Thursday, January 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమావోయిస్టులూ.. లొంగిపోండి

మావోయిస్టులూ.. లొంగిపోండి

- Advertisement -

– గణపతితో సహా 17 మందికి రాష్ట్ర డీజీపీ పిలుపు
– సరెండరైనవారికి ఆధార్‌తో పాటు అన్ని ప్రభుత్వ గుర్తింపు కార్డులు : శివధర్‌రెడ్డి వెల్లడి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేతలు ముప్పాల లక్ష్మణ్‌రావు ఎలియాస్‌ గణపతి, దేవోజీ ఎలియాస్‌ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డితో సహా మొత్తం 17 మంది మావోయిస్టులు వెంటనే లొంగిపోవాలని రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి బుధవారం పిలుపునిచ్చారు. తెలంగాణకు చెందిన వీరంతా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారనీ, వీలైనంత త్వరగా జనజీవన స్రవంతిలో కలిసి కొత్త జీవితాలను ఆరంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వీరు సురక్షితంగా లొంగిపోవడానికి అవసరమైన ఏర్పాట్లను చేస్తామనీ, వారు ఎవరి ద్వారా లొంగిపోయినా తమకు అభ్యంతరం లేదని చెప్పారు. వారి కొత్త జీవితం ప్రారంభించడానికి అవసరమైన సౌకర్యాలను, ప్రభుత్వ అండదండలను కల్పిస్తామని డీజీపీ వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 576 మంది మావోయిస్టులు లొంగిపోయారనీ, వారందరికీ ప్రభుత్వం ప్రకటించిన నగదు రివార్డులు అందజేశామని చెప్పారు. అంతేగాక వారికి అవసరమైన ఆధార్‌, పాన్‌కార్డుతో పాటు ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులను సమకూరుస్తున్నామని తెలిపారు. వీరి గ్రామాలలో నివసించడానికి అవసరమైన స్థలాన్ని కేటాయించవల్సిందిగా స్థానిక రెవెన్యూ అధికారులను కోరడమేగాక ఎస్‌ఐబీ అధికారులు అందుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నారని శివధర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న 17 మంది మావోయిస్టులపై రూ.25 లక్షల నుంచి రూ. లక్ష వరకు నగదు రివార్డు ఉన్నదని ఆయన చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -