Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంమణిపూర్‌ అంటేనే ముచ్చెమటలు

మణిపూర్‌ అంటేనే ముచ్చెమటలు

- Advertisement -
  • రెండేండ్లుగా ముఖం చాటేసిన ప్రధాని మోడీ
  • ఇప్పటికీ అక్కడి ప్రజల్లో తీవ్ర ఆగ్రహం
  • రాష్ట్ర పర్యటనలకు మోడీ వచ్చే అవకాశం
  • కొత్త ప్రభుత్వం, సీఎం నియామకమే లక్ష్యం
  • బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు
  • ప్రాధాన్యత సంతరించుకున్న ప్రధాని పర్యటన

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ప్రధాని మోడీ పర్యటించే అవకాశాలున్నాయని ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. దీని ప్రకారం మణిపూర్‌లోని అక్కడి పోలీసులు, ఇతర అధికారులు అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగులకు సెలవులు నిరాకరిస్తున్నారు. కొన్ని వార్త పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం మోడీ ఈనెల రెండోవారంలో మణిపూర్‌లో పర్యటించొచ్చని తెలుస్తున్నది. అయితే జాతి హింసతో అట్టుడికి గత రెండేండ్లుగా నిత్యం వార్తల్లో నిలిచిన మణిపూర్‌లో ఇప్పుడు ప్రధాని పర్యటన వార్తలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రెండు వర్గాల మధ్య జాతిహింసతో తీవ్ర హింసకు దారి తీసిన విషయంలో ప్రధాని మోడీ రెండేండ్లుగా మౌనం వహించి ఇప్పుడు రాష్ట్రంలో పర్యటనకు రావటం అంత సులువేమీ కాదని విశ్లేషకులు చెప్తున్నారు.

న్యూఢిల్లీ : మణిపూర్‌లోని మెయిటీలు, కుకీల మధ్య రిజర్వేషన్‌ విషయంలో మే 2023లో తీవ్ర అల్లర్లు చెలరేగిన విషయం విదితమే. ఆ తర్వాత ఇది రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి శాంతిభద్రతల విఘాతానికి దారి తీసింది. శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వం చేదాటిపోయాయి. దీంతో కేంద్రం జోక్యం చేసుకోక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్రం పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించినా.. మణిపూర్‌లో ఇప్పటికీ హింస చల్లారలేదు. శాంతియుత పరిస్థితులు ఏర్పడలేదు. కేంద్ర, రాష్ట్రంలలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలే ఉన్నప్పటికీ.. అల్లర్లను నియంత్రించటంలో విఫలమయ్యాయని ప్రజలు సైతం గుర్తించారు. దీంతో కేంద్రంలోని మోడీ సర్కారుపై ఇక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతోనే ఉన్నారు.
ఒకవేళ ప్రధాని పర్యటన వార్త నిజమే అయితే.. దాదాపు రెండేండ్ల మౌనం తర్వాత ఆయన మణిపూర్‌లో పర్యటించినట్టవుతుంది. మణిపూర్‌లో పరిస్థితులు చక్కదిద్దేందుకే ప్రధాని పర్యటన అని అధికారిక వర్గాలు చెప్తున్నా.. అక్కడి పరిస్థితులు మాత్రం ఆ విధంగా లేవని విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు. చాలా మంది శిబిరాల్లో నివసిస్తున్నారు. రెండేండ్లపాటు మౌనం వహించిన మోడీ తీరును వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మణిపూర్‌ అల్లర్లలో 260 మందికి పైగా మృతి చెందగా.. 60వేల మందికి పైగా ప్రభావితమయ్యారు.

మోడీ పర్యటన ప్రధానంగా రెండు కీలకాంశాలపై ఆధారపడి జరుగుతుందని తెలుస్తున్నది. సస్పెన్షన్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ కింద కొత్త ఒప్పందం, రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి నియామకం, నూతన ప్రభుత్వ ఏర్పాటు. కాగా 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న కొత్త ఒప్పందంపై నేడు (సెప్టెంబర్‌ 3) సంతకం చేయటానికి కేంద్ర హౌం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తమను ఆహ్వానించిందని యునైటెడ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (యూపీఎఫ్‌), కుకీ నేషనల్‌ ఆర్గనైజేషన్‌ (కేఎన్‌ఓ)లు వివరించాయి. రాష్ట్రంలో జాతి హింస జరిగినప్పటి నుంఇచ యూపీఎఫ్‌, కేఎన్‌ఓ రెండూ కుకీ-జో ప్రాంతాలకు ‘ప్రత్యేక పరిపాలన’ కోసం నిరంతరం ఒత్తిడి చేస్తున్నాయి. మెయిటీతో కలిసి ఉండే పరిస్థితి లేవని వాదిస్తున్నాయి. ఇటు మెయిటీలు కూడా ఇదే వాదనను చేస్తున్నారు.
ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు కూడా కీలకంగా మారనున్నది. ఆగస్టులో కేంద్రం.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను మరో ఆరునెలలు పొడగించింది. అయితే ఇక్కడి బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం గత కొంత కాలంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో మోడీ రాష్ట్ర పర్యటనకు రానుండటంతో నూతన సర్కారు కొలువుదీరే విషయంలో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. 60 మంది సభ్యులున్న మణిపూర్‌ అసెంబ్లీలో ఎన్డీఏకు 44 మంది సభ్యులున్నారు. కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించిన విషయం విదితమే. ఇటు బీజేపీ కూడా అంతర్గత కలహాలను ఎదుర్కొంటున్నది. బీజేపీకి చెందిన కుకీ ఎమ్మెల్యేలు.. జాతి హింస విషయంలో మాజీ ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్‌ వ్యవహారాన్ని ఇప్పటికే తీవ్రంగా ఖండించిన విషయం విదితమే. కాబట్టి కొత్త ముఖ్యమంత్రి, ప్రభుత్వ ఏర్పాటు ప్రధాని మోడీకి సవాలుగానే మారనున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad