Magazines

ట్రంప్ పన్ను దుస్సాహసం

16 నిమిషాల క్రితం

gamble
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026 | 3 నిమిషాల చదవడం

గతంలో వివిధ దేశాలపై ప్రతిపాదించిన దిగుమతి సుంకాలు చెల్లవని అమెరికా కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే ఇరాన్‌పై దాడి ఇతర తప్పిదాలతో భారాలు మోపినందుకు మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లు చుక్కలు చూపించి రిపబ్లికన్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించారు. అటు న్యాయ, ఇటు ప్రజాక్షేత్రంలో తిరస్కరించినప్పటికీ డోనాల్డ్ ట్రంప్‌కు బుద్ధి రాలేదు. మరొక మార్గంలో బుధవారం నాడు పద్నాలుగు ప్రధాన వాణిజ్య భాగస్వాములపై పన్నుల కొరడా ఝళిపించాడు. వీటిలో మనదేశం, చైనా, బ్రెజిల్, ఐరోపా యూనియన్, జపాన్ వంటివి ఉన్నాయి. వాషింగ్టన్ స్వంత వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 ప్రకారం గత ఎనిమిది నెలలుగా వివిధ దేశాల వాణిజ్య అక్రమాలపై విచారణ జరిపి నిజాలను నిర్ధారించారట. వ్యవస్థాగతంగా అధిక పారిశ్రామిక సామర్థ్యం ఉన్నట్లు తేల్చాం గనుక పన్ను విధించినట్లు ట్రంప్ ప్రకటిం చాడు.


తాము చెప్పినట్లు గనుక వినకపోతే 15నుంచి 40శాతం వరకు అపరాధ సుంకాలు వేస్తామన్నాడు. అడ్డగోలు వ్యవహారం తప్ప ఇదేమీ స్వతంత్ర సంస్థ విచారణ కాదు. ఏకపక్షంగా జరపటానికి అమెరికాకు ఎలాంటి హక్కు లేదు. ఇతర దేశాలను వేలెత్తి చూపుతున్న యాంకీలు తమకింది నలుపును చూసుకోవ టం లేదు. ఏ దేశానికి ఏ రంగంలో అధిక సామర్ధ్యం ఉందో అది తమకు ఎలా ప్రమాద కరమో నిర్ణయించటానికి అమెరికాకు హక్కు ఎక్కడుంది? తమ జనాభా అవసరాలకు మించి వ్యవసాయం, పాడి, కోళ్ల పరిశ్రమల వంటి రంగాల్లో అమెరికా ఎక్కువగా ఉత్పత్తి చేస్తోంది. వాటిని వదిలించుకొనేందుకు పెద్ద మొత్తాలలో సబ్సిడీలిస్తూ ఇతర దేశాల మార్కెట్లలో కుమ్మరిస్తున్నది. మెడమీద కత్తిలా ఈ ప్రమాదం ఉన్నకారణంగానే గత పాతిక సంవత్సరాల్లో అమెరికాతో మనకు వాణిజ్య ఒప్పందం కుదరలేదు. అమెరికా మొక్కజొన్నలు, జున్ను, ఇతర పాల ఉత్పత్తులు, కోడి కాళ్ల వంటి వాటిని మన మార్కెట్లో అనుమతిస్తే వినియోగదారులకు తక్కువ ధరలకే దొరుకుతాయి.


కానీ ఈ రంగాలపై ఆధారపడిన కోట్లామంది రైతులు, కార్మికుల జీవితాలు బుగ్గిపాలవుతాయి. మీ అవసరానికి మించి అదనంగా ఎందుకు ఉత్పత్తి చేస్తున్నారంటే ఆహార భద్రత అనే మహత్తర లక్ష్యం అని ట్రంప్ యంత్రాంగం సమర్ధించు కుంటోంది. ప్రపంచంలో తయారయ్యే ఆయుధాలలో ఒక్క అమెరికానే సగం తయారు చేస్తున్నది. ఐదువేలకు పైగా అణ్వాయుధాలను కలిగి ఉన్నది, ఇక బాంబుల సంగతి చెప్పనవ సరం లేదు. ఇవేవీ నిత్యావసరాలు కాదే, ఎందుకు ఇన్ని మారణాయుధాలను కుప్పపోసి పెట్టు కున్నట్లు? ఏ దేశమైనా అవసరాలకు మించి ఉత్పత్తి చేస్తే అవి అమ్ముడుపోకపోతే నష్టపోయేది ఆ దేశం తప్ప ఇతరులకు వచ్చే ఇబ్బంది ఏముం టుంది. చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా తయారై చౌకగా వస్తువులను అందిస్తున్నది. అది మంచిదేకదా, అందుకేగా నరేంద్రమోడీ నేతగా ఉన్న బీజేపీ-ఆరెస్సెస్‌ చైనాను వ్యతిరేకిస్తున్న ప్పటికీ మేకిన్, మేడిన్ ఇండియా వంటి పిలుపులన్నింటినీ కాషాయ వస్త్రాలలో చుట్టి పక్కనపెట్టి గత రికార్డు లన్నింటినీ బద్దలు కొట్టి అక్కడి నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటున్నది.

