45 నెలల కనిష్టానికి పతనం
మార్చిలో 53.9కి పీఎంఐ
న్యూఢిల్లీ : అమెరికా యుద్ధోన్మాదం, అధిక టారిఫ్‌లు భారత తయారీ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోన్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణతో మార్చి నెలలో తయారీ రంగ పీఎంఐ 53.9కి పడిపోయిందని హెచ్ఎస్బీసీ ఇండియా మ్యాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) వెల్లడించింది. ఇంతక్రితం నెల ఫిబ్రవరిలో 56.9 పాయింట్లుగా ఉండగా.. మార్చి నాటికి అది ఒక్కసారిగా 53.9 పాయింట్లకు తగ్గి నాలుగేండ్ల కనిష్టానికి దిగజారింది. జూన్ 2022 తర్వాత నమోదైన అత్యల్ప ఉత్పత్తి ఇదే కావడం గమనార్హం. సాధారణంగా 50 పైన ఫఈఎంఐ ఉంటే మెరుగ్గా.. దిగువన ఉంటే ప్రతికూలంగా ఉన్నట్లుగా గుర్తిస్తారు. గత రెండేండ్లలో ఎప్పడూ లేనంతగా కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి సామర్థ్యం మందగించాయి. ముడిసరుకుల ధరలు మూడున్నరేండ్ల గరిష్టానికి చేరడం తయారీదారుల నడ్డి విరుస్తోంది. ఖర్చులు పెరిగినా పోటీ తట్టుకోవడానికి విక్రయ ధరలను పెంచలేకపోవడం వల్ల కంపెనీల లాభాలు ఆవిరవుతున్నాయి. డిమాండ్ తగ్గడం, ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి భారత పారిశ్రామిక వేగాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయని హెచ్ఎస్బీసీ విశ్లేషించింది.
”తీవ్రమైన మార్కెట్ పోటీ, ముడిసరుకుల ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి వల్ల కొత్త ఆర్డర్ల ప్రవాహం నెమ్మదించింది. ముఖ్యంగా అల్యూమినియం, రసాయనాలు, ఇంధనం, జనపనార, తోలు, వస్త్రాలు, ఉక్కు వంటి వస్తువుల ధరలు గత మూడేండ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. దీనివల్ల తయారీదారులపై పెట్టుబడి భారం పెరిగినప్పటికీ, వినియోగదారులకు చేరే తుది వస్తువుల ధరలను కంపెనీలు ప్రస్తుతానికి నియంత్రణలోనే ఉంచుతున్నాయి.” అని హెచ్ఎస్బీసీ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ ప్రాంజల్ భండారీ పేర్కొన్నారు. కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి సామర్థ్యం 2022 మధ్య కాలం తర్వాత ఎన్నడూ లేనంత నిదానంగా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినడం, మార్కెట్ పరిస్థితులు సవాలుగా మారడంతో డిమాండ్ భారీగా మందగించింది. ముడి ఖర్చులు ఆకాశాన్నంటుతున్నప్పటికీ, ఉన్న కస్టమర్లను కాపాడుకోవడానికి, కొత్త వారిని ఆకర్షించడానికి కంపెనీలు తమ విక్రయ ధరలను పెంచలేకపోతున్నాయి. దీనివల్ల తయారీదారుల లాభాల మార్జిన్లు కుంచించుకుపోతున్నాయి. అంతిమంగా పెరుగుతున్న వ్యయాలు, తగ్గుతున్న డిమాండ్‌తో భారత పరిశ్రమలు కుదేలవుతున్నాయి.



