తనుగుల చెక్ డ్యాం పేల్చేశారా? కూలిపోయిందా?
ఇసుక మాఫియా పనేనంటున్న బీఆర్‌ఎస్
నిర్మాణ లోపాలే కారణమంటున్న కాంగ్రెస్
రంగంలోకి ఫోరెన్సిక్ నిపుణులు.. తీగలు, పేలుడు ఆనవాళ్లపై పోలీసుల జల్లెడ
తెరపైకి ‘డిసిల్టేషన్’ దందా..
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్ – పెద్దపల్లి జిల్లాల సరిహద్దులోని మానేరు నదిపై నిర్మించిన తనుగుల (గుంపుల) చెక్ డ్యాం వ్యవహారం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. నవంబర్ 21 రాత్రి వరకు బాగానే ఉన్న చెక్ డ్యాం, తెల్లవారేసరికి కుప్పకూలిపోవడం వెనుక కారణం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దీనిని నాణ్యతతో నిర్మించిందని, ఇసుక మాఫియా కుట్రపూరితంగా పేల్చేసిందని ‘గులాబీ’ నేతలు ఆరోపిస్తుండగా.. నాసిరకం పనుల వల్లే డ్యాం కుంగిపోయిందని, విచారణకు సిద్ధమని కాంగ్రెస్ నేతలు సవాల్ విసురుతున్నారు. పరస్పర ఆరోపణలు, సవాళ్ల నడుమ పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు అసలు నిజాలను నిగ్గుతేల్చే పనిలో పడ్డారు. మరోవైపు ఈ ఘటన మానేరు నదిలో జరుగుతున్న ఇసుక అక్రమాలను, గతంలో కూలిపోయిన చెక్ డ్యాంల నిర్మాణ నాణ్యత డొల్లతనాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.
2021లో కరీంనగర్ జిల్లా జమ్మికుంట సమీపంలోని తనుగుల, పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామాల మధ్య మానేరు నదిపై చెక్ డ్యాం నిర్మించారు. వరద ప్రవాహం లేని సమయంలో నవంబర్ 21 రాత్రి ఒక్కసారిగా కుంగిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోం ది. ఘటన జరిగిన రాత్రి గుంపుల లేదా తనుగుల వైపు నుంచి అనుమానిత వాహనాలు సంచరిం చాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ రాత్రి హార్వెస్టర్ మిషన్ ఒకటి నది వైపు వెళ్లినట్టు, కొందరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు, ఆ డ్రైవర్‌ను, స్థానిక మత్స్యకారులను విచారిస్తున్నారు. పేలుడు పదార్థాలు వాడారా? అని తేల్చేందుకు క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలంలో నమూనాలు సేకరించారు. ఆనవాళ్లు లభిస్తే కేసు మలుపు తిరిగే అవకాశం ఉంది.
అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం
చెక్ డ్యాం కూలిపోవడంతో ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతుంటే, పాలక పార్టీల నాయకులు మాత్రం దీనిని అస్త్రంగా మలుచుకుంటున్నారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి ఇది ముమ్మాటికీ కుట్ర అని చెప్పారు. కౌశిక్ రెడ్డి ఒకడుగు ముందుకేసి, డ్యాం రాళ్లలో అమర్చిన తీగలకు సంబంధించిన వీడియో ఫుటేజీని మీడియాకు చూపిస్తూ, ఇది ఇసుక మాఫియా పనేనని ఆరోపించారు. ఈ ఆరోపణలను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఖండించారు. పేల్చివేత అని రుజువైతే రాజీ నామా చేస్తానని సవాల్ విసిరారు. నాసిరకం పనుల వల్లే డ్యాం కూలిందని అన్నారు. సందట్లో సడేమియాగా కేంద్ర మంత్రి బండి సంజరు ఈ వ్యవహారంపై.. విజిలెన్స్ విచా రణ జరిపించాలని, కాంట్రాక్టర్ల నుంచే సొమ్ము రికవరీ చేసి డ్యాం పునర్నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.
తెరపైకి ‘డిసిల్టేషన్’ దందా..
తనుగుల చెక్ డ్యాం ఘటనతో మానేరు నదిలో జరుగుతున్న ‘డిసిల్టేషన్’ (పూడికతీత) వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల వద్ద పూడికతీత పనులు త్వరగా ముగిసినా, మానేరు నదిలో మాత్రం ఏండ్ల తరబడి డిసిల్టేషన్ పేరిట ఇసుక రవాణా కొనసాగుతూనే ఉంది. చెక్ డ్యాంలు కూలిపోతున్నా వాటి పునరుద్ధరణపై లేని శ్రద్ధ.. ఇసుక రీచ్‌ల ఏర్పాటుపై ఎందుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలిస్తున్నా ఇంకా పూడిక పేరుతో కొత్త రీచ్‌లకు అనుమతులు ఇస్తుండటం వెనుక ఆంతర్యం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
గతంలోనూ కుప్పకూలిన డ్యాంలు.. ఇదొక ‘సీరియల్’ వైఫల్యం
తనుగుల చెక్ డ్యాం ఘటన ఒక్కటే కాదు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగేండ్లలో (2019-2023 మధ్య) అనేక చెక్ డ్యాంలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. ఉమ్మడి జిల్లాలో 114 చెక్ డ్యాంలు ప్రతిపాదించగా, మానేరుపై 29 పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలో రూ.18 కోట్ల చొప్పున వెచ్చించి నిర్మించిన పలు చెక్ డ్యాంలు నాణ్యతా లోపాలతో కుప్పకూలాయి. ఇలా ఇప్పటివరకు 12 చెక్ డ్యాంలు వరద ఉధృతికి కొట్టుకుపోవడం గమనార్హం. బొమ్మకల్ చెక్‌డ్యాం లక్షా 70వేల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మిస్తే, 2.30 లక్షల క్యూసెక్కుల వరదకే ముక్కలైంది.
ఇదే కోవలో పెద్దపల్లి జిల్లాలోని మీర్జంపేట, మంగపేట, మడక, నీరుకుళ్ల చెక్ డ్యాంలు కూడా వరదలకు తట్టుకోలేక కొట్టుకుపోయాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలో నెహ్రూనగర్ వద్ద నిర్మించిన డ్యాం ప్రారంభించిన కొద్ది రోజులకే ధ్వంసమైంది. ఈ క్రమంలో ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన తనుగుల చెక్ డ్యాం ఘటన ఒక నిర్మాణ వైఫల్యం మాత్రమే కాదు.. ఇసుక మాఫియా, రాజకీయ అవినీతి, అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. రైతుల ప్రయోజనాల దృష్ట్యా, పోలీసులు ఈ కేసును రాజకీయాలకు అతీతంగా విచారించి, నిజాలను తేల్చాల్సి ఉంది.



