల అభ్యసన ప్రమాణాలు మెరుగు పడతాయా? ఆధునిక విద్యా విధానాన్ని అర్థం చేసుకుని మూల కారణాలను గుర్తించి పరిష్కరించాల్సిన చోట, సాంప్రదాయ పరీక్షా విధానాన్నే మరో రూపంలో అమలు చేయడం విద్యాభివృద్ధికి ఎంతవరకు దోహదపడు తుందన్నది ఆలోచించాల్సిన విషయం.


రోగమొకటైతే మందొకటి వేస్తారా?
ఉపాధ్యాయ ప్రతినిధులతో జరిగిన సమావేశం అనంతరం తెలంగాణలో విద్యాపరంగా వెనుకబడినట్లు గుర్తించిన తొమ్మిది జిల్లాల్లో-ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో-6వ తరగతి సంగ్రహాత్మక మూల్యాంకనం ప్రశ్నాపత్రాలను 9వ తరగతి మాదిరిగా ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయిస్తామని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, విద్యాశాఖ సంచాలకులు నికోలస్ ప్రకటించారు. అధికారుల తీరు చూస్తే రోగం ఒకటైతే మందు మరొకటి వేసినట్లుగా ఈ నిర్ణయం కనిపిస్తోంది. వాస్తవానికి ఈ జిల్లాలన్నింటిలోనూ ఒకే తరహా పరిస్థితి లేదు. వాటిలో చాలా జిల్లాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండగా, మరికొన్ని జిల్లాల్లో గిరిజనులు, మైనారిటీలు ఎక్కువగా నివసిస్తున్నారు. కోయ, లంబాడీ, ఉర్దూ వంటి మాతృభాషలకు ప్రాధాన్యత ఉన్న ప్రాంతాల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బోధన కొనసాగుతున్నప్పుడు ఆ భాషలు విద్యార్థులకు ఆధిపత్య భాషలుగా మారతాయి. కాబట్టి ఆయా విద్యార్థులు వెనుకబడటానికి భాషా సమస్య కూడా ప్రధాన కారణం కావచ్చు. ఇది ఆయా జిల్లాల సహజ విద్యా పరిణామ స్థితిని ప్రతిబింబిస్తుంది. కానీ అధికారులు ఈ వెనుకబాటుకు అసలు కారణాలను గుర్తించకుండా, బోధించిన పాఠశాల ఉపాధ్యాయులతో కాకుండా ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో ప్రశ్నాపత్రాలు దిద్దిస్తామని ప్రకటించడం వింత నిర్ణయంగా ఉంది.


విద్యా ప్రమాణాలను కొలవాల్సింది టెసాతోనే కాదా?
తెలంగాణ ప్రభుత్వం గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ విద్యా ప్రణాళిక బిల్లును ప్రవేశపెట్టింది. అందులో తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సిఫార్సు చేసిన ‘తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ అథారిటీ’ (TESA) ఏర్పాటును ప్రతిపాదిం చారు. అయితే ఆ వ్యవస్థను అమల్లోకి తీసుకురా కపోవడంతో ఇప్పుడు తాత్కాలిక ఉపశమనంగా మరో నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. టెసా అనేది విద్యా ప్రమాణాలను అంచనా వేసే థర్డ్ పార్టీ వ్యవస్థగా ఉండాలి. పాఠశాలలు, విద్యార్థుల అభ్యసన స్థాయిని స్వతంత్రంగా పరిశీలించడం దాని ప్రధాన ఉద్దేశం.కానీ ఒక పాఠశాల ఉపాధ్యా యుడు బోధించిన విద్యార్థుల పరీక్షా పత్రాలను మరో పాఠశాల ఉపాధ్యాయుడితో దిద్దించడం ద్వారా విద్యా ప్రమాణాలపై సమగ్ర, శాస్త్రీయమైన అంచనా ఎలా సాధ్యమవుతుంది? దీనివల్ల కొత్తగా ఒనగూడే ప్రయోజనం ఏమిటన్నదే ప్రశ్న.


సీసీఈని పక్కనపెట్టి సాంప్రదాయ పరీక్షల వైపు ఎందుకు?
పదహారేండ్ల క్రితం అమల్లోకి వచ్చిన విద్యాహక్కు చట్టాన్ని, అందులో భాగంగా వచ్చిన శాస్త్రీయ మూల్యాంకన విధానం ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE)’ను అధికారులు పూర్తిగా అర్థం చేసుకున్నట్లు కనిపించడం లేదు. ఎప్పుడో పూర్వకాలంలో చదువుకున్న సాంప్రదాయక పరీక్షా విధానం ప్రభావం తాజా నిర్ణయాలపై కనిపిస్తోంది.సీసీఈ విధానంలో విద్యార్థికి బోధించిన సబ్జెక్టు ఉపాధ్యాయుడే విద్యార్థి అభ్యసన స్థాయిని అంచనా వేస్తారు. ఇందులో నిర్మాణాత్మక మూల్యాంకనం (FA)- 20 మార్కులు, సంగ్రహాత్మక మూల్యాంకనం (SA)- 80 మార్కులు ఉంటాయి. ఎఫ్‌ఏలో ప్రాజెక్టు వర్క్, చదవడం, రాయడం, స్లిప్ టెస్టులు తదితర అభ్యసన సామర్థ్యాలను బట్టి మార్కులు కేటాయిస్తారు. ఎస్‌ఏలో విద్యా సంవత్సరంలో రెండుసార్లు ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తారు. సాంప్రదాయక పరీక్షలో ప్రధానంగా జ్ఞానాన్ని కొలిస్తే, సీసీఈలో జ్ఞానంతో పాటు చదవడం, రాయడం, విశ్లేషించడం, పోల్చడం, మ్యాపింగ్, సంబంధిత జ్ఞానాన్ని పెంపొందించుకోవడం వంటి సామర్థ్యాలను కూడా అంచనా వేయవచ్చు. అంటే ఇది కేవలం విద్యార్థి మార్కులను నిర్ణయించే ప్రక్రియ కాదు. విద్యార్థి అభ్యసనతో పాటు ఉపాధ్యాయుడి బోధనా సామర్థ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకునే అభివృద్ధి ప్రక్రియ.


శాస్రీయ నిరంతర సమగ్ర మూల్యంకనం అవసరం
ఒక పాఠశాల సంగ్రహాత్మక పరీక్ష పత్రాల ను మరో పాఠశాల ఉపాధ్యాయులు దిద్దడం వల్ల కొత్తగా ఒనగూడే ప్రయోజనం ఏమీ ఉండదు. నిజంగా ఆయా జిల్లాల పిల్లల విద్యా ప్రమాణా లను పారదర్శకంగా పరిశీలించాలంటే తెలం గాణ విద్యా ప్రణాళికలో సూచించిన ‘తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ అథారిటీ’ (TESA)ను ఏర్పాటు చేయడం అనివార్యం. ఆధునిక మూల్యాంకన విధానం మౌలిక స్వరూపాన్ని అర్థం చేసుకోకుండా తీసుకునే ఏ నిర్ణయమైనా ఆశించిన ఫలితాలను ఇవ్వదు. యూపీఏ కాలంలో వచ్చిన విద్యాహక్కు చట్టం-2009లో నూతన మూల్యాంకన ప్రక్రియగా నిరంతర సమగ్ర మూల్యాంకన విధానానికి ప్రాధాన్యత ఇచ్చారు. దాని మౌలిక భావన నుంచి అధికారులు, ఉపాధ్యాయులు వైదొల గడం వల్ల విధానం అసలు ఉద్దేశమే దెబ్బతింటుంది. తరతరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయ పరీక్షా విధానం నీడలు విద్యా వ్యవస్థను ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉన్నాయి. అయితే అధికారులు మారిన చట్టాలు, ఆధునిక మూల్యాం కన విధానాల వెలుగులో నిర్ణయాలు తీసుకోవాలి. మూలం చూసి మందు వేసినప్పుడే విద్యా వ్యవస్థకు పట్టిన జాడ్యం వదులుతుంది. సమస్య ఎక్కడ ఉందో గుర్తించ కుండా పరీక్షా పత్రాలను ఎవరు దిద్దాలన్న అంశంపైనే దృష్టి పెట్టడం వల్ల విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడవు. కనుక సర్వదా చట్టబద్ధమైన, శాస్త్రీయమైన నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం వెలుగులో విద్యాభి వృద్ధికి పాటుపడటమే విద్యావ్యవస్థకు, విద్యార్థుల భవిష్యత్తుకు శ్రేయస్కరం.


ఎన్.తిర్మల్, 9441864514

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్