చరిత్రలో చెరగని పేరు రాణి రుద్రమదేవి. దక్షిణ భారతదేశాన్ని ఏలిన ఓ మహా సామ్రాజ్ఞి. పరాక్రమానికి ప్రతిరూపం. ఆ పేరు వింటేనే శత్రువుల గుండెలు అదిరిపోయేవి. మరి ఆమెకు ఉన్న బిరుదేమిటో తెలుసా..? రాయ గజకేసరి! ఏనుగంతటి శత్రువుపై లంఘించి సంహరించే సింహం వంటి రాజు అన్నది దాని సారాంశం. పురుషాధిక్య సమాజంలో కాకతీయ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించి సామంతుల తిరుగుబాట్లు, శత్రువుల దండయాత్రలను ధైర్యంగా ఎదుర్కొన్న ధీరవనిత. యుద్ధరంగంలో వీరత్వం, పాలనలో దూరదృష్టి ప్రదర్శించి సామ్రాజ్యాన్ని నిలబెట్టిన ఆమె జీవితం నేటి మహిళలకు ఆత్మవిశ్వాసం, నాయకత్వానికి మార్గదర్శకం. ఈరోజు (నవంబర్ 27) ఆమె వర్ధంతి సందర్భంగా ఆ వీరనారి స్ఫూర్తిని స్మరించుకోవడం సముచితం.
కాకతీయ సామ్రాజ్య చరిత్రలో రాణి రుద్రమదేవి పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. భారతీయ చరిత్రలో మహిళా పాలకుల గురించి మాట్లాడినప్పుడు ముందుగా గుర్తుకొచ్చే మహారాణుల్లో ఆమె ఒకరు. గణపతిదేవుడికి కుమారులు లేకపోవడంతో తన కుమార్తె రుద్రమదేవిని చిన్ననాటి నుంచే యువరాజుగా తీర్చిదిద్దాడు. కత్తిసాము, గుర్రపు స్వారీ, విలువిద్య, యుద్ధ వ్యూహాలు, రాజ్యపాలన వంటి అన్ని అంశాల్లో ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. అంతేకాదు, పరిపాలనలో అనుభవం పెంచేందుకు ముందుగా మండలాధిపతిగా బాధ్యతలు అప్పగించి, అనంతరం సామ్రాజ్య సింహాసనంపై కూర్చోబెట్టాడు. శాసనాల్లో ఆమెను ‘రుద్రదేవ మహారాజు’, ‘రాయగజకేసరి’ లాంటి బిరుదులతో గౌరవాన్ని పొందింది. సుమారు క్రీ.శ. 1262 నుంచి ఆమె స్వతంత్రంగా పాలించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. మహిళ పాలనను అంగీకరించని సామంతుల ప్రతిఘటనను ఎదుర్కొంటూనే ‘రుద్రదేవ మహారాజు’ అనే రాజరిక నామంతో పాలన కొనసాగించారు. 1273 నాటి కోటగిరి రాగి శాసనాలు ఆమె గణపతిదేవుడి కుమార్తె అని స్పష్టం చేస్తున్నాయి. మహిళలు అధికారానికి అర్హులు కారనే భావనను తన సామర్థ్యంతో బద్దలుకొట్టి సింహాసనాన్ని నిలబెట్టుకోవడం ఆమె అసాధారణ ధైర్యానికి నిదర్శనం.
మూడు దశాబ్దాల అద్భుత పాలన
సుమారు మూడు దశాబ్దాల పాటు కాకతీయ సామ్రాజ్యాన్ని సమర్థంగా పాలించిన రుద్రమదేవి, తన ధైర్యసాహసాలతో శత్రువులకు సింహస్వప్నంగా నిలిచింది. యాదవులు, చోళులు, పాండ్యులు, ఇతర సామంత రాజులు కాకతీయ రాజ్యంపై దండెత్తిన ప్రతిసారి ఆమె స్వయంగా యుద్ధరంగంలోకి దిగి విజయాన్ని సాధించింది. అవసరమైనప్పుడు తనలాంటి వేషధారణలో పలువురు యోధులను యుద్ధరంగంలో నిలబెట్టి శత్రువులను అయోమయంలోకి నెట్టే వ్యూహాన్ని కూడా అనుసరించినట్లు చరిత్ర చెబుతోంది. తన పాలనలో ఎంతో మంది రాజులను ఓడించి భారీ పరిహారం పొంది, తన సైనిక ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. ఆ సంపదను సైనిక సంక్షేమానికి ఉపయోగించేది.
పాలనలో దూరదృష్టి
యుద్ధాల కన్నా జీనవ పరిస్థితులు మెరుగుబడేలా చేసింది రుద్రమదేవి. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు మారువేషంలో గ్రామాలు సందర్శించేదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. కాకతీయ రాజవంశం తవ్వించిన చెరువులతో పాటు ఏ కాలంలో ఎలాంటి పంటలు పండాలో సూచించే వ్యవసాయ శాస్త్రం అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఆ రోజుల్లోనే ప్రసూతి వైద్యశాలలు ఏర్పరిచింది. ఆడవాళ్లపై లైంగిక దాడి చేస్తే బీజచ్ఛేదం చేయించేది. మహిళలకు యుద్ధవిద్యల్లో శిక్షణ అందించి, రాజ్య రక్షణలో భాగస్వాములుగా తీర్చిదిద్దింది. రాజ్యాధికారం కోసం భర్త వేధించినా, సహించిందే తప్ప లొంగలేదు. కుటుంబం కోసం దేశాన్ని తాకట్టు పెట్టలేదు. దేవగిరి యాదవులు, తూర్పు గంగులతో ఘర్షణలు, కాయస్థ వంశీయుడు అంబదేవుడి తిరుగుబాటు వంటి తీవ్రమైన సవాళ్లను రుద్రమదేవి ఎదుర్కొన్నారు. సైనిక, రాజకీయ బాధ్యతలను సమన్వయం చేస్తూ సామ్రాజ్య రక్షణకు కృషి చేశారు. శత్రువుల ఒత్తిడికి లొంగకుండా నిర్ణయాలు తీసుకోవడం, సైన్యాన్ని నడిపించడం, పాలనా వ్యవస్థను కొనసాగించడం ఆమె నాయకత్వ పటిమను తెలియజేస్తాయి. ఆమె వీరత్వం కేవలం ఖడ్గానికి పరిమితం కాలేదు. సంక్షోభాలను ఎదుర్కొనే స్థైర్యంలోనూ కనిపించింది.
చందుపట్ల శాసనం.. చరిత్రకు సాక్ష్యం
రుద్రమదేవి మరణానికి సంబంధించి చరిత్రలో చాలాకాలంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఆమె యుద్ధరంగంలో వీరమరణం పొందిందని, మరికొందరు కుట్రకు బలైందని చెప్తుంటారు. అయితే, ఈ సందేహాలకు తెరదించే ఆధారం నల్గొండ జిల్లా చందుపట్లలో లభించిన శాసనం. శక సంవత్సరం 1211కు చెందిన ఈ తెలుగు శాసనం ప్రకారం క్రీ.శ. 1289లో రుద్రమదేవితో పాటు సైన్యాధ్యక్షుడు మల్లికార్జున నాయకుడు మరణించారు. వారి పుణ్యార్థం పువ్వుల ముమ్మడి సోమనాథదేవునికి భూములు దానం చేసినట్లు శాసనంలో ఉంది. చరిత్రకారుడు పి.వి. పరబ్రహ్మశాస్త్రి ఆమె అంబదేవుడితో ఘర్షణల్లో మరణించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఆయన 1974 పరిశోధనలో నవంబర్ 25, 1289గా, 1978లో వెలువడిన ‘ది కాకతీయాస్ ఆఫ్ వరంగల్’లో నవంబర్ 27, 1289గా తేదీని పేర్కొన్నారు. మరణకారణం, ప్రదేశం శాసనంలో స్పష్టంగా లేవు. అయినప్పటికీ చందుపట్ల శాసనం ఆమె చరిత్రకు అమూల్యమైన సాక్ష్యం.
ఆ వీరనారి స్ఫూర్తితో...
రుద్రమదేవి స్ఫూర్తిని నేటి మహిళలు మాటల్లోనే కాక ఆచరణలో చూపాలి. ఇందుకు విద్యను ఆయుధంగా చేసుకోవాలి. ఉపాధి నైపుణ్యాలు పెంపొందించుకొని ఆర్థికంగా స్వతంత్రంగా నిలవాలి. తమ హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకొని గృహహింస, వరకట్న వేధింపులు, లింగవివక్ష, కార్యాలయ వేధింపులపై మౌనం వీడి చట్టబద్ధంగా ప్రశ్నించాలి. సమస్యలను ఒంటరిగా భరించకుండా కుటుంబ సభ్యులు, నమ్మకమైన వ్యక్తులు, మహిళా సంఘాలు, సంబంధిత అధికారుల సహకారం పొందాలి. నాయకత్వ నైపుణ్యాలు పెంచుకొని స్థానిక సంస్థలు, ఉద్యోగాలు, వ్యాపారం, రాజకీయాల్లో నిర్ణయాధికార పాత్రలు చేపట్టాలి. పరస్పరం అండగా నిలిచి ఇతర మహిళల ఎదుగుదలకు తోడ్పడాలి. ధైర్యం అంటే ఘర్షణకు దిగడం కాదు. వివేకంతో పరిస్థితిని అంచనా వేసి, ఐక్యతతో, చట్టబద్ధంగా హక్కుల కోసం నిలబడటం. 1323లో కాకతీయ సామ్రాజ్యం అంతమైనా రుద్రమదేవి కీర్తి చెరిగిపోలేదు. చందుపట్ల శాసనం వంటి ఆధారాలను పరిరక్షించడం మన బాధ్యత. నాడు రాజ్యాధికారం కోసం పోరాడిన ఆమె స్ఫూర్తితో నేడు మహిళలు ఆత్మగౌరవం, హక్కులు, స్వేచ్ఛ, సమాన అవకాశాల కోసం నిలబడాలి. ఆమె ఖడ్గం నేటి మహిళ చేతిలో విద్యగా, విజ్ఞానంగా, చట్టపరమైన అవగాహనగా, ఆత్మవిశ్వాసంగా మారాలి. అదే ఆ వీరనారికి నిజమైన నివాళి.
- యరకల శాంతికుమార్, 9849042083






కామెంట్లు (0)