అంతెందుకు టాయిలెట్‌లో తుడుచుకొనే కాగితాల నుంచి అనేక వస్తువులను అమెరికా ఎందుకు అక్కడి నుంచి తెచ్చుకుం టున్నట్లు? చైనా ఉత్పత్తులతో తమ జనాలకు ఉపాధి లేకుండా పోతున్నదని మరొక ముక్తాయింపు.దిగుమతి చేసుకోవటం నిలిపివేసి ట్రంపే పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు ఇవ్వవచ్చు కదా! ఎవరు అడ్డుకున్నారు? బీజింగ్ వస్తువుల మీద ఆధారపడకూడదని, దాన్ని పక్కన పెట్టి సమిష్టిగా మన వస్తువులను మనమే సమకూర్చుకుందామని మోడీతో సహా ట్రంప్ తదితరులందరూ పదే పదే సంకల్పం చెప్పుకుంటున్నారు. చైనాకు సెమీకండక్టర్లు, వాటిని తయారు చేసే యంత్రాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందకుండా చూసేందుకు దిగుమతులు నిలిపివేయాలని పాక్స్ సిలికా పేరుతో మనతో సహా అమెరికా ఒక కూటమిని ఏర్పాటు చేసిన సంగతిదాస్తే దాగుతుందా? అమెరికా వస్తువుల మీద పన్ను వేయం అని కూడా చెప్పాం, అయినా ట్రంప్‌కు మన మీద ఆగ్రహం ఎందుకు ?


ప్రపంచంపై ట్రంప్ ప్రకటించిన తాజా పన్నుల యుద్ధంతో అతగాడేమైనా సాధిస్తాడా అంటే అంతసీన్ లేదని గత చరిత్ర చెప్పింది. దిగుమతి చేసుకొనే వస్తువులపై పన్నులు విధిస్తే వాటిని భరించేది అమెరికా వినియోగదారులే. వస్తు వినియోగం తగ్గితే నష్టపోయేది అక్కడి వ్యాపారులే. అందుకే అదిరించి బెదిరించి తనదారికి తెచ్చుకోవాలన్న ఎత్తుగడతో అమెరికా ఉంది. తాజాగా ప్రకటించిన పన్నుల గురించి సదరు దేశాలు తమతో రాజీకి వచ్చి ఒప్పందాలు చేసుకొనేందుకు వచ్చే ఏడాది మార్చి నెల వరకు అవకాశం ఇస్తున్నట్లు అమెరికా చెబుతోంది. ఈ బెదిరింపును అనేక దేశాలు ఖండించినా మన దేశం మాత్రం మౌనంగానే ఉంది. మా దగ్గర అదనపు ఉత్పత్తి సామర్ధ్యం లేదని మాత్రమే చెప్పింది. రెండు ప్రపంచ యుద్ధాల తరువాత ఏదో ఒక దేశం లేదా కూటమి హవా నడవదని అమెరికాకు ఇంకా అర్థం కావటం లేదు. దానికి తెలియ చెప్పాలంటే మోడీ వంటి వారు మౌన దౌత్యాలు, కాళ్లు గడ్డాలు పట్టుకొని బతిమిలాడితే ట్రంప్ దారికొచ్చే రకం కాదు. గత పన్నెండేళ్లుగా అమెరికాకు మిత్రదేశంగా ఉన్న తరువాత మన మీద తాజాదాడి ప్రకటించాడని మోడీ అండ్‌కోకు అర్థమైనా తెలియనట్లు నటించవచ్చు. కానీ మన జనాలు అంతా గమనిస్తూనే ఉన్నారన్న సంగతి గ్రహించాలి!

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్