Magazines

గిరిజనులు ఎందుకు వెనుకబడుతున్నారు?

20 నిమిషాల క్రితం

lagging
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026 | 3 నిమిషాల చదవడం

తెలంగాణలో గిరిజనులు ప్రకృతితో మమేకమై జీవించే ప్రత్యేకమైన సమాజాలు. అడవులు, కొండలు, గుట్టలను ఆధారంగా చేసుకుని జీవిస్తున్న వీరికి ప్రత్యేకమైన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా గిరిజనుల విద్య, ఉపాధి, ఆర్థిక అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేదు. గిరిజనులలో సామర్థ్యం లేకపోవడం దీనికి కారణం కాదు. చారిత్రకంగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక అసమానతలు, ప్రభుత్వాల నిర్లక్ష్యమే ప్రధాన కారణాలు. రాష్ట్రంలోని మారుమూల గిరిజన ఆవాసాలకు పాఠశాలలు, కళాశాలలు దూరంగా ఉండటంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి ప్రవేశం లభించడం లేదు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రాష్ట్రంలో 33 గిరిజన తెగలు ఉన్నప్పటికీ వారి మాతృభాషల్లో విద్యాబోధన పూర్తిస్థాయిలో అందడం లేదు.

గోండు, కోయ, లంబాడి, ఎరుకల, కొలామి తదితర భాషల్లో ప్రాథమిక విద్య అందకపోవడంతో పిల్లలు భాషాపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా చదువుపై ఆసక్తి తగ్గి మధ్యలోనే బడి మానేస్తున్నారు. గిరిజన కుటుంబాల పేదరికం కూడా విద్యకు అడ్డంకిగా మారింది. వ్యవసాయ కూలీ పనులు, అటవీ ఉత్పత్తుల సేకరణ, రోజువారీ కూలీ పనులే జీవనాధారం. పుస్తకాలు, దుస్తులు, ప్రయాణ ఖర్చులు భరించలేక పిల్లల చదువులను కొనసాగించలేకపోతున్నారు. ముఖ్యంగా బాలికలు రవాణా సౌకర్యాలు, వసతి గృహాల కొరత, సామాజిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సబ్జెక్టు టీచర్లు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, డిజిటల్ విద్యా సౌకర్యాలు లేక విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. 2011 జనగణన ప్రకారం తెలంగాణలో గిరిజనుల అక్షరాస్యత 49.51 శాతం మాత్రమే.


రాష్ట్ర సగటు అక్షరాస్యత 66.54 శాతం కాగా, గిరిజన పురుషుల అక్షరాస్యత 59.49 శాతం, మహిళల అక్షరాస్యత 39.44 శాతంగా ఉంది. తెగలవారీగా చూస్తే ప్రధాన్ 66.16 శాతం, తోటి 62.77, కొండారెడ్డి 55.28, ఎరుకల 55.13, అంద్ 54.41, కోయ 53.67, గోండు 49.30, లంబాడి 49.02, చెంచు 40.54, కొలాం 39.02 శాతం అక్షరాస్యత కలిగి ఉన్నారు. మిగిలిన తెగల్లో పరిస్థితి మరింత వెనుకబడి ఉంది. ఈ గణాంకాలు గిరిజన విద్యా రంగంలోని అసమానతలను స్పష్టం చేస్తున్నాయి. విద్య, నైపుణ్యాల కొరత కారణంగా గిరిజన యువత ఉన్నత విద్య, సాంకేతిక, వృత్తి విద్యకు దూరమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఖాళీలు, బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ కాకపోవడం, నియామకాలలో జాప్యం వల్ల తగిన ప్రాతినిధ్యం లభించడం లేదు. ప్రైవేటు, పారిశ్రామిక, ఐటీ, కార్పొరేట్ రంగాల్లోనూ గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు. అడవిపై ఆధారపడి జీవించే గిరిజనులకు అటవీ ఉత్పత్తుల సేకరణ కూడా కష్టమవుతోంది.


తేనె, చింతపండు, ఉసిరికాయ, ఇప్పపువ్వు, వెదురు తదితర ఉత్పత్తుల సేకరణపై ఆంక్షలు, మార్కెటింగ్ సౌకర్యాల కొరత వారి జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నాయి. జీసీసీని బలోపేతం చేయకపోవడంతో గిరిజనులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పోడు భూములు, భూమి హక్కులు, సాగునీరు, వ్యవసాయ పెట్టుబడుల సమస్యలు కొనసాగుతున్నాయి. భూమి హక్కుల రక్షణతోపాటు వ్యవసాయానికి అవసరమైన మద్దతు అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి.గిరిజన యువత స్వయం ఉపాధి కోసం చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించాలంటే బ్యాంకు రుణాలు, సబ్సిడీలు, మార్కెటింగ్ సహకారం అవసరం. గతంలో ఉపాధి కల్పించే 220 రకాల యూనిట్లు ఉండేవని, ప్రస్తుతం అవి కనిపించడం లేదని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర నిధులు, స్వయం ఉపాధి పథకాల అమలుపై కూడా స్పష్టత లేదు. గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏలు, డీటీడీవోలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం లేదు.


విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కనిపించడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామ సభలకు ప్రాధాన్యం లేకుండా పోతోంది. 1/70 చట్టం, ఐదవ షెడ్యూల్ హక్కులు సక్రమంగా అమలు కావడం లేదు. గిరిజనేతరుల ఆధిపత్యం పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. స్థానిక గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. గిరిజనుల విద్య, ఉపాధి, ఆర్థిక అభివృద్ధి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా చూడాలి. ప్రతి గిరిజన కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందాలి. విద్య, ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు అటవీ, భూమి హక్కులను కాపాడాలి. అన్ని గిరిజన తెగల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలి. తెగల మధ్య విభేదాలు సృష్టించడం వల్ల ఐక్యత దెబ్బతింటుంది తప్ప అభివృద్ధి సాధ్యం కాదు. అందుకే గిరిజన తెగలన్నీ ఐక్యంగా నిలబడి తమ హక్కుల కోసం పోరాడి సాధించుకోవాలి.


మూడ్ ధర్మనాయక్, 9490098685

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్