– హైదరాబాద్‌లో ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి ఇందిరా పార్కు వరకు ప్రదర్శన
– కార్మికులు, రైతులు, కూలీలు పెద్ద ఎత్తున పాల్గొనాలి : ఎస్‌కేఎం పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలనీ, విద్యుత్ సవరణ, విత్తన, వీబీజీఆర్‌ఏఎమ్‌జీ చట్టాలను వెనక్కి తీసుకోవాలనీ, పాత పెన్షన్ పథకాని పునరుద్ధరించాలనీ, కార్మికులకు కనీస వేతనాలివ్వాలని గురువారం తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) పిలుపునిచ్చింది. సార్వత్రిక సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో సామూహిక ర్యాలీలు, హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో గల ఆర్టీసీ కళ్యాణ మండలం నుంచి ఇందిరా పార్కు వరకు భారీ ప్రదర్శన చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఎస్‌కేఎం కన్వీనర్లు టి.సాగర్, పశ్య పద్మ, వి ప్రభాకర్, మండల వెంకన్న, పెద్దారపు రమేష్, జక్కుల వెంకటయ్య, ఆర్.వెంకట్ రాములు, కాంతయ్య, నాగిరెడ్డి, విజరు, కొండల్ ప్రకటన విడుదల చేశారు. రైతులు, కార్మికులు, సామాన్య ప్రజలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడులను ప్రతిఘటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విద్యుత్ సవరణ చట్టంతో విద్యుత్ చార్జీలు పెరుగుతాయనీ, వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌మీటర్లు బిగించడంతో సాగు భారమైపోతుందనీ, ప్రజలకు అందుతున్న సబ్సిడీలు ఎగిరిపోతాయని పేర్కొన్నారు. విత్తన చట్టాన్ని మార్చి ఎమ్‌ఎన్‌సీ విత్తనాల దిగుమతికి అనుమతులు ఇవ్వడంతో మన రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కార్మికులకు కనీస వేతనం, రైతులకు కనీస మద్దతు ధర, నిరుద్యోగ యువతకు ఉపాధి హక్కు అనే ప్రాథమిక హక్కును తిరస్కరించడం వంటివన్నీ ఆర్థిక వలస రాజ్యాల బ్లూప్రింట్ అని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని, స్వావలంబనను అమెరికాకు తాకట్టు పెట్టడం దుర్మార్గమని తెలిపారు. పంటలకు బోనస్ నిలిపేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి తేవడం దారుణమని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను ఖండిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మలను, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కాపీలను దహనం చేయాలని పిలుపునిచ్చారు. ర్యాలీలు, ప్రదర్శనలను జయప్రదం చేయాలని ప్రజలను కోరారు.
నేడు జిల్లా కేంద్రాల్లో సామూహిక ర్యాలీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



