9 మంది మృతి..20 మందికి గాయాలు
బ్లాస్టింగ్ ధాటికి ఛిద్రమైన శరీరాలు
మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ చేసిన కారులో పేలుడు
పలు వాహనాలకు అంటుకున్న మంటలు
ఆ ప్రాంతంలో భీతావహ దృశ్యాలు
ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
ఢిల్లీ సహా మెట్రోనగరాల్లో హై అలర్ట్
ఎర్రకోట, చాందినీ చౌక్ దారులు మూసివేత : సీపీ
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ పేలుళ్లతో దద్దరిల్లింది. ఎర్రకోట సమీపంలో పార్క్ చేసిన రెండు కార్లలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. గాయపడిన 20 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యవర్గాలు తెలిపాయి. పేలుడు ధాటికి పలువురి శరీరాలు ఛిద్రమయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో భీతావహ దృశ్యాలు అక్కడివారిని కలిచివేశాయి. మరోపక్క మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ సహా మెట్రో న గరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట చాందినీ చౌక్‌దారులను మూసివేసినట్టు సీపీ వెల్లడించారు.
ఏం జరిగింది..?
ఢిల్లీ మెట్రోస్టేషన్ గేట్ నెంబర్-1 వద్ద వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. సాయంత్రం 6.52 గంటల సమయంలో అక్కడి రెండు కార్లలో అమర్చిన పేలుడు పదార్థాలు భారీ శబ్దాలతో పేలాయి. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే మంటలు ఎగిసిపడ్డాయి. ఆ పక్కనే ఉన్న అనేక వాహనాలు మంటలధాటికి తునాతునకలయ్యాయి. పేలుళ్లతో ఘటనాస్థలిలో ఉన్న ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులతో పాటు అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఏడు ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. దీంతో ఆఘమేఘాలపై మరిన్ని అగ్నిమాపక వాహనాలను తెప్పించారు. పేలుళ్లపై కేంద్రహౌంమంత్రి అమిత్‌షా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడారు. ఘటనాస్థలికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ), ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తును ముమ్మరం చేశాయి.
క్షతగాత్రులకు వైద్యసేవలు
పేలుళ్లలో గాయపడిన క్షతగాత్రులకు ఆస్పత్రుల్లో వైద్య సేవలు కొనసాగుతున్నాయి. వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు.
ఢిల్లీలో హైఅలర్ట్
ఢిల్లీ మెట్రోస్టేషన్ వద్ద భీతావహ పరిస్థితిని చూస్తే ఇది పకడ్బందీగా జరిగిన దాడిలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి గందరగోళంగా మారటంతో.. ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కార్లు, ఆటోలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. సమీపంలోని షాపులు, భవనాలు ధ్వంసం అయ్యాయి. అయితే ప్రతి సోమవారం ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు. అందువల్ల ప్రమాదం తీవ్రత, ప్రాణ నష్టం కాస్త తగ్గిందని తెలుస్తోంది.
హైదరాబాద్‌లో హైఅలర్ట్
ఢిల్లీ పేలుళ్ల ఘటనతో హైదరాబాద్‌తో సహా పలు నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. దీంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమై పాతబస్తీలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని అన్ని మతపరమైన ప్రదేశాలు, సరిహద్దు ప్రాంతాల్లోనూ భద్రత పెంచాలని ఆదేశాలు జారీ చేసినట్టు ఆ రాష్ట్ర డీజీపీ తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో గస్తీ, తనిఖీలు పెంచాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఫరీదాబాద్‌లో పేలుడు తయారీ పదార్థాలు స్వాధీనం
తాజాగా ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లో దాదాపు మూడు వేల కిలోల పేలుడు తయారీ పదార్థాలను జమ్మూకాశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్‌తో సంప్రదింపులు జరుపుతున్న ముగ్గురు వైద్యులను అరెస్టు చేశారు. అటు గుజరాత్‌లో ముగ్గురు ఐఎస్ సానుభూతిపరులు అరెస్టైన వేళ ఈ పేలుళ్లు జరగటంతో అనుమానాలు బలపడుతున్నాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
క్షతగాత్రులకు అమిత్‌షా పరామర్శ
క్షతగాత్రులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరామర్శించారు. సోమవారం సాయంత్రం ఢిల్లీ గేట్‌కు సమీపంలోని జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్‌లో ఉన్న లోక్‌నాయక్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న అమిత్ షా క్షతగాత్రులను పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్సను పరిశీలించారు.
బాధితులను ఆదుకోవాలి
ఢిల్లీ పేలుడు వార్త విని తీవ్రంగా షాక్‌కు గురయ్యా. బాదిత కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. గాయాలైన వారందరికి తక్షణం వైద్యం, తగిన ఆహారం, సహాయ సహకారాలు ప్రభుత్వం అందించాలి. ఈ ఘటనపై వేగంగా విచారణ జరపాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ బేబీ



