వెలుగులోకి క్యూనెట్ కుంభకోణం
32 మంది నిందితుల అరెస్ట్
మల్టీలెవల్ మార్కెట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి : హైదరాబాద్ సీపీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో భారీ కుంభకోణం నగరంలో వెలుగులోకి వచ్చింది. క్యూనెట్ పేరుతో దేశవ్యాప్తంగా వేల కోట్లను వసూళ్లు చేసిన నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. 11మంది మహిళలతోపాటు మొత్తం 32 మందిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి కీలక పత్రాలు, కంప్యూటర్లును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని పాత పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. సులువుగా డబ్బులు సంపాదించాలని వ్యాపారవేత్త వహాన్ పథకం ప్రకారం ‘క్యూఐ గ్రూప్’ను ఏర్పాటు చేశాడు. కొంత మందితో కలిసి సెల్లింగ్ మల్టీ లెవల్ మార్కెటింట్ పేరుతో ‘క్వూనెట్’గా విస్తరించాడు.
హాంకాంగ్ కేంద్రంగా గతంలో గోల్డ్ క్వెస్ట్, క్వెస్ట్ నెట్ పేర్లతో దేశవ్యాప్తంగా విస్తరించాడు. 1998 నుంచి వివిధ సంస్థల పేర్లతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠా ప్రధానంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను, నిరుద్యోగులను, గృహిణులను, వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. నిందితులు హైటెక్ సిటీలోని ప్రముఖ హోటళ్లలో సమావేశాలు నిర్వహించి ఈ-కామర్స్ వ్యాపారం, పెట్టుబడుల పేరుతో ప్రజలను ఆకర్షించారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెడితే రెండేండ్లలో రూ.3 నుంచి రూ.4 కోట్ల వరకు లాభం వస్తాయని బాధితులు నమ్మించారు. బాధితులు డబ్బు చెల్లించిన తర్వాత వారి ప్రమేయం లేకుండానే ఆ మొత్తాన్ని వస్తువుల కొనుగోలుకు మళ్లించి, వాటిని కంపెనీ ఇచ్చిన బహుమతులుగా నమ్మించేవారు. ఇందులో చేర్పించిన వారికి కమీషన్లు ఇస్తామని గాలం వేశారు.
హైదరాబాద్‌లో 22 మంది బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు విచారణ చేపట్టారు. 30 బృందాలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో ఏకకాలంలో చేపట్టిన ఆపరేషన్‌లో 32 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం నమోదైన నాలుగు కేసుల్లో 11 మంది బాధితుల నుంచి సుమారు రూ.75 లక్షల మేర వసూళ్లు చేసినట్టు తేలిందని సీపీ తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. మల్టీలెవల్ మార్కెట్ పేరుతో భారీ మోసాలు జరుగుతున్నాయని వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సీపీ సూచించారు. మోసపూరిత మల్టీ లెవల్ మార్కెటింగ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.



