నాణ్యతాలోపంతో రూ.కోట్ల నిధులు నీళ్ల పాలు
భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల సరిహద్దులో ఘటన
కొట్టుకుపోయిన మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు..
నవతెలంగాణ-మల్హర్‌రావు
వరద పోటెత్తుతుంటే నీటిని ఒడిసి పట్టే అనకట్టలు ఎక్కడికక్కడ ధ్వంసమై వరదల్లో కొట్టుకుపోతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. మానేరు నదిలో నీటి ప్రవాహం పెరగడంతో నీటి తాకిడికి చెక్‌డ్యామ్ కొట్టుకుపోయిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం వల్లెంకుంట గ్రామ పరిసరాల్లో బుధవారం చోటుచేసుకుంది. చెక్‌డ్యామ్ గోడ కూలిపోవడంతో నీరంతా దిగువకు వృథాగా పోతూ పంట పొలాలు ధ్వంసమయ్యాయి. కాగా, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల సరిహద్దుల్లో గత ప్రభుత్వ హయాంలో మానేరుపై నిర్మాణం చేపట్టిన చెక్ డ్యామ్‌లు వరద తాకిడికి ఇప్పటికే రెండు సార్లు కొట్టుకుపోవడంతో కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చెక్‌డ్యామ్ పూర్తిగా ధ్వంసమవడంతో నిర్మాణానికి వెచ్చించిన నిధులు నీళ్లపాలయ్యాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ చెక్‌డ్యామ్ కొట్టుకుపోవడానికి అధికారుల పర్యవేక్షణా లోపంతో కాంట్రాక్టర్లు నాణ్యాతా ప్రమాణాలు పాటించకపోవడమే కారణమా అన్న అనుమానం కలుగుతోంది.
అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో నదిలో చేపలు పడుతున్న ఇద్దరు మత్స్యకారులు ప్రవాహ ఉధృతికి కొద్దిదూరం కొట్టుకుపోయారు. తర్వాత వారు ఈదుకుంటూ ఒడ్డుకు చేరడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. మల్హర్‌రావు మండలంలో రైతుల పంట పొలాలకు అవసరమైన నీటిని నిల్వ చేయాలనే ఉద్దేశంతో చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. కాగా, మల్లారం-అడవి సోమన్‌పల్లి, తాడిచెర్ల-ఖమ్మంపల్లి చెక్‌డ్యామ్‌లు గత రెండేండ్ల క్రితం ధ్వంసమవ్వగా, మళ్లీ నిధులు కేటాయించి నిర్మించారు. మల్లారం మానేరు నదిపై చెక్‌డ్యామ్ నిర్మాణానికి మొదటిసారి రూ.8కోట్ల పైనే ఖర్చు చేశారు. కాగా, తేలికపాటి వరదల్లో చెక్‌డ్యామ్‌తో పాటు పక్కనున్న పొలాలు సైతం కోతకు గురయ్యాయి. రెండోసారి రూ.16.62కోట్లతో నిర్మాణ పనులు చేపట్టారు. తాడిచెర్ల, ఖమ్మంపల్లి మానేరుపై రూ.14.31కోట్లతో, సోమన్‌పల్లి, పీవీ నగర్ మానేరుపై రూ.13.40కోట్లతో నిర్మాణ పనులు చేపట్టారు. అయితే, బుధవారం ఉదయం మానేరు నదిలో ఒక్కసారిగా నీటిప్రవాహం పెరగడంతో చెక్‌డ్యామ్ కొట్టుకుపోయింది.
శాశ్వత పరిష్కారమేది..
ఆయకట్టల నిర్మాణంలో భాగంగా ముందుగా వాగులో గట్టితనం వచ్చే వరకు ఇసుకను పూర్తిగా తోడి బెడ్ నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఇసుకపై పునాది వేయడంతో చెక్‌డ్యామ్ కింద నీటిని ఎత్తిపోసేందుకు నిర్మించిన ఆప్రాన్లు రిటైనింగ్ వాక్స్, అబార్ట్‌మేంట్ భాగాలు వరద ఉధృతికి దెబ్బతింటున్నాయి. నీటి ప్రవాహాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోయింది. ఇసుక మేటలు పూర్తిగా తొలగించకుండానే చెక్‌డ్యామ్ నిర్మాణం చేపట్టడంతో దెబ్బతింటున్నాయని పరివాహక ప్రాంత రైతులు చెబుతున్నారు. అధికారులు మాత్రం వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి వెళుతున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణాలోపం.. పనుల్లో లేని నాణ్యత..
చెక్ డ్యాములు తరచూ వరదల్లో కొట్టుకపోవడం పరిపాటిగా మారింది. చెక్‌డ్యామ్ నిర్మాణ పనులపై సంబంధించిన ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ పనుల్లో క్వాలిటీ లేకనే తరచూ వరదల్లో కొట్టుకుపోతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. మానేరుపై 500మీటర్ల పొడవుతో నిర్మాణం చేయనున్న చెక్‌డ్యామ్ పనుల్లో సైడ్ వాల్స్ అడుగు భాగంలో కాంట్రాక్టర్లు దుబ్బమట్టి పోయకపోవడంతో, చెక్ డ్యామ్‌లకు ఇరువైపులా కరకట్టలు కట్టకపోవడంతో పొలాలు కోతకు గురయ్యాయని రైతులు వాపోతున్నారు.



