ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా వ్యవహారిస్తోన్న సీఈసీ : ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్
బడ్జెట్, పెన్షన్ పెంపు కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం : ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య
ఎన్‌పీఆర్‌డీ 16వ ఆవిర్భావ ముగింపు సభ
నవతెలంగాణ – ముషీరాబాద్
వికలాంగుల హక్కులను ఒప్పుకోని మనుధర్మశాస్త్రాన్ని తిరస్కరించాలని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్నదని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ అన్నారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సంఘం 16వ ఆవిర్భావ వారోత్సవాల ముగింపు సభను శనివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్ అధ్యక్షతన ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ – వికలాంగులపై ప్రభావం’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. ప్రజల ఓట్లను తొలగించేందుకే ‘సర్’ అమలు చేస్తున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ అమలవుతోందని, ఇప్పటివరకు 10.70 కోట్ల ఓట్లు తొలగించారని తెలిపారు. ఎన్నికల సంఘం అడుగుతున్న పత్రాలు ప్రజల వద్ద లేకపోవడం కారణంగా ఓట్ల తొలగింపు అన్యాయమన్నారు. బీజేపీ ప్రభుత్వం తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోందన్నారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సాంకేతిక కారణాలతో పేదలను ఎన్నికల ప్రక్రియ నుంచి దూరం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. వలసలు వెళ్తున్న వారి పాలిట శాపంగా సర్ మారిందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రజల ఓట్లు తీసివేయడమేనా సర్ పని అని అన్నారు. సుప్రీంకోర్టు గుర్తించిన ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. దేశ బడ్జెట్‌లో ప్రజా సంక్షేమానికి తగిన కేటాయింపులు లేవని, అప్పులపై భారీ వడ్డీలు చెల్లిస్తుండగా సంక్షేమంపై నిర్లక్ష్యం ఎందుకని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ఆరోపించారు. ఆయుధాలు కొనుగోలు మీద ఉన్న ప్రేమ ప్రజల సంక్షేమంపై లేదని తెలిపారు. భారత దేశంపై ట్రంప్ పెత్తనం తగదని, ప్రధాని దీనిపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య మాట్లాడుతూ.. 2016 ఆర్‌పీడబ్ల్యూడీ చట్టం సహా అనేక హక్కులను పోరాటాల ద్వారానే సాధించామని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 20 ఏండ్ల వయస్సు గల వికలాంగులు 1.89 కోట్ల మంది ఉన్నారని, సర్ అమలుతో 42.5 లక్షల వికలాంగ ఓటర్లు ప్రభావితమయ్యారని చెప్పారు. 2024 పార్లమెంట్ ఎన్నికల వరకు వికలాంగుల్లో సగానికి పైగా ఓటర్లుగా నమోదు కాలేదని తెలిపారు. సర్ అమలులో కీలక పాత్ర పోషించే బీఎల్‌ఓలకు వినికిడి లోపం, మేధో వైకల్యం, ఆటీజం, సీరిబ్రల్ పాల్సీ వంటి వైకల్యాలున్న ఓటర్లతో ఎలా వ్యవహరించాలో తగిన శిక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మానసిక లేదా మేధో వైకల్యం ఉన్న వారిని ఓటరు జాబితా నుంచి తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పెన్షన్‌ను రూ.6,000కు పెంచాలని, రాష్ట్ర బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎన్‌పీఆర్‌డీ కేంద్ర కమిటీ సభ్యులు ఆర్. వెంకటేష్, జె. రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు యశోద, ఉపేందర్, బి. స్వామి, రాష్ట్ర కమిటీ సభ్యులు పి. శశికళ, పి. చందు, సత్యనారాయణ, ఎం. నర్సింహా, కవిత, సూరపంగ ప్రకాష్, చంద్రమోహన్, యాదయ్య, మల్లేష్, భుజంగరెడ్డి, నగేష్, బంగారయ్య, మేరీ, రాజు, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మనుధర్మాన్ని తిరస్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



