- Advertisement -
- – వరద ఎక్కవ రావడంతో గేట్లు తెరిచేందుకు యత్నం
– తెరుచుకోని 2, 7, 8 నంబర్ల గేట్లు
– సిబ్బంది గేట్లు తెరిచేందుకు ప్రయత్నించిన విఫలం
– గేట్లను పరిశీలిస్తున్న ఇంజనీర్లు
– మంజీర గేట్లకు రిపేర్లు చేసి నీటిని విడుదల చేశాం
– సంగారెడ్డి తహసీల్దార్ బలరాం
నవతెలంగాణ- మెదక్ డెస్క్ : గత 15 రోజులుగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టుకు వరద పెరగడంతో దిగువకు నీటిని విడుదల చేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున వరద జలాలు మంజీర బ్యారేజీకి వస్తున్నాయి. వరద ప్రవాహం పెద్దమొత్తంలో ఉండడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేందుక యత్నించగా బ్యారేజీ గేట్లు తెరుచుకోవడం లేదు. నీటి ప్రవాహం ఎక్కవగా రావడంతో గేట్లు తెరుచుకోకపోవడంతో నీరు గేట్లు పై నుంచి కిందకు దుంకుతున్నాయి. బ్యారేజీ సిబ్బంది గేట్లు తెరిచేందుకు ఎంత ప్రయత్నించి ఓపెన్ కాకపోవడంతో హైదరాబాద్ లోని హెచ్ఎండీఏ ఇంజనీర్లకు సమాచారం అందించారు. దీంతో మంజీరా బ్యారేజీకి చేరుకున్న ఇంజనీర్లు గేట్లను పరిశీలించారు.
ప్రమాదంలో మంజీర బ్యారేజీ..
మంజీర బ్యారేజీకి వస్తున్న వరద ప్రవాహానికి గేట్లు ఎత్తి నీటిని వదిలేందుకు ప్రయత్నించగా గేట్లు తెరుచుకోకపోవడంతో బ్యారేజ్ ప్రమాదంలో పడింది. అదే విధంగా బ్యారేజీని రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా 2025 మార్చి నెల 22వ తేదీన మంజీర బ్యారేజీని జాతీయ ఆనకట్టల భద్రతా చట్టం-2021 ప్రకారం ఏర్పాటైన ఎస్డీఎస్ఓ ఆధ్వర్యంలో నిపుణుల బృందం బ్యారేజీని పరిశీలించి బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణ లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లర్లకు(పియర్ల)కు పగుళ్లు వచ్చాయని గుర్తించింది. వాటిని రిపేర్లు చేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ అనుకోని విధంగా భారీ వర్షాల వల్ల వరదలు పెరగడంతో నీటి ప్రవాహానికి గేట్లు తెరుచుకోకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. గతేడాది గేట్లు ఓపెన్ చేసే సమయంలో కూడా గేట్లు మొరాయించాయి. కాగా గేట్లు ఓపెన్ కాకపోవడంతో మంజీరా బ్యారేజ్ గేట్లపై నుంచి వరద నీరు ఎగిసిపడుతున్నది. అదే విధంగా గేట్లు క్లోజ్ చేసేటప్పుడు కూడా ఇబ్బందులు తప్పవని అధికారుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్యారేజీకి హైదరాబాద్ నుంచి ఇంజనీర్లను రప్పించగా వారు మంజీరా బ్యారేజ్ గేట్లను పరిశీలిస్తున్నారు. మంజీర బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం జరుగకముందే అధికారులు తేరుకుని బ్యారేజీకి రిపేర్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
గేట్లను ఓపెన్ చేశాం : సంగారెడ్డి తహసీల్దార్ బలరాం..
మంజీర బ్యారేజీకి గేట్లు తెరుచుకోకపోవడంతో హైదరాబాద్ నుంచి ఇంజనీర్లను రప్పించాం. వారి సహకారంతో గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్నాం. ముఖ్యంగా గేట్ నంబర్ 2, 7, 8 గేట్లు మొరాయించాయి. వాటికి రిపేర్ చేసి 1.5 మీటర్ల ఎత్తుకు గేట్లను లేపి దిగువకు 13333 క్యూసెక్కుల నీటిని వదలడం జరిగింది. ప్రస్తుతానికి ఎలాంటి అంతరాయం లేదు.
- Advertisement -