Sunday, July 20, 2025
E-PAPER
Homeజాతీయంఎరువుల్లేవ్‌..!

ఎరువుల్లేవ్‌..!

- Advertisement -

భారత్‌కు ఫర్టిలైజర్‌ కష్టాలు
పెరిగిన డిమాండ్‌.. 16 శాతం పడిపోయిన దిగుమతులు
ఏటా ఇదే పరిస్థితి
ఆకాశాన్నంటుతున్న డీఏపీ ధరలు
ఎరువుల సబ్సిడీపై ప్రభావం
అన్నదాతకు కష్టకాలం
చేతులెత్తేసిన మోడీ సర్కారు

భారత్‌లో ఎరువుల కొరత అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తున్నది. దేశంలో ఫర్టిలైజర్‌ డిమాండ్‌ ఏటికేడూ పెరుగుతున్నది. కానీ అందుకు తగిన సరఫరా, దిగుమతులు మాత్రం ఉండటం లేవు. ఫలితంగా డిమాండ్‌, సప్లై మధ్య భారీ అంతరం ఏర్పడుతున్నది. అది దేశంలో ఎరువుల లభ్యతపై పడుతున్నది. ఇప్పటికే కీలకమైన డై-అమ్మోనియా ఫాస్పేట్‌ (డీఏపీ) ధరలు జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి. దీని ప్రభావం దేశంలోని ఎరువుల సబ్సిడీపై పడుతున్నది. దేశంలో ఇప్పటికే సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలకు ఈ పరిస్థితులు ఆందోళనకు గురి చేస్తాయని మేధావులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ : భారత్‌లో ఏటా ఎరువుల కొరత ఏర్పడుతున్నది. దీంతో ఎరువుల లభ్యత కోసం దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ దిగుమతులు కూడా ప్రతి ఏటా పడిపోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో యూరియా, డీఏపీ, పొటాష్‌ ఫర్టిలైజర్‌ దిగుమతులు 16 శాతం తగ్గుదలను చూశాయి. ఇక 2024-25లో ఎరువుల దిగుమతులు 7.16 శాతం తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో దిగుమతుల విలువ 8.29 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. 2022-23లో 15.32 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఎరువుల దిగుమతులు.. 2023-24లో 8.92 బిలియన్‌ డాలర్లకు దారుణంగా తగ్గాయి. దేశంలో ఎరువుల లభ్యత కష్టంగా మారటంతో దిగుమతులను గణనీయంగా పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు 20 శాతం యూరియా, 50-60 శాతం డీఏపీ, వంద శాతం ఎంఓపీలు ఇతర దేశాల నుంచే భారత్‌కు దిగుమతి అవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి.

షాకిస్తున్న డీఏపీ ధరలు
దేశంలో ఎరువుల కొరతకుతోడు వాటి ధరలు కూడా షాకిస్తున్నాయి. ఆకాశమే హద్దుగా పెరుగుతున్న డై-అమ్మోనియా ఫాస్పేట్‌ (డీఏపీ) ధరలు అమాంతం పెరిగి ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో దీని ప్రభావం ఎరువుల సబ్సిడీలపై పడే ప్రమాదం కనిపిస్తున్నది. ఫలితంగా ఎరువుల కంపెనీలకు కేంద్రం ఆర్థికంగా ప్రత్యేక ప్యాకేజీని అందించాల్సి ఉంటుందనీ, అలా అయితేనే రైతులకు సబ్సిడీకి ఎరువులు అందుతాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఇందుకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎదురైన పరిస్థితిని వారు గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో డిమాండ్‌కు తగ్గట్టుగా డీఏపీని సమకూర్చుకోవటంలో కేంద్రం విఫలమైంది. ఇలాంటి తరుణంలో ఖరీఫ్‌, రబీ సీజన్లకు గానూ డీఏపీపై టన్నుకు రూ.3500 స్పెషల్‌ ప్యాకేజీని ఫర్టిలైజర్‌ కంపెనీలపై ప్రభుత్వం కల్పించించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు చెప్తున్నారు. ఇప్పటికే దేశంలో పంటలకు కీలకమైన డీఏపీ కొరతను పలు నివేదికలు సూచిస్తున్నాయి. గతేడాది ఈ ఎరువుల సరఫరాలో ఎదురైన అడ్డంకుల కారణంగా ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో జూన్‌ 1న డీఏపీ ప్రారంభ నిల్వ (ఓపెనింగ్‌ స్టాక్‌) 1.24 మిలియన్‌ టన్నులు (ఎంటీలు)గా ఉన్నది. అంతకముందు ఏడాది ఇదే సమయానికి అది 3.3 ఎంటీలుగా ఉన్నది. అయితే పెరుగుతున్న ధరల నేపథ్యంలో డీఏపీ ఎంఆర్‌పీలో ఎలాంటి మార్పూ ఉండదని అధికారులు చెప్తుండటం గమనార్హం.

ఇతర దేశాలతో ఒప్పందాలు
ఫర్టిలైజర్‌ లభ్యత సంక్లిష్టత నేపథ్యంలో గతవారం మాడెన్‌, సౌదీ అరేబియా, భారతీయ కంపెనీల మధ్య ఒక దీర్ఘకాలిక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రాబోయే ఐదేండ్లు ఏటా 3.1 ఎంటీల డీఏపీను సరఫరా భారత్‌కు సదరు దేశాలు సరఫరా చేయాల్సి ఉంటుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 1.9 ఎంటీ డీఏపీని సౌదీ అరేబియా నుంచి దిగుమతి చేసుకున్నది. అంతకముందు ఏడాదితో పోలిస్తే ఇది 17 శాతం అధికం. భారత్‌ ప్రధానంగా డీఏపీని పశ్చిమ ఆసియా, జోర్డాన్‌ల నుంచి దిగుమతి చేసుకుంటుంది. దేశీయ పొటాష్‌ ఫర్టిలైజర్‌ డిమాండ్‌ మొరాకో, సౌదీ అరేబియా, బెలారస్‌, కెనడా, జోర్డాన్‌ వంటి దేశాల నుంచి దిగుమతుల ద్వారా తీరుతుంది.

బడ్జెట్‌ అంచనాలపై ప్రభావం
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత్‌లో ఫర్టిలైజర్‌ సబ్సిడీకి కేంద్రం ముందుగా అనుకున్నదాని కంటే మరింత ఖర్చు చేయాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. కారణం.. ఏప్రిల్‌ ప్రారంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా డీఏపీ ధరలలో 23 శాతం పెరుగుదల నమోదు కావటమే. దీంతో ఈ ప్రభావం బడ్జెట్‌ అంచనా(బీఈ)పై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరానికి గానూ ఫర్టిలైజర్‌ సబ్సిడీ కోసం ప్రభుత్వ బడ్జెట్‌ అంచనాలు రూ.1.67 లక్షల కోట్లుగా ఉన్నాయి. అయితే డీఏపీ ధరల పెరుగుదలతో ఈ అంచనా మొత్తం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రపంచ సరఫరాల్లో సవాళ్లు.. ధరల పెరుగుదల
గ్లోబల్‌ డీఏపీ ధరలు ఏప్రిల్‌లో టన్నుకు 650 డాలర్ల నుంచి ప్రస్తుతం 800 డాలర్లకు పైగా పెరిగాయి. డీఏపీ ధరల పెరుగుదలపై పలు అంశాలను కారణాలుగా మార్కెట్‌ వర్గాలు చెప్తున్నాయి. ఎర్ర సముద్రంలో సంక్షోభం, కొన్ని దేశాల ఎగుమతుల నియంత్రణలు, రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, బెలారస్‌పై ఆంక్షలు వంటివి ప్రపంచ సరఫరాలపై ప్రభావాన్ని చూపుతున్నాయని వివరిస్తున్నాయి. ముడి పదార్థాల సరఫరాను సజావుగా సాగేలా చూడటానికి తాము గనులను కొనుగోలు చేయటంలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరమున్నదని డీఏపీ తయారీదారు ఒకరు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఫర్టిలైజర్‌ ట్రేడ్‌లో చైనా ఆధిపత్యం కొనసాగుతున్నది. 2021లో దాదాపు 15 శాతం యూరియా, 30 శాతం ఫాస్పేట్‌ ఎగుమతులు చైనా నుంచే జరిగాయి. ప్రపంచంలోనే అధిక యూరియా దిగుమతిదారుగా భారత్‌ ఉన్నది. ఇలాంటి తరుణంలో చైనాతో సత్సంబంధాలను కొనసాగించాల్సిన అవసరాన్ని మేధావులు నొక్కి చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -