114 డస్సాల్ట్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసిన రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణ శాఖ తెలిపిన వివరాలు అస్పష్టం
న్యూఢిల్లీ : రక్షణ మంత్రిత్వ శాఖ 114 డస్సాల్ట్ రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం తెలిపిందని ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి. క్షీణించిన మన రక్షణ దళాల సామర్ధ్యాన్ని ఇనుమడింపజేయడానికి వీటిని కొనుగోలు చేస్తున్నామని వైమానిక దళం, కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నాయి. కానీ వాస్తవాలు మరోలా ఉన్నాయి. 2007-08లో 126 మధ్యశ్రేణి బహుళ ప్రయోజక యుద్ధ విమానాల (ఎంఎంఆర్‌సీఏ) కోసం ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఆ తర్వాత దానిని షార్ట్‌లిస్ట్ చేసింది. అయితే కొనుగోలు జరగలేదు. 2016లో ప్రభుత్వ విధానాలలో వచ్చిన మార్పులు, అనిశ్చితి కారణంగా టెండర్ ప్రక్రియ పట్టాలు తప్పింది. ఇప్పుడు అదే బీజేపీ ప్రభుత్వం మరోసారి దానిని వేరే రూపంలో తెర పైకి తెచ్చింది.
ఎంఎంఆర్‌సీఏ అమలై ఉంటే…
భారత వైమానిక దళం సామర్ధ్యాన్ని పెంచేందుకు 2016 సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా 36 రఫేల్ యుద్ధ విమానాలను రూ.58,000 కోట్లకు (7.7 బిలియన్ డాలర్లు-8.8 బిలియన్ డాలర్లు) కొనుగోలు చేసింది. ఇప్పుడు మళ్లీ బహుళ ప్రయోజక యుద్ధ విమానాల (ఎంఆర్‌ఎఫ్‌ఏ) సేకరణ కింద రఫేల్ విమానాలను కొనుగోలు చేస్తున్నామని చెబుతోంది. అయితే అప్పటికీ ఇప్పటికీ మధ్య ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి. కొనుగోలు వ్యయం తడిసిమోపెడవుతోంది.
స్పష్టత ఏది?
రఫేల్ విమానాల కొనుగోలుపై రక్షణ శాఖ తెలిపిన వివరాలు అస్పష్టంగా ఉన్నాయి. ఎంఎంఆర్‌సీఏ కార్యక్రమం ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) లైసెన్స్ పొందిన ఉత్పత్తిపై ఎక్కువగా ఆధారపడింది. ఈ సంస్థనే ప్రధాన ఉత్పత్తి భాగస్వామిగా నియమించారు. బాధ్యత, నాణ్యతా నియంత్రణ వంటి అంశాలపై ఫ్రాన్స్‌తో చర్చలు జరిపినప్పుడు దీనిపై భిన్నాభిప్రా యాలు వ్యక్తమయ్యాయి. దీంతో మొత్తం కార్యక్రమమే రద్దయింది. తాజాగా ఎంఆర్ ఎఫ్‌ఏ ప్రతిపాదన కింద 114 ఫైటర్ జెట్ల కొనుగోలు ప్రాజెక్ట్ రక్షణ శాఖ వ్యూహాత్మక భాగస్వామ్య మోడల్ కింద కొనసాగుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టత లేదు.
2019 నాటి ఎంఆర్ ఎఫ్‌ఏ ప్రతిపాదనల కింద 18 విమానాలను విదేశాల నుంచి కొనుగోలు చేస్తారు. మిగిలిన 86 విమానాలు స్థానికంగా తయారవుతాయి. విమానాల తయారీలో మన భాగస్వామి ఎవరు? పని విభజన ఎలా జరుగుతుంది? సాంకేతిక బదిలీ ఏ స్థాయిలో జరుగుతుంది? హెచ్‌ఏఎల్‌కే తిరిగి బాధ్యతను అప్పగిస్తారా? అనే విషయాలపై స్పష్టత రావడం లేదు. వేరే భాగస్వామిని ఎంచుకుంటే అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. దేశంలో రక్షణ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన కొన్ని ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, లార్సెన్ అండ్ ట్రూబో, అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, మహింద్రా డిఫెన్స్ సిస్టమ్స్, రిలయన్స్ డిఫెన్స్ వంటివి వీటిలో కొన్ని. దేశీయ విమానాల తయారీలో వీటిని భాగస్వాములను చేస్తారా అనే విషయం తెలియడం లేదు.
ఎక్కువ ఖర్చుతో తక్కువ కొనుగోళ్లు
ఎంఎంఆర్‌సీఏ కింద 126 యుద్ధ విమానాల కొనుగోలుకు సుమారు 10-12 బిలియన్ డాలర్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. సాంకేతిక బదిలీ ద్వారా దేశీయంగా 108 విమానాలను తయారు చేసుకోవడం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉంది. ప్రతిపాదిత 114 యుద్ధ విమానాల కొనుగోలుకు ఇప్పుడు 30-35 బిలియన్ డాలర్లు వెచ్చించాల్సి వస్తుంది. ఆయుధ ప్యాకేజీలు, మౌలిక సదుపాయాలు, నిపుణులకు శిక్షణ వంటి వాటికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
రక్షణ నిపుణులు పదేపదే చేసిన హెచ్చరికల తర్వాత నిద్ర నుంచి బయటికి వచ్చిన రక్షణ మంత్రిత్వ శాఖ, భారత వైమానిక దళం మొదట అనుకున్న దాని కంటే ఎక్కువ ఖర్చుతో తక్కువ సంఖ్యలో విమానాలను కొనుగోలు చేస్తున్నాయి. 126 యుద్ధ విమానాల ఎంఎంఆర్‌సీఏ ప్యాకేజీకి ఎంత ఖర్చు అయి ఉండేదో దానికి దాదాపు సమానంగా 36 రఫేల్ విమానాల కొనుగోలుకు ప్రభుత్వం 8.8 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఎంఎంఆర్‌సీఏ ప్యాకేజీలో అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.



