Magazines

మీరూ పరీక్షించుకోవచ్చు...

6 గంటల క్రితం

yourself
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 3 నిమిషాల చదవడం

రొమ్ము క్యాన్సర్‌ చాపకింద నీరులా ప్రవహిస్తోంది. ముఖ్యంగా లక్షల మంది మహిళలు దీని బారిన పడుతున్నారు. అవగాహన లేకపోవడం, మొహమాటం వల్ల చాలా మంది వ్యాధి ముదిరే వరకు పరీక్షలు చేయించుకోవడం లేదు. దీంతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. అయితే ఈ క్యాన్సర్​ గురించి తెలుసుకోవడానికి ఇంట్లోనే ఎవరికి వారే స్వయంగా రొమ్ములను పరీక్షించుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. తద్వారా మొదట్లోనే వ్యాధిని గుర్తించి సరైన చికిత్స తీసుకోవచ్చు.. ఈ క్రమంలోనే రొమ్ముల సెల్ఫ్​ ఎగ్జామినేషన్​ ఎలా చేసుకోవాలి? ఎన్ని రోజులకోసారి పరీక్ష చేసుకోవాలి? వంటి విషయాలను ఈరోజు తెలుసుకుందాం...


వక్షోజాల్లో ఏర్పడే గడ్డలను రొమ్ము క్యాన్సర్‌ ప్రారంభ సంకేతాల్లో ఒకటిగా పరిగణించవచ్చని చెబుతున్నారు నిపుణులు. అయితే ఆ గడ్డల్లో కూడా 80 నుంచి 85 శాతం గడ్డలు క్యాన్సర్‌ రహితమైనవేనట. క్యాన్సర్‌కు కారణమయ్యే గడ్డలు అసాధారణ ఆకృతుల్లో ఉండి.. నొప్పి కలిగించకుండా ఉంటాయంటున్నారు. అలాగని నొప్పి కలిగించే గడ్డలను నిర్లక్ష్యం చేయడం కూడా తగదంటున్నారు. ఎందుకంటే కొంతమందిలో నొప్పితో ఉన్న గడ్డలు కూడా క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఎలా పరీక్షించుకోవాలి: ఇంట్లోనే రొమ్ములను పరీక్షించుకోవడానికి రెండు రకాల పద్ధతులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒకటి రొమ్ముల ఆకృతి, పరిమాణం వంటివి పరిశీలించడం, రెండోది వాటిని తాకుతూ సమస్యను పసిగట్టడం.

మొదటి పద్ధతి: రొమ్ముల ఆకృతి, పరిమాణం

ఈ ప్రక్రియలో భాగంగా నడుము వరకు దుస్తులేవీ ధరించకుండా చేతులను వెనక్కి పెట్టి అద్దం ముందు నిల్చోవాలి. ఇప్పుడు రొమ్ముల సైజు, ఆకృతి, వాటిపై ఏమైనా ముడతలు, గుంతలు పడుతున్నాయా, చనుమొనల నుంచి ఏవైనా స్రావాలు వెలువడుతున్నాయా, రొమ్ములు-చనుమొనల భాగాల్లో చర్మం ఎరుపెక్కడం, వాపు రావడం మొదలైన సమస్యలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలు పరిశీలించుకోవాలి. ఆ తర్వాత రెండు చేతుల్ని పైకెత్తి పైన చెప్పిన విషయాలను మరోసారి టెస్ట్​ చేసుకోవాలి. అనంతరం రెండు చేతులను నడుముపై ఉంచి, భుజాలను కాస్త ముందుకు నెట్టి పైన సూచించినట్లుగా రొమ్ములను పరిశీలించాలి. మరోవైపు భుజాలను పైకెత్తి రొమ్ములను చెక్‌ చేసుకోవాలి. ముందుగా ఒక భుజాన్ని పైకెత్తాలి. అంటే, ఉదాహరణకు ఎడమ భుజాన్ని పైకి లేపి.. ఎడమ రొమ్ము పరిమాణం, ఆకృతిలో ఏవైనా తేడాలున్నాయేమో గమనించాలని, నొప్పి, అసౌకర్యంగా అనిపిస్తోందేమో అనే అంశాలు పరిశీలిం చాలి. అనంతరం కుడి భుజం పైకెత్తి అలాగే చెక్‌ ‌చేసుకోవాలి.

రెండో పద్ధతి: రొమ్ములను తాకుతూ

మెడ ఎముక భాగంలో చేతి మూడువేళ్లతో బలంగా ఒత్తుతూ ఆ భాగంలో ఏదైనా అసౌకర్యంగా ఉందేమో గమనించాలంటున్నారు. ఆ తర్వాత లెఫ్ట్​ హ్యాండ్​ను పైకి లేపి మెడ వెనక్కి పెట్టి.. కుడిచేతి వేళ్ల సాయంతో ఎడమ రొమ్ము నుంచి మొదలు పెట్టి ఎడమ చంక వరకు ప్రెస్​ చేస్తూ రావాలంటున్నారు. ఆపై ఈ భాగంలోనే మరోసారి గట్టిగా ఒత్తుతూ గుండ్రంగా తిప్పుతూ పరిశీలించాలంటున్నారు వివరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల గడ్డలేమైనా ఉంటే గుర్తించవచ్చని.. ఇదే పద్ధతిని కుడి రొమ్మును పరీక్షించేందుకు కూడా ఫాలో అవ్వాలంటున్నారు. పడుకొని కూడా రొమ్ముల్లో తేడాను కనిపెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం ముందుగా మంచం మీద నిటారుగా పడుకొని ఒక చేతిని తల కింద పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రొమ్ములో ఏదైనా భాగాన్ని కాస్త నెమ్మదిగా, మధ్యస్తంగా, బలంగా ప్రెస్​ చేస్తూ చేతి వేళ్లను రౌండ్​గా తిప్పాలని.. ఆపై వేళ్లను కాస్త పక్కకు జరిపి అక్కడా ఇలానే చేయాలి. రొమ్ము మొత్తం ఇలానే ప్రెస్​ చేయాలి. చివరగా చనుమొనల వద్ద కూడా కాస్త ఒత్తుతూ గడ్డలాంటిదేమైనా ఉందేమో పరిశీలించాలని వివరిస్తున్నారు. ఇదే పద్ధతిలో రెండో రొమ్మును కూడా పరిశీలించాలి.

ఎప్పుడు చేసుకోవాలి

నెలకు ఒకసారి, ముఖ్యంగా పీరియడ్స్​ అయిపోయిన తర్వాత పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే పీరియడ్స్​ టైమ్​లో హార్మోన్లు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. దీనివల్ల రొమ్ము కణజా లంలో మార్పులొస్తాయి. ఇక ఎప్పుడైతే నెలసరి మొదలవుతుందో అప్పుడు రొమ్ములో వచ్చిన వాపు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. పీరియడ్‌ ముగిసే సమయానికి అంటే ఐదు రోజుల తర్వాత బ్రెస్ట్​ తిరిగి మామూలు స్థితికి చేరుకుం టుంది. ఈ సమయంలో పరీక్షించుకుంటే రొమ్ముల్లో ఉండే గడ్డల్ని సులభంగా పసిగట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక మెనోపాజ్ దశలో ఉన్న స్త్రీలు కూడా నెలలో ఎప్పుడైనా సొంతంగా రొమ్ము పరీక్ష చేసుకోవచ్చు. అయితే నెలనెలా ఒక తేదీని ఫాలో అయితే మంచిదని అంటున్నారు.

డాక్టర్‌ని ఎప్పుడు సంప్రదించాలి

ఇంట్లోనే రొమ్ములను పరీక్షించుకునేటప్పుడు వక్షోజాల్లో గడ్డలున్నా, అసాధారణ వాపు, ఎరుపెక్కడం, ఆ ప్రదేశంలో చర్మంపై ముడతలు పడడం, చర్మం మందంగా, గరుకుగా మారడం, చనుమొనల నుంచి స్రావాలు వెలువడడం, రక్తస్రావం కావడం వంటి లక్షణాలు గమనిస్తే సిగ్గు, బిడియం అంటూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం ఉత్తమం.

ప్రారంభం సంకేతాలు

రొమ్ములో లేదా చంకలో కొత్తగా గడ్డ ఏర్పడటం.
రొమ్ములోని కొంత భాగం గట్టిపడటం లేదా వాపు రావడం.

రొమ్ము చర్మంపై చికాకు లేదా గుంటలు పడటం.
చనుమొన ప్రాంతంలో లేదా రొమ్ములో చర్మం ఎర్రబడటం లేదా పొలుసులుగా మారడం.

చనుమొన లోపలికి వెళ్లడం లేదా చనుమొన ప్రాంతంలో నొప్పి.

పాలిచ్చే సమయంలో కాకుండా చనుమొనల నుంచి ఇతర స్రావాలు, రక్తం కారడం.

రొమ్ము పరిమాణంలో లేదా ఆకారంలో మార్పు.

రొమ్ములోని ఏ ప్రాంతంలోనైనా నొప్పి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్