Sunday, January 25, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలునాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -

మంటల్లో ఇద్దరు పిల్లలు సహా ఆరుగురు!
ఫర్నీచర్‌ షోరూమ్‌లో పెద్దఎత్తున మంటలు
రంగంలోకి ఎన్‌డీఆర్‌ఎఫ్‌, బాహుబలి క్రెయిన్‌, రోబో
సహాయక చర్యలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా, జలమండలి, మెడికల్‌, విద్యుత్‌, అగ్నిమాపక సిబ్బంది
16 ఫైరింజన్లు, 20 ట్యాంకర్ల వినియోగం
భారీ పోలీస్‌ బందోబస్తు
రాత్రి వరకూ అదుపులోకి వచ్చిన మంటలు

నవతెలంగాణ-సిటీబ్యూరో/సుల్తాన్‌బజార్‌
హైదరాబాద్‌ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫర్నీచర్‌ షోరూమ్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. లోపల ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు చిక్కుకున్నారు. మంటలు వ్యాపించడం.. పొగ కమ్ముకోవడం రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకంగా మారింది. లోపల ఉన్న వారి పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు రెస్క్యూ టీం శనివారం రాత్రి కూడా సహాయక చర్యలు కొనసాగించింది. రాత్రి 10 గంటల వరకు మంటలు అదుపులోకి వచ్చినా దట్టమైన పొగ కమ్ముకోవడంతో సిబ్బందికి లోపలికి వెళ్లడం ఇబ్బందిగా మారింది. అబిడ్స్‌ జీపీఓ నుంచి నాంపల్లి వెళ్లే దారిలో నాలుగు అంతస్తుల్లో సాయి విశ్వాస్‌ చాంబర్స్‌, ఫర్నీచర్‌ క్రిస్టల్‌, ఫర్నీచర్‌ క్యసిల్‌, శుభ్‌ ఫర్నీచర్స్‌ పేర్లతో దుకాణాలున్నాయి. సెల్లార్‌ను గోదాంగా ఉపయోగిస్తున్నారు. గోదాంలో అట్టలు, చెక్కలతో చేసిన ఫర్నీచర్‌, ఫోమ్‌, థర్మకోల్‌, ప్లాస్టిక్‌తోపాటు ఇతర సామగ్రిని నిల్వ చేశారు. అయితే శనివారం మధ్యాహ్నం 12:30గంటల సమయంలో సెల్లార్‌ నుంచి పొగలు వచ్చాయి. అది ఎవరూ గుర్తించకపోవడంతోపాటు క్షణాల వ్యవధిలో భారీగా మంటలు వ్యాపించాయి.

దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఆందోళనకు గురైన స్థానికులు, సమీప దుకాణాదారులు వెంటనే అబిడ్స్‌ పోలీసులతోపాటు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే గ్రౌండ్‌ఫ్లోర్‌ నుంచి నాలుగు అంతస్తుల వరకు మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టాయి. సెల్లార్‌ అంతా ఫర్నీచర్‌ ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు కష్టంగా మారింది. దాంతో బాహుబలి క్రెయిన్‌, జేసీబీతో ఫర్నీచర్‌ తొలగించారు. పై అంతస్తు వరకు బాహుబలి క్రెయిన్‌ సహాయంతో సుత్తెలతో అద్దాలను పగలగొట్టారు. ఇరుకైన గల్లిలో పెద్దఎత్తున మంటలు, దట్టమైన పొగ వ్యాపిచడంతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, సివిల్‌, ర్యాపిడ్‌ యాక్షన్‌ బృందాలను రంగంలోకి దించారు. సెల్లార్‌లో ఓ పక్క నీరు చేరడంతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది చిన్న బోట్‌ ద్వారా లోనికి వెళ్లాల్సి వచ్చింది. రోబోను సైతం లోనికి పంపించి కెమెరాల సహాయంతో సెల్లార్‌లోని పరిస్థితిని అంచనా వేసేందుకు అధికారులు ప్రయత్నించారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు 16 ఫైరింజన్లు ఉపయోగించారు. దాదాపు ఐదు వరకు అంబులెన్స్‌లు, వాటర్‌బోర్డు నుంచి 20 నీళ్ల ట్యాంకర్లను అందుబాటులో ఉంచారు.

