Sunday, November 16, 2025
E-PAPER
Homeజాతీయంశ్రీనగర్‌లో భారీ పేలుడు

శ్రీనగర్‌లో భారీ పేలుడు

- Advertisement -

ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పదార్థాలు పేలడంతో ప్రమాదం
తొమ్మిది మంది మృతి
మృతుల్లో పోలీసులు, ఫోరెన్సిక్‌, రెవెన్యూ అధికారులు
ఘటనలో 32 మందికి గాయాలు
ఐదుగురి పరిస్థితి అత్యంత విషమం
నౌగామ్‌ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఘటన
ప్రమాద కారణాలను పరిశీలిస్తున్నాం : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌లో ఘోరం జరిగింది. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న భారీ పేలుడు పదార్థాలు పోలీస్‌ స్టేషన్‌లోనే పేలడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనగర్‌ లోని నౌగామ్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై స్పందించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఘటనకు గల కారణాలను పరిశీలిస్తున్నట్టు వివరించింది. వివరాళ్లోకెళ్తే.. ఇటీవల ఓ ఉగ్రవాద ముఠా నుంచి పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్‌ బృందం సాయంతో పరిశీలిస్తుండగా.. అవి అకస్మాత్తుగా పేలిపోయాయి. దీంతో పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణం ఒక్కసారిగా దద్దరిల్లింది. ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు సమాచారం.

భవనంలో దట్టమైన పొగతో గాల్లోకి మంటలు ఎగిసిపడినట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న పోలీసులు, ఫోరెన్సిక్‌ అధికారులు, నాయబ్‌ తహసీల్దార్‌ సహా ఇద్దరు రెవెన్యూ అధికారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడినవారిని హుటాహుటిన సమీపంలోని ఆర్మీ ఆస్పత్రికి, షేర్‌-ఎ-కాశ్మీర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్కిమ్స్‌)కు తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నదనీ, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని సమాచారం. ఘటన జరిగిన వెంటనే ఉన్నతాధికారులు నౌగామ్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఇటీవల జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన పోస్టర్ల కేసును ఛేదించింది ఇదే నౌగామ్‌ పోలీసులు. ఈ దర్యాప్తులోనే వైద్యులు వంటి ఉన్నత విద్యావంతులతో నడుస్తున్న ‘వైట్‌ కాలర్‌ ఉగ్రవాద నెట్‌వర్క్‌’ గుట్టురట్టయ్యింది. ఈ ముఠా నుంచే భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఢిల్లీలోని 13 మందిని బలిగొన్న కారు బాంబు పేలుడుకు కూడా ఇదే ముఠా కారణమని దర్యాప్తులో తేలింది. అప్పుడు స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలే ఇప్పుడు ఈ అధికారుల మృతికి కారణం కావటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదంపై దర్యాప్తు : కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. అలాగే 27 మంది పోలీసులు, ఇద్దరు రెవెన్యూ అధికారులు, ముగ్గురు పౌరులు గాయపడ్డారని వివరించింది. పేలుడు కారణంగా పోలీస్‌ స్టేషన్‌ భవనం చుట్టుపక్కల ఉన్న కొన్ని నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రెటరీ (జమ్మూకాశ్మీర్‌ డివిజన్‌) ప్రశాంత్‌ లోఖండే తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఊహాగానాలను నమ్మవద్దనీ, శుక్రవారం రాత్రి 11.20 గంటల ప్రాంతంలో నౌగామ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ పేలుడు సంభవించిందని ఆయన తెలిపారు. ఫోరెన్సిక్‌ టెస్ట్‌ కోసం నమూనాలను సేకరిస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని వివరించారు. పేలుడు ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -