Friday, October 24, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుమార్క్సిజంతోనే వ్యక్తిగత స్వేచ్ఛకు భరోసా

మార్క్సిజంతోనే వ్యక్తిగత స్వేచ్ఛకు భరోసా

- Advertisement -

ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మార్క్సిజంతోనే వ్యక్తిగత స్వేచ్ఛకు భరోసా లభిస్తుందని ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌ తెలిపారు. గురువారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్వీకే మాజీ కార్యదర్శి సి.సాంబిరెడ్డి అధ్యక్షతన ‘బియాండ్‌ లిబరలిజం’ అంశంపై ఆయన ప్రసంగించారు. మార్క్సిజంలో వ్యక్తిగత స్వేచ్ఛకు తావుండదనేది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. మార్క్సిజం అనేది సంపూర్ణ మానవ స్వేచ్ఛ కోసం పని చేసే విధానమనీ, అందులో ఉమ్మడి హక్కులు, సామాజిక అంశాలతో పాటు వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యముంటుందని తెలిపారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రజలు స్వచ్ఛందంగా ఉంటారనే ప్రచారం సరైనది కాదనీ, అందులో బలప్రయోగం ఉంటుందని అన్నారు.

కార్మికులు తమ ఇష్టానుసారంగా కార్మికులుగా, ఇతరులు కూడా తమ ఇష్టానుసారంగా మనగలుగుతారని చెప్పేదంతా అబద్ధమేనని వ్యాఖ్యానించారు. దోపిడీ చారిత్రాక వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. ఈ క్రమంలో పెట్టుబడి రాజ్యంపై పెత్తనం చేయడానికి కూడా వెనుకాడదని వివరించారు. అలాంటి పెట్టుబడికి నమ్మకం కలిగిం చేందుకు రాయితీలు ఇస్తున్నారనీ, మరి కార్మికులకు నమ్మకం కలిగించేదెవరు? అని ఆయన ప్రశ్నించారు. కృత్రిమ మేధస్సు (ఏఐ)తో వచ్చే మార్పులు పెట్టుబడి వ్యవస్థలను బతికించలేవని ఆయన స్పష్టం చేశారు. పెట్టుబడి వ్యవస్థలు బతకలేని సందర్భాల్లో నయా ఫాసిజానికి పునాది వేస్తాయని ప్రభాత్‌ పట్నాయక్‌ చెప్పారు. నయా ఉదారవాదమే నయా ఫాసిజానికి దారి తీస్తుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నయా ఫాసిజం ఎదగడానికి నయా ఉదారవాదం నుంచి లాభపడ్డ వారి సహకారమే కారణమన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కేంద్రీకృతంగా మారిన ఆర్థిక వ్యవస్థ ప్రతి దేశంలోని ఆర్థిక విధానాలను శాసించేలా అనివార్య పోటీని సృష్టిస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మార్పు పేరుతో పలు దేశాల్లో మారిన ప్రభుత్వాలు కూడా పూర్వపు నయా ఉదారవాద ఆర్థిక విధానాలనే అవలంబించాయని ఉదహరించారు. నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చాక దేశంలో అసమానతలు శరవేగంగా పెరుగుతున్నాయని గణాంకాలను వివరించారు. కొత్తరకం ఫాసిజం సమస్య భారతదేశానికే పరిమితం కాలేదనీ, ప్రపంచ సమస్యగా మారిందని చెప్పారు. ఈ నేపథ్యంలో నయా ఉదారవాదంతో పాటు నయా ఫాసిజంపై కూడా జమిలీ పోరాటం చేయాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -