– తెలంగాణ పోలీసుల ద్వారా సాగిన వ్యవహారం
– కేంద్ర హౌం మంత్రిని కలిసి వివరించిన రాష్ట్ర డీజీపీ, ఎస్‌ఐబీ ఐజీ
– అధికారికంగా నిర్ధారించని అధికారులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
మావోయిస్టు పార్టీ అగ్రనేత, ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి గణపతి ఎలియాస్ ముప్పాల లక్ష్మణరావు రాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన గణపతి విదేశాలకు వెళ్లినట్టు సమాచారం. కాగా దేశంలో మావోయిస్టు ఉనికిని లేకుండా చేస్తామని ప్రకటించిన కేంద్రం ఆపరేషన్ కగార్‌ను చేట్టాక వందల మంది మావోయిస్టులు జరిగిన ఎన్‌కౌంటర్‌లలో చనిపోవడం, మరికొందరు అరెస్ట్ కావడం, వందల సంఖ్యలో లొంగుబాట్లు చోటు చేసుకోవడం జరిగింది. మరోవైపు మార్చి 31 నాటికి మావోయిస్టు విముక్త భారత్‌గా చేస్తామని కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్ షా.. డెడ్‌లైన్‌ను విధించుకున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు అగ్రనేత, ప్రధాన కార్యదర్శిగా చెప్పబడుతున్న తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్‌జీ, మరో కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్‌లతో కలిసి ఇటీవలనే రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయిన విషయం విదితమే.
ఈ నేపథ్యంలో గణపతి కోసం రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి, ఎస్‌ఐబీ ఐజీ సుమతిలు నిశితంగా దృష్టిని సారించారు. తమకున్న మార్గాల ద్వారా గణపతి ఆచూకీ కోసం గత మూడు నెలలుగా తీవ్రంగా ప్రయత్నాలను కొనసాగించారు. ఈ తరుణంలోనే గణపతి వైపు నుంచి కూడా లొంగిపోయే విషయమై రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో గణపతి సన్నిహితులు కొందరు మధ్యవర్తిత్వం నెరిపినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద వీరి ప్రయత్నాలు ఫలించి రాష్ట్ర పోలీసుల ఎదుటనే లొంగిపోవడానికి గణపతి నిర్ణయించుకోవడమో లేదా పోలీసు ఉన్నతాధికారులే ఆ దిశగా ఒత్తిడి తీసుకురావడమో జరిగి చివరికి గణపతి లొంగుబాటు ప్రయత్నాలు సఫలమైనట్టు తెలుస్తోంది. దాదాపు 80 ఏండ్లకు పైగా వయసున్న గణపతి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారనీ, ఆయనున్న రహస్య ప్రదేశంలో సైతం నడవలేని పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు జరిపిన రహస్య ప్రయత్నాలు ఫలించి అత్యంత భద్రత మధ్య గణపతిని ఆయనున్న రహస్య ప్రదేశం నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారని తెలుస్తోంది. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సమాచారం తెలిపిన రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి.. ఎస్‌ఐబీ ఐజీ సుమతిలతో కలిసి బుధవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అక్కడ కేంద్ర హౌం మంత్రి అమిత్‌షాను కలిసి గణపతి లొంగుబాటు గురించి వివరించారని తెలుస్తోంది. తమ పార్టీ అధిష్టాన వర్గాన్ని కలవడానికి ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమిత్‌షాతోనూ భేటీ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గణపతి లొంగుబాటుపై రాష్ట్ర డీజీపీ ప్రకటన చేస్తారా లేదా కేంద్ర హౌంశాఖ మంత్రి ప్రకటిస్తారా అనే సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి. కాగా గణపతి లొంగిపోయినట్టు సమాచారం చక్కర్లు కొడుతుండగా రాష్ట్ర సీనియర్ పోలీసు అధికారులు మాత్రం ఈ వార్తను ధ్రువీకరించడం లేదు.
గణపతి నేపథ్యం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీర్‌పూర్‌కు చెందిన ముప్పాళ లక్ష్మణరావు ఉపాధ్యాయ వృత్తిలో ఉండగానే అప్పటి సీపీఐ (పీపుల్స్‌వార్) పార్టీ కార్యకలాపాల పట్ల ఆకర్షితులయ్యారు. తర్వాత పీపుల్స్‌వార్‌లోని కొండపల్లి సీతారామయ్యతో పాటు ఇతర నాయకులతో పరిచయాలు ఏర్పడి ఈ ఉద్యమంతోనే పీడిత తాడిత ప్రజలకు నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని సాధించగలమని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో కొండపల్లి సీతారామయ్యను పీపుల్స్‌వార్ పార్టీ బహిష్కరించాక దాదాపు 30 ఏండ్ల క్రితం పీపుల్స్‌వార్ పార్టీకి గణపతి సారథ్యం వహించారు. 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. ప్రభుత్వంతో చర్చలకు ముందుకొచ్చారు. అప్పటి సీనియర్ నేత రామకృష్ణ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి వర్గం సర్కారుతో చర్చలు జరుపుతున్న సందర్భంలోనే బీహార్‌లోని ఎంసీసీఐ, యూనిటీ సెంటర్లు పీపుల్స్‌వార్‌లో విలీనమై మావోయిస్టు పార్టీగా అవతరించింది. ఆ పార్టీకి తొలి ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన గణపతి 2018లో నంబాల కేశవరావు ఎలియాస్ బసవరాజ్‌కు బాధ్యతలను అప్పగించి రిటైరయ్యారు. అక్కడి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి నేపాల్‌లోని రహస్య ప్రదేశంలో తలదాచుకున్నట్టు సమాచారం.
మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి లొంగుబాటు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



