– 9న నల్లబ్యాడ్జీలతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
– రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రాల సమర్పణ
– ఐక్య ఉద్యమంలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి రావాలి : ఎఐ జాక్టో రౌండ్ టేబుల్ సమావేశం పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (ఎఐ జాక్టో) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న ఢిల్లీలో నిర్వహిస్తున్న పార్లమెంటు మార్చ్‌ను విజయవంతం చేయాలని వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు పిలుపునిచ్చారు.
బుధవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎఐ జాక్టో స్టీరింగ్ కమిటీ సభ్యులు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు జి.సదానందం గౌడ్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్ ఉపాధ్యాయులను ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి మినహాయించాలనీ, ప్రభుత్వ విద్యకు నష్టం కలిగించే జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) రద్దు చేయాలనీ, పాఠశాలల మూసివేత, విలీనాలను ఆపాలని డిమాండ్ చేశారు. ఎన్పీఎస్, సీపీఎస్‌లను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనీ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రాథమిక ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని తదితర డిమాండ్లతో మార్చ్ టు పార్లమెంట్ ఉంటుందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి నాలుగు నెలలు గడిచినా కేంద్ర ప్రభుత్వం గానీ, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) గానీ ఏ మాత్రం స్పందించకుండా మౌనంగా ఉండడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. 23 ఆగస్టు 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యా యులకు టెట్ నుంచి మినహాయింపునిచ్చినట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఎన్సీటిఈ సుప్రీంకోర్టుకు ఆ విషయాన్ని తెలియ జేయడంలో విఫలమైందని నాయకులు ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రెండేండ్లలో టెట్ పాస్ కాకపోతే లక్షలాది ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందనీ, వేలాది పాఠశాలలు మూతపడి, పేద పిల్లలకు విద్య దూరమయ్యే ప్రమాదం దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో సంక్షోభానికి కారణమైన సుప్రీంకోర్టు తీర్పునకు కేంద్ర ప్రభుత్వం, ఎన్సీటీఈలే బాధ్యత వహించాలన్నారు. తక్షణమే కేంద్రం సుప్రీం కోర్టులో రివ్యూ లేదా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయాలనీ, లేదా సీనియర్ ఉపాధ్యాయులకు రక్షణ కల్పించే విధంగా విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలపాలని కోరారు. అన్ని జిల్లాల నుంచి రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి మెమోరాండంలు పోస్టు చేయాలనీ, ఫిబ్రవరి 5న ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ మార్చ్ నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో ఐక్యంగా పోరాడాలని అఖిల భారత ఉపాధ్యాయ సంఘాలు స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏస్టీఎఫ్‌ఐ), ఆల్ ఇండియా సెకండరీ టీచర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్టీఎఫ్), ఆల్ ఇండియా ప్రైమరీ టీచర్స్ ఫెడరేషన్ (ఏఐపీటీఎఫ్), ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్స్ ఆర్గనైజేషన్స్ (ఎఐఎఫ్‌ఇటీఒ)లు నిర్ణయించినట్టు ఏఐ జాక్టో స్టీరింగ్ కమిటీ సభ్యులు, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి తెలిపారు.
ఆ మేరకు అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్- ఏఐజాక్టో) ఏర్పాటైందనీ, ఇతర జాతీయ ఉపాధ్యాయ ఫెడరేషన్లు, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్‌ఎడ్యుకేషనల్ అసోసియేషన్స్ (ఐఫియా), ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ (ఏఐఎస్‌ఈసి), ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ (ఎఐఎఫ్‌ఆర్టిఈ), జాయింట్ ఫోరం ఫర్ మూవ్‌మెంట్ ఆన్ ఎడ్యుకేషన్ (జెఎఫ్‌ఎంఈ), ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏఐఎస్జీఈఎఫ్) ఈ పోరాటానికి మద్దతు ఇస్తున్నాయని ఆయన వెల్లడించారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో టీఎస్‌యూటీ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, పీటీఏటీజీ అధ్యక్షలు మల్లికార్జున్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శారద, ఏఐఎఫ్‌ఇటీఒ జాతీయ కార్యదర్శి పోల్ రెడ్డి, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షలు కటకం రమేశ్, టీపీటీ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.తిరుపతి, టీఎస్టీయూ అధ్యక్షలు మొహమ్మద్ అబ్దుల్లా, డీటీఎఫ్ నాయకులు రామకృష్ణ, సుటా అధ్యక్షులు ఎం.ఎ.నయీమ్, ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఖాన్, ఎంటీయూ అధ్యక్షులు మోయిన్, ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.అలీమ్, టీడబ్ల్యూటీ యూ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్, టీజీటీఏ ప్రధాన కార్యదర్శి గీతాంజలి, ఎంఎస్టీయూ అధ్యక్షులు విఠల్, సయ్యద్ అజ్గర్, మీర్ ముంతాజ్ అలీ, పర్వతి సత్యనారాయణ, ఎస్.వె.ౖకొండలరావు, కరుణాకర్ రెడ్డి, ఇఫ్తేకారుద్దీన్, రామసుబ్బారావు, నరసింహారెడ్డి, మస్తాన్ రావు, ఎం.దేవదాసు, జి.వెంకటేశ్వర్లు, సిహెచ్.ప్రభాకర్, సందీప్, వరలక్ష్మ తదితర నాయకులు పాల్గొన్నారు.
టెట్ మినహాయింపు కోరుతూ.. ఫిబ్రవరి 5న ఢిల్లీలో మార్చ్ టు పార్లమెంట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



