Thursday, January 8, 2026
E-PAPER
Homeజాతీయంఊపు కోల్పోయిన తయారీ రంగం

ఊపు కోల్పోయిన తయారీ రంగం

- Advertisement -

– డిసెంబర్‌లో పతనం.. రెండేండ్ల కనిష్టానికి..
న్యూఢిల్లీ :
దేశీయ తయారీ రంగంలో ఆశించిన స్థాయిలో ఊపు కన్పించడం లేదు. ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ సంస్థ రూపొందించిన తాజా హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్‌ పీఎంఐ సూచీ ప్రకారం గత రెండు సంవత్సరాలుగా ఈ రంగంలో విస్తరణ నెమ్మదించింది. దేశీయంగా డిమాండ్‌ లేకపోవడం, ఫలితంగా అనేక సంస్థలు ఉత్పత్తిని కుదించుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. గత నవంబరులో 56.6గా ఉన్న సూచీ డిసెంబరులో 55.0కు పడిపోయింది. 2023 డిసెంబర్‌ తర్వాత సూచీలో ఇదే కనిష్ట స్థాయి అని రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలై-సెప్టెంబర్‌ త్రైమాసిక కాలంలో మన దేశం ఎనిమిది శాతం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేసుకుంది. అయితే తయారీ రంగంలో ఈ వేగం కన్పించడం లేదు. వృద్ధిలో వేగం లేనప్పటికీ గత సంవత్సరం తయారీ రంగం పరిస్థితి ఆశాజనకంగానే ఉన్నదని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పోలియానా డి లిమా తెలిపారు.గత రెండు సంవత్సరాల కాలంలో తయారీ రంగానికి కొత్త ఆర్డర్లు పెద్దగా రాలేదు. దేశీయ డిమాండ్‌ తగ్గిపోవడమే దీనికి కారణం. దీని ప్రభావం కార్మిక మార్కెట్‌పై పడింది. తయారీ రంగంలో ఉపాధి సూచీ కనిష్ట స్థాయికి పడిపోయింది. నియామకాలు దాదాపుగా నిలిచిపోయాయి. వినియోగదారుల సంఖ్య తగ్గిపోవడంతో ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి మందగించింది. విదేశాల నుంచి డిమాండ్‌ కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. పైగా కొన్ని భారతీయ ఉత్పత్తులపై అమెరికా అధిక సుంకాలు విధించడంతో ఎగుమతుల వృద్ధి కూడా 14 నెలల కనిష్ట స్థాయికి చేరింది. బలహీనమైన రూపాయి ఎగుమతులను పెంచలేకపోతోంది. ద్రవ్యోల్బణ ఒత్తిడులు స్థిరంగా ఉన్నాయి. ఇన్‌పుట్‌ ఖర్చుల్లో స్వల్పంగా పెరుగుదల కనిపించింది. తొమ్మిది నెలల కాలంలో అమ్మకపు ధరలు నెమ్మదిగా పెరిగాయి. నివేదిక ప్రకారం వ్యాపారంపై విశ్వాసం మూడున్నర సంవత్సరాల కాలంలో కనిష్ట స్థాయికి చేరుకుంది. అయితే ఈ సంవత్సరంలో మంచి వృద్ధి సాధించే అవకాశం ఉన్నదని కంపెనీలు ఆశాభావంతో ఉన్నాయి. మార్కెటింట్‌ను పెంచుకొని, కొత్త ఉత్పత్తులతో ముందుకు పోతామని తెలిపాయి. కాగా తయారీ రంగంలో మార్కెట్‌ అస్థిరత, పోటీ ఒత్తిడులు తప్పకపోవచ్చునని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ హెచ్చరిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -