Monday, August 4, 2025
E-PAPER
Homeజాతీయంఅమెరికాతో భారీగా ముడిచమురు ఒప్పందాలు

అమెరికాతో భారీగా ముడిచమురు ఒప్పందాలు

- Advertisement -

– భారత్‌కు 51శాతం పెరిగిన దిగుమతులు
– ట్రంప్‌ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాకే..
– వెల్లడించిన ప్రభుత్వ గణాంకాలు
న్యూఢిల్లీ:
2025లో అమెరికా నుంచి భారత్‌కు ముడిచమురు దిగుమతులు గణనీయంగా పెరిగాయి. ట్రంప్‌ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక అగ్రరాజ్యంతో ముడిచమురు ఒప్పందాలు భారీగా పెరిగినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024తో పోలిస్తే ఈ ఏడాదిలో ముడిచమురు దిగుమతులు 51శాతం పెరిగినట్టు పేర్కొన్నాయి. ఈ పెరుగుదల భారతదేశ చమురు సరఫరా వ్యూహంలో స్పష్టమైన మార్పును సూచిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘గత ఏడాదితో పోలిస్తే దిగుమతులు సగానికి పైగా పెరిగాయి. 2024తో పోలిస్తే ఈ ఏడాది జనవరి-జూన్‌లో అమెరికా నుంచి ముడిచమురు దిగుమతి 51 శాతం పెరిగింది. అంటే 2024లో రోజుకు 0.18 మిలియన్‌ బ్యారెల్స్‌ కాగా, 2025లో 0.271 మిలియన్‌ బ్యారెల్స్‌కు పెరిగింది. ఇటీవల నెలల్లో ఈ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. 2025 ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 114 శాతం అధికంగా దిగుమతులు నమోదయ్యాయి. అమెరికా నుంచి ముడి చమురు దిగుమతుల విలువ 1.73 బిలియన్‌ డాలర్ల నుంచి 3.7 బిలియన్‌ డాలర్లకు చేరింది. అంటే రెట్టింపు పెరుగుదల కనిపిస్తోంది’ అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
జులైలో అధిక పెరుగుదల
జూన్‌లో పోలిస్తే జులైలో 23శాతం అధికంగా దిగుమతి చేసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జూన్‌లో భారత ముడి చమురు దిగుమతుల్లో అమెరికా వాటా కేవలం 3 శాతం మాత్రమే ఉండగా, జులైలో అది 8 శాతానికి పెరిగిందని వెల్లడించాయి. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో భారతీయ సంస్థలు ముడి చమురు దిగుమతులను 150 శాతం మేర పెంచనున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ఇక 2024-2025 ఆర్థిక సంవత్సరంలో లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌ (ఎల్పీజీ), ధ్రువీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్జీ) దిగుమతులు కూడా పెరిగాయి. ఎల్‌ఎన్జీ దిగుమతులు 2024-25లో 1.41 బిలియన్‌ డాలర్ల నుంచి 2.46 బిలియన్‌ డాలర్లు అంటే దాదాపు 100 శాతం పెరిగాయి. ఈ వాణిజ్య పెరుగుదల భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తోంది. కాగా ఇటీవల ప్రపంచ స్థాయిలో అనిశ్చితి ఉన్నప్పటికీ, భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని భారత విదేశాంగ శాఖ విశ్వాసం వ్యక్తం చేసింది. వాస్తవానికి మోడీ ఎంత స్నేహబంధం కోరుకుంటున్నా ట్రంప్‌ మాత్రం నో అంటున్నారు. అమెరికా ఫస్ట్‌ అంటూ స్పష్టం చేస్తుండటం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -