మరో అగ్రనేత మల్లా రాజిరెడ్డితో పాటు 20 మంది మావోయిస్టులు కూడా..
తెలంగాణ పోలీసుల ముందు సరెండర్
నేడో, రేపో ప్రకటించనున్న డీజీపీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
సీపీఐ(మావోయిస్టు) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్‌జీతో పాటు మరో కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డిలు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. వీరితో పాటు మరో 20 మంది మావోయిస్టులు కూడా సరెండరయ్యారు. రాష్ట్రానికి చెందిన దాదాపు 17 మంది మావోయిస్టులు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారనీ, వారు కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ ఇటీవల చేసిన ప్రకటన ప్రభావమో, మరోవైపు ఎస్‌ఐబీకి చెందిన స్పెషల్ ఆపరేషన్ టీం రాష్ట్ర సరిహద్దుల్లో విశ్వసనీయమైన సమాచారం మేరకు జరిపిన ప్రత్యేక ఆపరేషన్ కారణంగా దేవ్‌జీ, రాజిరెడ్డి బృందం లొంగుబాటులో నడిచినట్టు తెలుస్తోంది.
నంబాల మరణం తర్వాత దేవ్‌జీకి పగ్గాలు
కేంద్ర ప్రభుత్వం గత కొన్ని నెలలుగా మావోయిస్టు విముక్త భారత్ నినాదంతో ఆపరేషన్ కగార్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ద్వారా తొమ్మిది మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో పాటు కీలకమైన దండకారణ్యంలో వేలాది మంది సాయుధ బలగాలతో చేపట్టిన ఆపరేషన్ కారణంగా వందల మంది మావోయిస్టులు మరణించడం, దాదాపు అదే సంఖ్యలో లొంగిపోవడం, అరెస్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా కొన్ని నెలల క్రితం కర్రెగుట్టలో జరిగిన భారీ ఆపరేషన్‌లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు కీలకమైన నాయకశ్రేణిలోని మావోయిస్టులు మరణించారు. కేశవరావు మరణం తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల సమీపంలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన తిప్పిరి తిరుపతి మావోయిస్టు పార్టీ పగ్గాలను చేపట్టినట్టు ప్రకటించారు.
ఆపరేషన్ కగార్ తీవ్రత.. పాతబడ్డ ఆయుధాలు..
ఒకపక్క ఆపరేషన్ కగార్ తీవ్రత పెరగడం, మరోపక్క మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో ముందుకు సాగడం, ఇంకోపక్క దట్టమైన అటవీ ప్రాంతాలను సైతం జల్లెడ పడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్లు, మావోయిస్టులకు సంబంధించి అందిస్తున్న సమాచారంతో సాయుధ బలగాలు కూంబింగ్ ఆపరేషన్‌ను ఉధృతం చేయడంతో మావోయిస్టులకు క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. పోలీసుల వద్ద ఉన్న ఆధునిక ఆయుధాల ముందు తమ వద్ద ఉన్న పాతబడిన ఆయుధాలతో ఎదుర్కోని పరిస్థితులతో వందలాది మంది మావోయిస్టులు నేలకొరిగారు. అదే సమయంలో ఈ మార్చి 31 నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా మారుస్తామని కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్‌షా డెడ్‌లైన్‌ను పునరుద్ఘాటిస్తూ వస్తున్న విషయం విదితమే.
ఈ నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్‌రావు, తక్కెళ్లపల్లి వాసుదేవరావు ఎలియాస్ ఆశన్న వంటి నాయకులు తమతో వచ్చిన దాదాపు 700 మంది పార్టీ శ్రేణులతో మహారాష్ట్ర ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. అదే సమయంలో ఆపరేషన్ కగార్‌ను తాత్కాలికంగా పక్కనబెట్టి శాంతియుత మార్గాన్ని ఏర్పాటు చేస్తే మిగతాశ్రేణులతో కలిసి ఆయుధాలను వీడి లొగిపోతామని దేవ్‌జీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చింది. ఇటీవలన ఛత్తీస్‌గఢ్‌లోని రారుపూర్‌లో జరిగిన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల డీజీపీల సమావేశంలో కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షా.. పరిస్థితులను సమీక్షించి, మార్చి 31 గడువు తేదీని దాటే ప్రసక్తే లేదనీ, అందుకు అనుగుణంగా పోలీసులు కార్యాచరణను రూపొందించి మావోయిస్టుల ఏరివేతను తీవ్రతరం చేయాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు సైతం మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహించే విధంగా తమ సానుకూల ప్రయత్నాలను మరోవైపు ముమ్మరం చేశారు. ఈ మధ్యలోనే మావోయిస్టు అగ్రనేత హిడ్మా తెలంగాణ పోలీసులకు లొంగిపోయే ప్రయత్నాలు చేశారని ప్రచారం జరగడం.. చివరికి వైజాగ్ ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన మరణించగా, విజయవాడలో మరికొందరు మావోయిస్టులు పోలీసులకు పట్టుబడ్డారు. అందులో దేవ్‌జీకి చెందిన నలుగురు వ్యక్తిగత అంగరక్షకులు కూడా ఉన్నారు. వీరి ఆధారంగానే దేవ్‌జీ ఆచూకీ కోసం తెలంగాణ ఎస్‌ఐబీ అధికారులు తమ ప్రయత్నాలను తీవ్రతరం చేశారు.తీవ్రమైన సాయుధ బలగాల కూంబింగ్ ఆపరేషన్లు, పార్టీ శ్రేణుల సంఖ్య కండ్ల ముందే తగ్గిపోవడం వంటి కఠిన పరిస్థితుల నేపథ్యంలో దేవ్‌జీ లొంగుబాటు దిశగా అడుగు వేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఆసిఫాబాద్ అడవుల్లో దేవ్‌జీ, రాజిరెడ్డిలతో పాటు మరో 20 మంది మావోయిస్టులను లొంగుబాటులో నడిచేలా చేయడంలో ఎస్‌ఐబీ స్పెషల్ ఆపరేషన్ టీం సక్సెస్ అయినట్టు తెలుస్తోంది.
ఇతర అగ్రనేతల లొంగుబాటుకు డీజీపీ చర్యలు
పార్టీకి కీలకమైన కార్యదర్శి లొంగిపోవడంతో.. ఇక మిగిలిన పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి, మరో ఇద్దరు అగ్రనేతలు దామోదర్, సంగ్రామ్‌లను కూడా లొంగుబాటలో నడిపించడానికి రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి తనకున్న మార్గాలన్నింటిని అన్వేషిస్తున్నారని తెలిసింది. ఇందుకోసం ఎస్‌ఐబీకి చెందిన ఒక స్పెషల్ టీం కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. దేవ్‌జీ, మల్లారాజిరెడ్డి బృందం లొంగుబాటుపై ఒకట్రెండ్రోజుల్లో రాష్ట్ర డీజీపీ నుంచి అధికారిక ప్రకటన లేదా మీడియా సమావేశం ద్వారా వెల్లడి కావచ్చని తెలుస్తోంది. కాగా మావోయిస్టు అగ్రనేత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్‌జీ లొంగుబాటు వ్యవహారాన్ని కేంద్ర హౌం శాఖ సైతం సునిశితంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఇద్దరి నేపథ్యం
దాదాపు 40 ఏండ్ల కింద ఇంటర్‌వరకు చదివిన దేవ్‌జీ తర్వాత రాడికల్ స్టూడెంట్స్ యూనియన్‌లో చురుకుగా పాల్గొని, తర్వాత పార్టీలో ఒక్కో బాధ్యతను నిర్వహిస్తూ అగ్రశ్రేణి నాయకుడిగా ఎదిగారు. పీపుల్స్ ఘెరిల్లా లిబరేషన్ ఆర్మీ (పీజీఎల్‌ఏ) నిర్మాణంతో పాటు పార్టీని వివిధ రాష్ట్రాల్లో విస్తృతం చేయడంలో దేవ్‌జీది కూడా కీలక పాత్రగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఈయనపై 30కి పైగా కేసులు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండలానికి చెందిన మల్లా రాజిరెడ్డి సైతం దాదాపు 40 ఏండ్ల క్రితం పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షణతోని విప్లవోద్యమంలోకి అడుగు పెట్టారు. పార్టీ రాష్ట్ర, జాతీయ స్థాయిలలో కీలక స్థానాలకు ఎదిగిన రాజిరెడ్డిపై కూడా 40 వరకు కేసులు ఉన్నట్టు సమాచారం.



