ఎగ్జామినర్స్ చిట్టీలు అందించడం దుర్మార్గం
కార్పొరేట్ కళాశాలలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.రజినీకాంత్, టి.నాగరాజు డిమాండ్
ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ – సుల్తాన్‌బజార్
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన కార్పొరేట్ జూనియర్ కళాశాలలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి యాజమాన్యాలను తక్షణమే అరెస్టు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్.రజినీకాంత్, టి.నాగరాజు డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో నిర్వహించిన పరీక్షల్లో శ్రీచైతన్య, నారాయణ, ఎస్‌ఆర్, రెసోనెన్స్, ఎంఎస్ కళాశాలలతోపాటు పలు ప్రయివేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో మాస్ కాపీయింగ్ జరిగిందని తెలిపారు.
ఈ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకొని బ్లాక్‌లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రాక్టికల్స్ పేరుతో విద్యార్థుల నుంచి ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేసి, అదే విధంగా ఇంటర్ బోర్డు పరిశీలకులకు కూడా ముట్టజెప్పి కాపీయింగ్‌కు పాల్పడ్డాయని ఆరోపించారు. సీసీ కెమెరాలను ఆఫ్ చేసి, సాంకేతిక వ్యవస్థలను నిర్వీర్యం చేసి చిట్టీలు అందించి పరీక్షలు రాయించారని తెలిపారు. ఈ ఘటనలపై పోలీసు కేసులు నమోదు చేసి బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రాక్టికల్స్‌ను పకడ్బందీగా నిర్వహిస్తున్న ఇంటర్‌బోర్డు.. కార్పొరేట్ కళాశాలల్లో కాపీయింగ్ జరిగినా పట్టించుకోకుండా చీఫ్ అబ్జర్వర్లను తొలగించామని చెప్పడం సరిపోదన్నారు.
వరుసగా 3, 4 తేదీల్లో 40కిపైగా క్యాంపస్‌లలో మాల్ ప్రాక్టీస్ జరిగినా, పరీక్షలు పూర్తయ్యాక మాత్రమే చర్యలు తీసుకున్నామని ప్రకటించడం అన్యాయమన్నారు. పబ్లిక్ పరీక్షలకు ముందు తమ ర్యాంకుల కోసం పూర్తి మార్కులు సాధించేందుకు కార్పొరేట్ కళాశాలలు చేసిన అక్రమాలకు సంబంధించి ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఇంటర్మీడియట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జయప్రదను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.మమత, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె.అశోక్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి కార్తీక్, రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్, అవినాష్, జె.రమేష్, నాయకులు నాగేందర్, ప్రశాంత్, ప్రవీణ్, ఆంజనేయులు, సాయి, నీరజ్, యశ్వంత్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.