పిల్లలను సురక్షితంగా కాపాడేందుకు..
దుకాణం యజమాని సంతోష్‌ కొన్నేండ్లుగా ఫర్నీచర్‌ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అందులో వాచ్‌మెన్‌గా మాల్‌కు చెందిన యాదయ్య, లక్ష్మి దంతులుంటున్నారు. వారికి అఖిల్‌(7), ప్రణిత(11) సంతానం. అంతా కలిసి సెల్లార్‌లోనే నివాసముంటున్నారు. పిల్లలు స్థానిక స్కూల్‌లో చదువుతున్నారు. నాంపల్లి సుభాన్‌పూర్‌కు చెందిన మాహ్మద్‌ హుస్సేన్‌ ఫిట్టర్‌గా పనిచేస్తున్నాడు. శాస్త్రీపురానికి చెందిన సయ్యద్‌ ఆబీద్‌ కూడా శుభ్‌ ఫర్నీచర్స్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. అయితే ఉదయమే యాదయ్య, లక్ష్మి దంపతులు పిల్లలను సెల్లార్‌లో ఆడుకోవాలని చెప్పి బయటకు వెళ్లారు.

మధ్యాహ్నం సెల్లార్‌ నుంచి దట్టమైన పొగ వస్తుండటాన్ని గమనించిన సయ్యద్‌ ఆబీద్‌, మహ్మద్‌ హుస్సేన్‌, మేనేజర్‌ ఇంతియాజ్‌ పిల్లలను రక్షించేందుకు లోపలికి వెళ్లారు. అప్పటికే మంటలు, పొగ కమ్ముకోవడంతో వారు కూడా అందులో చిక్కుపోయారు. వారితో పాటు స్వీపర్‌గా పనిచేస్తున్న 60 ఏండ్ల వృద్ధురాలు సైతం సెల్లార్‌లో ఉండిపోయినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. బాహుబలి క్రెయిన్‌, జేసీబీల సహాయంతో భవనంలో ఉన్న వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీమ్‌ తీవ్రంగా శ్రమించింది. గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా మారడంతో లోపల ఉన్న వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

పరిశీలించిన హైదరాబాద్‌ సిపీ వీసీ సజ్జనార్‌
ప్రమాద సమయంలో నాలుగు అంతస్తుల భవనంలో మొత్తం ఆరుగురు వ్యక్తులు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నామని హైదరాబాద్‌ సిపీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. విషయం తెలుసుకున్న సీపీ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అధికారులతో కలిసి ప్రమాద తీవ్రతను పరిశీలించారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో అందులో ఉన్న వారు బయటకు రాలేకపోతున్నారని తెలిపారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ విచారిస్తామని తెలిపారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగర ప్రజలకు పలు సూచనలు చేశారు. తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడకుండా వాహనాలను దారి మళ్లించామన్నారు. మంటలను అదుపు చేయడం చాలా కష్టంగా మారిందని ఫైర్‌ డీజీ విక్రమ్‌సింగ్‌ మాన్‌ తెలిపారు.

నిబంధనలకు విరుద్దంగా సెల్లార్‌లో స్టాక్‌ను నిల్వ చేశారన్నారు. లోపలికి వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు అడ్డంకులు ఏర్పడ్డాయన్నారు. మంటలు అదుపులోకి వచ్చినా దట్టమైన పొగ ఉండటం వల్ల సెల్లార్‌లోకి వెళ్లలేకపోతున్నామన్నారు. సెల్లార్‌లోకి వెళ్లేందుకు మరో రెండు గంటలు పట్టొచ్చని చెప్పారు. ఇప్పటికే సెల్లార్‌లోని ఫర్నీచర్‌ మొత్తాన్ని రెస్క్యూ టీమ్‌ ధ్వంసం చేసిందన్నారు. సంఘటన స్థలంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందనా, జాయింట్‌ సీపీ డేవీస్‌ జోయేల్‌, డీసీపీ, హైదరాబాద్‌ డీఏంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకట్‌, జీహెచ్‌ఎంసీ ఏంహెచ్‌వో డాక్టర్‌ పద్మజాతోపాటు హైడ్రా, జీహెచ్‌ఎంసీ, జలమండలి, వైద్య, విద్యుత్‌శాఖ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

హైకోర్టు ఆదేశాలు బేఖాతర్‌
నాంపల్లిలో 1960లో అచ్యుత్‌ రెడ్డి ఇచ్చిన భూమిలో హిందీ ప్రచారసభ పేరుతో భవనాన్ని నిర్మించారు. నిబంధనలకు విరుద్ధంగా అక్కడ దుకాణాలు ఏర్పాటు చేశారని తెలిసింది. దుకాణాలను వెంటనే ఖాళీ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చనప్పటికీ బేఖాతర్‌ చేశారు.

షరామామూలే..
నగరంలో ఇరుకైన గల్లీలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేస్తున్న అధికారులు ఆ తర్వాత చర్యలు తీసుకోకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇరుకైన ప్రాంతంలో ప్రమాదాలు జరిగినప్పుడు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకోవడం సవాల్‌గా మారుతోంది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో వాణిజ్య సముదాయాల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నివాస గృహాల మధ్య ఇలాంటి గోడౌన్లు లేదా దుకాణాలు ఉండటం వల్ల ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -