నవతెలంగాణ – అశ్వారావుపేట: చెట్టుకు ఉరివేసుకొని ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం ఆశ్వారావుపేట లో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై యయాతి రాజు కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్,ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెం కు చెందిన అన్నమనేని శ్రీను (52) గత కొంతకాలంగా ఆశ్వారావుపేట లోని ఓ కూరగాయల దుకాణంలో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. కాగా గడిచిన కొన్నేళ్లుగా మద్యానికి బానిసై కుటుంబీకులను పట్టించుకోవడం లేదు.
ఈ క్రమంలోనే భార్య వాణి తో కుటుంబ కలహాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే శనివారం అతిగా మద్యం సేవించి మనస్తాపానికి గురై కూరగాయల దుకాణం యజమానికి చెందిన పేటమాలపల్లి శివారు లోగల మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా,ఘటన స్థలాన్ని పరిశీలించి మృతుని కుమారుడు రాజు చేసిన లిఖిత పూర్వక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.



