– గుజ్జు ఫ్యాక్టరీలు తీవ్ర అన్యాయం
– కిలోకు రూ.8కుగానూ రూ.4, రూ.5 చెల్లింపు
– ఐదు నెలలుగా కాళ్లరిగేలా తిరుగుతున్న రైతులు
– 22న చిత్తూరు, తిరుపతి కలెక్టరేట్ల ముట్టడికి సమాయత్తం
యాదమరి (చిత్తూరు జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు ఇచ్చిన హామీ అమలు నోచుకోవడం లేదు. దీంతో, డబ్బుల కోసం రైతులు మామిడి గుజ్జు ఫ్యాక్టరీల చుట్టూ కాళ్లరిగే తిరగాల్సి వస్తోంది. వెంటనే ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఈ నెల 22న చిత్తూరు, తిరుపతి కలెక్టరేట్ల ముట్టడికి సమాయత్తం అవుతున్నారు. గత మామిడి సీజన్ ఆలస్యంగా జూన్, జులైల్లో ప్రారంభమైంది. గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. దీంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. రైతులతోనూ, మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులతోనూ వేర్వేరుగా సమావేశమయ్యారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తోతాపురి రకానికి కిలోకు రూ.12 ధర ప్రకటించారు. ఇందులో ఎనిమిది రూపాయలు మామిడి గుజ్జు పరిశ్రమలు చెల్లిస్తాయని, మిగిలిన నాలుగు రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందని హామీ ఇచ్చారు. కిలోకు రూ.8 ధర ఇవ్వని పరిశ్రమలను మూయించేస్తామని ఈ సందర్భంగా యజమాను లను ఈ సందర్భంగా చంద్రబాబు హెచ్చ రించారు. చివరి కిలో వరకూ కొనుగోలు చేసి రైతు లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తోతాపురి రకం మామిడికి గుజ్జు పరిశ్రమలు కిలోకు రూ.8 కచ్చితంగా చెల్లించాలని అనంతరం ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గత సీజన్లో మామిడి దిగుబడి ఆశాజనకంగా వచ్చింది. 34 ఫ్యాక్టరీలు 31,929 మంది రైతుల నుంచి 3,67,116 మెట్రిక్ టన్నుల మామిడిని కొనుగోలు చేశాయి. అయితే, కొన్ని ఫ్యాక్టరీలు కిలోకు రూ.4 చొప్పున, మరికొన్ని ఫ్యాక్టరీలు రూ.5 చొప్పున మాత్రమే చెల్లించాయి. పైగా, 50 శాతం మంది రైతులకు మాత్రమే ఈ మేరకు చెల్లింపులు జరిగినట్లు సమాచారం. మిగిలిన 50 శాతం మందికి ఒక్క రూపాయి కూడా చెల్లించనట్లు తెలుస్తోంది. ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా జమకాని వారు, సగంసగం అందిన వారు ఫ్యాక్టరీల చుట్టూ నెలల తరబడి ప్రదక్షిణలు చేస్తోన్నా సమాధానం చెప్పేవారే కరువయ్యారు. అయినా, ప్రభుత్వం గుజ్జు పరిశ్రమల యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా చేష్టలుడిగిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రభుత్వం ప్రకటించిన రూ.4 ఇప్పటికే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. ఇకెవైసి పూర్తి కాని వారికి మాత్రం జమకాలేదు.
రూ.8 ఇస్తామని నమ్మించారు
నాకు రెండు ఎకరాల్లో మామిడి తోట ఉంది. తవణంపల్లి మండలంలోని నవ్య ప్యాక్ ఫుడ్స్ గుజ్జు పరిశ్రమకు నాలుగు టన్నుల మామిడి కాయలను తోలాను. నా బ్యాంకు ఖాతాలో ఐదు రూపాయల చొప్పున నాలుగు టన్నులకు 20 వేలు వేసింది. మిగిలిన డబ్బులు నేటికీ పడలేదు.
రామయ్యగౌడు, ఐరాల
ఒక్క రూపాయి బిల్లూ చెల్లించలేదు
పది ఎకరాల్లో మామిడి తోట ఉంది. గుడిపాల మండలంలో ఫుడ్ అండ్ ఇన్స్ గుజ్జు ఫ్యాక్టరీకి 20 టన్నుల మామిడి కాయలు తోలాను. ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించలేదు. రూ.1.60 లక్షలు రావాల్సి ఉంది. డబ్బుల కోసం ఐదు నెలలుగా ఎదురు చూస్తున్నాను.
-భాగ్యనాథ్‌రెడ్డి, యాదమరి
మామిడి రైతులకు మొండిచెయ్యి
- Advertisement -
- Advertisement -



