అక్కడ గోడల మీద పటాలున్నాయి. అవి దేవళ్లవీ, దేశ నాయకులవీ కాదు. గొలుసు దొంగలవి, జేబు దొంగలవి, పర్సు దొంగలవి రకరకాల దొంగలవి. అక్కడ గదుల్లో ఖాకీలు, లాకప్ గదుల్లో కేడీలు, గోడలకు వేలాడే బేడీలు వున్నాయి. పోలీసుల్ని పోలీసులు అనుకుంటే అది పోలీస్‌స్టేషన్. పోలీసుల్ని రక్షకులనుకుంటే అది రక్షక భట నిలయం. లాకప్ గదుల్లో వున్న రౌడీలు చెమటలు తుడుచుకుంటున్నారు గాలి ఆడక. గదుల్లో వున్న పోలీసులు టీలు తాగుతున్నారు ఏమీ తోచక.
అప్పుడొచ్చాడొకడు. హడావిడిగా పరుగెత్తుతూ రాలేదు. నింపాదిగా నడిచివచ్చాడు. వాడి ముఖంలో కనిపిస్తున్నదిఒక చెవి. మరొక చెవి వుండాల్సిన చోట గుడ్డకట్టుకుని వున్నాడు. అక్కడ మరో చెవి వుందో లేదో కనపడ్డం లేదు. వచ్చినవాడు ఇన్‌స్పెక్టర్ గదిలోకెళ్లాడు. ఓ చేతిలో కత్తీ, మరో చేతిలో తెగిన తల లేని వాడివైపు నిరుత్సాహంగా చూశాడు ఇన్‌స్పెక్టర్.
‘సార్! ఇదిగోండి’ అంటూ ఓ ప్లాస్టిక్‌కవర్ టేబిల్‌మీద పెట్టాడు వచ్చినవాడు. ప్లాస్టిక్ కవర్‌పైకి ఎత్తిపట్టుకు చూశాడు ఇన్‌స్పెక్టర్. దాంట్లో వున్నది ఒక చెవి. అరుపులూ, కేకలూ, మాటలూ, పాటలూ వినే చెవి నిశ్శబ్దంగా వుంది ఏమీ వినకుండా. ముఖంలో వుండాల్సిన చెవి, ప్లాస్టిక్ కవర్‌లో వుంది. అంటే వచ్చినవాడు కట్టుకున్న గుడ్డ కింద చెవి లేదన్నమాటే. ఏం జరిగింది? ఎవరిదీ చెవి? ఒక్క చెవితో వినగలవా? వినపడుతోందా? అనడిగాడు ఇన్‌స్పెక్టర్.
‘అది… అది… నా భార్య నోటకరిచి, కొరికి నేలమీద ఉప్పని ఊదేసిన చెవి’ అన్నాడా మనిషి.
‘అరెరే… అలాగా! ఎందుకని, ఏం జరిగింది?’ అన్నారు పోలీసులు.
‘గొడవ… తగాదా… కాదది.. యుద్ధం. మాటామాటా పెరిగింది. చేయి ఎత్తా. పళ్లు కొరికింది. చెంగు బిగించి చెంగున దూకింది. ఈ సారి పళ్లు కాదు చెవి కొరికింది. అదే ఈ ప్లాస్టిక్ కవర్‌లో వుంది’ అన్నాడు ఒంటి చెవి మనిషి. పోలీసులు పరుగెత్తారు మగడి చెవి కొరికిన భార్యను చూద్దామని కాదు, పట్టుకొద్దామని.
అది ఒక గది. మంచమూ పరుపూ వున్నాయి గనుక పడకగది. గది నిండా వస్తువులు చెల్లాచెదురుగా పడివున్నాయి. కొన్ని విరిగున్నాయి. కొన్ని పగిలున్నాయి. కొన్ని చిరిగున్నాయి. కప్‌బోర్డు నోరు తెరిచి నిలబడుంది. కిటికీ మూసుంది. పై కప్పు మీద తలకిందులుగా వేలాడుతూ ఫ్యాను తొంగి చూస్తున్నది. మంచం మీద ఓ ఆడకూతురు నించుని వుంది. కోపంతో ఆమె ముఖం ఎరుపెక్కి వుంది. గాలి వేగంతో పాటు ఆమె ముక్కు పైకీ కిందకీ కదులుతూ వుంది. ఆమె నోరు తెరిచింది. ‘అన్నా! పోలీసన్నా, నేచచ్చిపోతున్నా. ఈ నా మొగుడితో వేగలేకపోతున్నా. ఇది వరకు రెండుసార్లు స్టేషన్‌కు వస్తే సర్దిచెప్పిపంపారు. కానీ వీడు మారడన్నా. ఏదో ఒకదానికి రోజూ గొడవ. తగాదా. యుద్ధం. అందుకే నే చావాలి. వాడు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినాలి అంతే… ఇది ఫైనల్ అంది ఆడ కూతురు చీరని ఫ్యాను పైకి విసుర్తూ.
‘వద్దు! వద్దు! అంతపని చెయ్యవద్దు. నేను వస్తున్నానే. వచ్చేదాక ఆగు. అంతా సర్దుకుంటుంది. నే సర్దేస్తా’ అంటూ కుర్చీలోంచి లేచాడు ఇన్‌స్పెక్టర్ ఫోన్‌లో ఆడకూతురు ఆత్మహత్యా ప్రయత్నాన్ని చూసి ఆదుర్దాగా.
అది ఒక హాస్పిటల్. మెళ్లో స్టెతస్కోప్‌లుపాముల్లా వేలాడుతున్న ఆడశివులూ, మగ శంకరుళ్లూ తిరుగుతున్నారు. ఎగరడానికి రెక్కలు లేని తెల్లపావురాల్లా పరుగులు తీస్తున్నారు సిస్టర్లని పిలిపించుకునే నర్సులు. మూలిగే వాళ్లు మూలుగుతున్నారు. ఏడిచేవాళ్లు ఏడుస్తున్నారు. ఏ ఫీలింగూ లేనివారు కుర్చీల్లో కునుకుతున్నారు. హాస్పిటల్ ఆవరణలో వున్న వైకుంఠరథం పక్కనే వచ్చి ఆగింది పోలీసు జీబు. నాలుగైదు బూట్ల జతలు చప్పుడు చేస్తూ వరండాదాటి, మెట్లెక్కి మంటలకు ఒళ్లు కాలి, బొబ్బలెక్కి ఆహాకారాలు చేస్తూ వుండే వారుండే ‘బర్న్స్ వార్డ్’కు వెళ్లి, దోమతెర వేసున్న ఓ మంచం పక్కన ఆగాయి. మంచం పక్కనే మాస్క్ వేసుక్కూచున్న పోలీసాఫీసర్ ప్రశ్నించాడు తెర లోపల ముఖం కనిపించకుండా బ్యాండేజి వున్న మనిషిని.
‘ఏం జరిగింది? అసలు ఎలా జరిగింది? ఎందుకు జరిగింది?’ లోపలినుంచి వినిపించీ వినిపించకుండా వినిపించాయి జవాబులు. ‘గొడవ.. తగాదా.. కాదది యుద్ధం. వంటింట్లో యుద్ధం ఇంత ప్రమాదకరం అని తెలీక వాగేశా. కోపం పట్టలేక తిట్టేశా. బాండీలో జంతికలు వేగుతున్నాయనే భయం లేకుండా కట్టుకున్న దాన్ని కడిగేశా. ఊహించలేదు. ఊహకు అందనేలేదు. ఎప్పుడు సలసలకాగే నూనె మూకుడు పైకి ఎత్తిందో! ఎప్పుడు నా ముఖం జంతికలా పొంగిపోయిందో!’ సలసలకాగే నూనె వల్ల ముఖం కాలిన మొగుడ్ని ఎంక్వయిరీ చేసి, స్టేట్‌మెంట్ రాసుకున్న బూట్లు పోలీసు జీపెక్కినయి. దాని పక్కనే వుండిన వైకుంఠరథం ఎవరికోసమో వెయిట్ చేస్తున్నట్టు అక్కడే వుంది.
అది ఒక మేడ. మేడంటే ఏడంతస్తుల మేడేం కాదు. రెండే అంతస్తులు. కింద ఇంటి ఓనర్లు. పైన అద్దె కట్టేవాళ్లు. ఇల్లంటే ఓ భార్య ఓ భర్తా ఒకరో ఇద్దరో పిల్లలు అంతే కదా. ఓనర్లయితేనేం, అద్దెకు వుండేవారయితేనేం. రోడ్డు మీద వచ్చే వాహనాలు వస్తున్నాయి. పోయేవాహనాలు పోతున్నాయి. దుకాణాలు తెరుచున్నాయి. తెరుచున్న షాపుల్లో సరుకులు కొంటున్న మనుషులున్నారు. పగలు పన్నెండయిందని గడియారం గంటలు కొట్టింది. పదకొండుకాదు, పన్నెండే. సరిగ్గా గడియారం ముల్లు రెండింటినీ జోడించి నమస్కారం చేస్తున్నప్పుడు మేడమీది నుంచి కిందకి దూకేసింది ఓ ఆడకూతురు. దబ్బుమన్న చప్పుడు వినిపించి ఆపైన పెద్దకేక వినిపించి విస్తుపోయిన జనం హాహాకారాలు చేస్తూ పరుగెత్తారు. వాహనాలు ఆగిపోయినయి. అరేరే! అన్నారు కొందరు. బతికే వుందా? అన్నారు కొందరు గుంపు వెనుక వున్నవారు. అంబులెన్స్‌ను పిలవండి అన్నారెవరో. పిలవకుండానే వచ్చింది పోలీస్‌జీప్. మొగుడూ పెళ్లాం ప్రతిరోజూ గొడవ. తగాదా.. కాదది యుద్ధం.. ఎంతో నచ్చజెప్పాం. ఇల్లు ఖాళీ చేయిస్తామని బెదిరించాం. అయినా రోజూ తిట్లూ వినకతప్పలేదు అన్నాడు ఇంటి ఓనర్. ఇంట్లోలేని మొగుడికోసం పరుగెత్తారు పోలీసులు.
మేరేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అన్నాడు ఓ ప్రసిద్ధ ఆంగ్ల నాటకకర్త. కానీ ఇప్పటి వాతావరణం చూస్తుంటే ‘మేరేజెస్ ఆర్ మేడిన్ హెల్’ అనాలేమో. వడ్లగింజలో బియ్యపుగింజ అని గిల్లికజ్జాలు అని అనుకునే కాలం కాదిది. క్షణికావేశంలో భార్యాభర్తల బంధం సడలిపోతున్నది. వై మ్యారేజ్? అనే ప్రశ్న కూడా వినిపిస్తున్నది.
చింతపట్ల సుదర్శన్
9299809212