Monday, October 6, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో మణిపూర్‌ బీజేపీ పంచాయితీ

ఢిల్లీలో మణిపూర్‌ బీజేపీ పంచాయితీ

- Advertisement -

రాష్ట్రపతి పాలన తొలగించేలా కేంద్రంపై ఒత్తిడికి ప్రయత్నాలు

న్యూఢిల్లీ : ప్రస్తుతం మణిపూర్‌లో అమలులో ఉన్న రాష్ట్రపతి పాలనను ఎత్తివేసి, నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ శాసనసభ్యుల బృందం ఢిల్లీకి చేరుకుంది. ఈ బృందానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్‌. బీరేన్‌ సింగ్‌ నేతృత్వం వహిస్తున్నారు. జాతుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో ఫిబ్రవరి 13న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. గడువు ముగియడంతో పార్లమెంట్‌ అనుమతితో ఆగస్టులో మరో అరు నెలలు పొడిగించారు. రాష్ట్రం కేంద్ర పాలనలో ఉన్నప్పటికీ శాసనసభను రద్దుచేయకుండా సుప్తచేతనావస్థలో ఉంచారు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వంతో సమావేశమై మణిపూర్‌లో సాధ్యమైనంత త్వరగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరతానని బీరేన్‌ సింగ్‌ తెలిపారు.

ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించేందుకు…ముఖ్యంగా నిరాశ్రయులైన స్థానిక ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు చేపట్టాల్సిన చర్యల పైన కూడా కేంద్ర నాయకత్వంతో చర్చిస్తానని ఢిల్లీ వెళ్లే ముందు ఇంఫాల్‌ విమానాశ్రయంలో ఆయన విలేకరులకు చెప్పారు. కాగా ఢిల్లీలో మకాం వేసిన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ అప్పాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే వీరికి వారిని కలుసుకునే అవకాశం లభిస్తుందా లేదా అనేది తెలియడం లేదు. గత నెల 13న ప్రధాని మోడీ మణిపూర్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. మణిపూర్‌లో నింగోల్‌ ఛాకోబా ఉత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలనకు ముగింపు పలకాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా బీరేన్‌ బృందం చివరికి ఢిల్లీ బాట పట్టింది. శాసనసభ స్పీకర్‌ సత్యవ్రత సింగ్‌, ఇంఫాల్‌లో మిగిలిన బీజేపీ ఎమ్మెల్యేలు కూడా రాజధానికి చేరుకుంటున్నారు.

పట్టుకోల్పోతున్న బీజేపీ
మణిపూర్‌లో హింస చల్లారకపోవడంతో బీరేన్‌ ఫిబ్రవరి 9న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత మూడు రోజులకు రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రంలో బీజేపీ పట్టు సడలిపోతున్న తరుణంలో బీరేన్‌ బృందం ఢిల్లీ పర్యటనను తలపెట్టడం గమనార్హం. తమకు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని బీజేపీ బింకంగా చెబుతున్నప్పటికీ ఆ పరిస్థితి కన్పించడం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ రాష్ట్రంలోని రెండు స్థానాలనూ కాంగ్రెస్‌కు కోల్పోయింది. హింస నేపథ్యంలో బీజేపీకి చెందిన ఏడుగురు కుకీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. దీనికితోడు ఇటీవల ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ గూటికి చేరారు. రాష్ట్రంలో మోడీ పర్యటించిన తర్వాత కూడా ప్రజలు సహాయ శిబిరాలలోనే తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -