– ఉపాధి హామీ పథకం విరుద్ధంగా వ్యయం
– కొనసాతున్న సిబ్బంది నిర్లక్ష్యం
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండల పరిధిలో జరిగిన 16వ విడత ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ తనిఖీలో అధికారులు పనుల అమలు, ఖర్చుల వివరాలు, కూలీలకు చెల్లించిన వేతనాలు వంటి అంశాలను పరిశీలించారు. సమావేశానికి ఏపీడీ రవి హాజరై తనిఖీ ప్రక్రియను సమీక్షించారు.
సామాజిక తనిఖీ నివేదిక ప్రకారం మండలంలో మొత్తం 387 పనులు నిర్వహించగా సుమారు రూ.4.95 కోట్ల వ్యయం జరిగింది. ఇందులో కూలీలకు చెల్లించిన వేతనాలు రూ.17.30 లక్షలు మాత్రమే ఉండగా, వస్తు వ్యయం రూ.5.13 కోట్లకు చేరడం గమనార్హం. ఇది ఉపాధి హామీ పథకం ప్రధాన ఉద్దేశ్యం అయిన కూలీలకు ఉపాధి కల్పన లక్ష్యానికి విరుద్ధంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అలాగే తనిఖీలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడడంతో సంబంధిత క్షత్ర, సాంకేతిక సహాయకులు, పంచాయతీ కార్యదర్శుల పై రికవరీ గా రూ.1,17,940 మరియు పెనాల్టీ గా రూ.59,615 విధించారు.ఈ క్రమశిక్షణ చర్యతో ధ్యతాయుతంగా వ్యవహరించని వారి పై కఠిన చర్యలు తప్పవని స్పష్టంగా తెలుస్తుంది.
అధికారులు పనుల అమలులో పారదర్శకత, నాణ్యత పాటించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఉపాధి పనులు ప్రజలకు నిజమైన ప్రయోజనం చేకూరేలా చేయాలని, కూలీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
ఇలాంటి సామాజిక తనిఖీలు ప్రభుత్వ పథకాల అమలులో లోపాలను బయటపెట్టి సరిదిద్దేందుకు ఉపయోగపడతాయి. ఇటువంటి తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహిస్తే అవినీతి తగ్గి, పథకాల లక్ష్యాలు సక్రమంగా నెరవేరే అవకాశం ఉంటుంది.



