గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో 600 కి.మీ మేర వ్యాప్తి
జలచరాలకు ప్రమాద ఘంటిక
జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం
అక్కడి అధికారుల ఆందోళన
మెక్సికో : గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో 600 కి.మీ మేర భారీ స్థాయిలో చమురు తెట్టు ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. చమురు తెట్టు విస్తరించి సముద్ర జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు మెక్సికో అధికారులు వెల్లడించారు. దీనితో ఏడు ప్రకృతి సంరక్షణ ప్రాంతాలతో సహా సముద్రంలోని జీవరాశులపై పెను ప్రభావం పడిందన్నారు. రెండు సహజ చమురు ఊటలు, ఓ చమురు నౌక సముద్రంలో బోల్తాపడడంతో ఈ ముప్పు సంభవించిందని తెలిపారు. కొన్ని నెలల క్రితం భారీ వర్షాలు, వరదల కారణంగా మెక్సికోలోని వెరాక్రూజ్ ప్రాంతంలో సహజంగా చమురు బయటకు వచ్చే పైప్‌లైన్ దెబ్బతింది. దీంతో లీకైన చమురు నదుల ద్వారా సముద్రంలోకి చేరి, సుమారు 200 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని దాటి మొత్తం 600 కిలోమీటర్ల వరకు వ్యాపించింది.
అదనంగా, కాంపెచే బేలోని మరో సహజ చమురు ఊట కూడా నిరంతరం లీక్ అవుతూ కాలుష్యాన్ని మరింత పెంచుతోంది. ఇంకా మూడు నెలల క్రితం సముద్రంలో ఒక చమురు నౌక మునిగిపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. ఈ ఘటనలతో సముద్రంలోని వందలాది చేపలు, సముద్ర తాబేళ్లు వంటి జలచరాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. అలాగే, ప్రకృతి సంరక్షణ ప్రాంతాలు, బయోస్పియర్ రిజర్వులు, జాతీయ పార్కులు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రస్తుతం కాలుష్యాన్ని నియంత్రించేందుకు అధికార సిబ్బంది శుభ్రపరిచే చర్యలు చేపడుతు న్నారు. నెల రోజులుగా ఈ రెండు సహజ చమురు ఊటల నుంచి పెద్ద మొత్తంలో కలుషితాలు వెలువడుతున్నాయి. మరోవైపు మూడు నెలల క్రితం గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో చమురు నౌక బోల్తా పడటంతో సముద్రంలో చమురు లీక్ అయ్యిందని అధికారులు తెలిపారు. దానితో వందల సంఖ్యలో సముద్ర తాబేళ్లు, చేపలతో సహా వివిధ జలచరాలు ప్రాణాలు కోల్పోతున్నాయన్నారు.



