బండారు రవికుమార్..సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
నవతెలంగాణ – గోవిందరావుపేట: విప్లవం సాధించడమే మార్క్స్ కు అర్పించే నివాళి.. మార్క్సిజమే మహోన్నత మానవతా సిద్ధాంతం అని సీపీఐ(ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ అన్నారు. సోమవారం మండలంలోని పసర గ్రామంలో సీపీఐ(ఎం కార్యాలయంలో విశ్వ విఖ్యాత ఆర్థికవేత్త, సామాజిక శాస్త్రవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, మహోపాధ్యాయుడు, గడచిన సహస్రాబ్దిలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వారిలో ప్రథముడుగా గుర్తించబడ్డ విశ్వ మానవుడు కారల్ మార్క్స్ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్ర పటం పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఐ(ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవి కుమార్ హాజరై మాట్లాడుతూ..ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి మార్క్సిజం పరిష్కారం చూపుతుందని అన్నారు. మార్క్స్ చెప్పినట్టుగా ”పెట్టుబడి అతి కొద్దిమంది చేతుల్లో పోగుబడి, సంపద కేంద్రీకరించబడడానికి దారితీస్తుంది. మరోవైపు కోట్ల మంది ప్రజా బాహుళ్యం చేతిలో కొనుగోలు శక్తి క్షీణిస్తుంది. ఉత్పత్తి సామాజికంగా జరిగినా ఉత్పత్తి, సహజ వనరులపై కొద్దిమంది వ్యక్తులకే ఆధిపత్యం ఉండటం అనే పెట్టుబడిదారీ వ్యవస్థ పునాదిలోనే సంక్షోభం ఉంటుంది.” ఉపాధిరహిత, ఉపాధిని దెబ్బతీసే అభివృద్ధి నమూనా వల్ల కొత్త ఉపాధి అవకాశాలు క్షీణించడంతోపాటు, కోట్లాది ప్రజలు జీవనాధారం కోల్పోవడం, స్థిరత్వం, భద్రత లేని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతుల్లోనే పరిమితంగానైనా ఉపాధి వెతుక్కోవల్సి రావడం నేడు చూస్తున్నాం.
ప్రపంచ సంపదపై ఆక్స్‌ఫాం నివేదిక ప్రకారం ఒక్క శాతం వారి వద్దనే ప్రపంచంలోని సగం సంపద పోగుబడింది. నేటి ప్రపంచీకరణ, ఆర్థిక యుద్ధాల విధానాల ద్వారా ప్రస్తుత నూతన రూపం సంతరించుకున్న పెట్టుబడిదారీ వ్యవస్థ అత్యంత అధ్వాన్నమైన అసమానతలను సృష్టించింది. ప్రభుత్వరంగ సంస్థలుగా ఉన్న ప్రజల ఆస్తులను, జాతి సంపదగా ఉండాల్సిన సహజ వనరులను లూటీ చేయడం, గనులు, భూములు, అడవులు, నదులు, సముద్రాలు, ఇంధనం లాంటి అన్నింటినీ కొద్ది కుటుంబాల వారే లూటీ చేయడం, కార్పొరేట్, గుత్త సంస్థల అపరిమితమైన, అనుచితమైన లూటీకి అడ్డంకిగా ఉన్న లాభాలతో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలున్న ఇనుము-ఉక్కు, చమురు, సహజవాయువు, బొగ్గు, బ్యాంకులు, ఇన్సూరెన్స్, ఓడ రేవులు, రవాణా, విద్యుత్, కమ్యూనికేషన్స్ ఇంకా అనేక రంగాలను కారుచౌకగా లేదా ఉచితంగా కొట్టేయడం నయా ఉదారవాద ఆర్థిక విధానాలు అనే క్రూరమైన ముసుగులో యథేచ్ఛగా నడుస్తున్నది. భారతదేశంలో మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం గతంలోని ప్రభుత్వం కంటే దూకుడుగా కార్పొరేట్లకు, విదేశీ పెట్టుబడికి గులాంగిరి చేసే విధానాలను అమలు చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సూడీ కృష్ణా రెడ్డి, జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వెంకట రెడ్డి, రత్నం రాజేందర్, పొడిల్ల చిట్టి బాబు, రఘుపతి, వాసు, జిల్లా కమిటీ సభ్యులు మల్లారెడ్డి, ఆగి రెడ్డి, గఫుర్, సౌమ్య,చిన్న, దేవయ్య, కృష్ణబాబు, దామోదర్, రాజేష్, చిరంజీవి, చారీ తదితరులు పాల్గొన్నారు.
మార్క్సిజమే మహోన్నత మానవతా సిద్దాంతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES