– ఆహుతైన సెంట్రో, ఆర్‌కే కలెక్షన్స్
– వరుసగా రెండోసారి ప్రమాదానికి గురైన ఒకే బిల్డింగ్
– ఓ పక్క వాంబ్ ఆస్పత్రి, మరోపక్క షాపింగ్ మాల్స్
– తప్పిన ప్రాణాపాయం
నవతెలంగాణ-చందానగర్
రంగారెడ్డి జిల్లా చందానగర్ మెయిన్ రోడ్డులోని సెంట్రో షోరూంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్‌లోని ఓ బిల్డింగ్‌లో నూతనంగా సెంట్రోను ఏర్పాటు చేశారు. సెంట్రో నేమ్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆ మంటలు క్రమంగా బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది షోరూమ్ నుంచి బయటకు పరుగులు తీశారు. మంటలు వ్యాపించడంతో అందులో ఉన్న సామగ్రి పూర్తిగా దగ్ధమయింది. అలాగే పక్కనే ఉన్న ఆర్‌కే కలెక్షన్ షోరూమ్‌కు మంటలు వ్యాపించాయి. దాంతో క్షణాల వ్యవధిలోనే ఆ షోరూం కూడా అగ్నికి ఆహుతయింది. దాని పక్కనే వాంబ్ ఆస్పత్రికి మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా ఘటనా స్థలానికి చేరుకోవడంతో సెంట్రో, ఆర్‌కే కలెక్షన్ షోరూంలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆర్‌కే కలెక్షన్ పక్కనే వాంబ్ ఫెర్టిలిటీ ఆస్పత్రికి కూడా స్వల్పంగా మంటలు వ్యాపించగా.. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే అప్రమత్తమైన అందులోని సిబ్బంది, రోగులను బయటకు తీసుకువచ్చారు. ఈ మంటల్లో ఆస్పత్రి ఏసీలు కొద్దిమేర దగ్ధమయ్యాయి. అయితే ప్రమాదం జరుగుతున్న సమయంలో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు వాంబ్ ఫెర్టిలిటీ ఆస్పత్రిలోని ఫైర్ సేఫ్టీ పైప్‌లను ఆన్ చేసేందుకు యత్నించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఫైర్ సేఫ్టీ పైప్‌లు నామమాత్రంగానే పెట్టారని, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు వచ్చిన వాహనాల్లోనూ నీరు అయిపోవడంతో జలమండలి ట్యాంకర్లను తీసుకువచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు. అనంతరం బాహుబలి ఫైర్ ఇంజన్‌ను తీసుకువచ్చి సుమారు 10 ఫైర్ ఇంజన్ల సహాయంతో గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. చందానగర్ మెయిన్ రోడ్డులో అగ్నిప్రమాదం జరగడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఫైర్‌సేఫ్టీ వాహనాలు వచ్చేందుకు కూడా ఇబ్బంది ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జనాలు భారీగా గుమిగూడటంతో లాఠీచార్జి చేశారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. గతంలోనూ ఓసారి ఇదే బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం జరిగింది.
చందానగర్‌లో ఘోర అగ్నిప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES