Tuesday, July 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసూర్యాపేటలో భారీ దోపిడీ

సూర్యాపేటలో భారీ దోపిడీ

- Advertisement -

సాయి సంతోషి జ్యుయలరీ షాపులో చోరీ
గోడకు కన్నం, గ్యాస్‌ కట్టర్‌తో షట్టర్‌,
బీరువాలను కట్‌ చేసిన దొంగలు
18 కేజీల బంగారు ఆభరణాలు అపహరణ
క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌,
ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు
ఇతర రాష్ట్రాల ఘరానా
ముఠా ప్రమేయంపై అనుమానాలు
త్వరలోనే నిందితులను పట్టుకుంటాం :ఎస్పీ నర్సింహా
నవతెలంగాణ-సూర్యాపేట

సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ దోపిడీ జరిగింది. ఎంజి రోడ్డులో ఉన్న సాయి సంతోషి జ్యువెల్లరీ షాపులో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. దొంగలు షాపు వెనుక భాగం గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించి, గ్యాస్‌ కట్టర్‌తో షట్టర్‌, బీరువాలను కట్‌ చేశారు. రూ.18 కోట్ల విలువైన 18 కిలోల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. సోమవారం ఉదయం యజమాని షాపు తెరిచిన సమయంలో ఈ దొంగతనం వెలుగు చూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి జిల్లా ఎస్పీ నర్సింహా తెలిపిన వివరాల ప్రకారం..
సూర్యాపేట పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే ఎంజీ రోడ్‌లో తెడ్ల కిషోర్‌కు చెందిన సాయి సంతోషి జ్యువెల్లరీ షాపు వెనుక భాగంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు బాత్రూం గోడకు కన్నం వేశారు. గ్యాస్‌ కట్టర్‌ సహాయంతో షట్టర్‌ను కట్‌ చేసి లోపలికి ప్రవేశించారు. రూ.18 కోట్ల విలువైన 18 కిలోల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయారు. సోమవారం ఉదయాన్నే షాపు తెరిచేందుకు వచ్చిన యజమాని తెడ్ల కిషోర్‌ షట్టర్‌ను తీసేసరికి లోపల చిందరవందరగా ఉంది. బంగారు ఆభరణాలు కనిపించలేదు. వెంటనే 100 డయల్‌ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ నర్సింహా, డీఎస్పీ ప్రసన్నకుమార్‌, సీఐ వెంకటయ్య సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌తో పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలను పూర్తిగా పరిశీలిస్తున్నారు. అనుమానం ఉన్న వ్యక్తుల వేలిముద్రలు సేకరించి, స్థానికంగా గుర్తు తెలియని వ్యక్తుల కదలికలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠా ఈ దొంగతనానికి పాల్పడే అవకాశముందని అనుమానిస్తున్నారు. షాపు చుట్టుపక్కల గల ఇతర షాపులు, వాహనాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఇతర రాష్ట్రాల దొంగల ముఠా పనేనా..
ఇతర రాష్ట్రాలకు చెందిన ఘరానా దొంగల ముఠా ఈ దాడికి పాల్పడి ఉంటుందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంతర్‌ జిల్లా, అంతర్రాష్ట్ర ముఠాల మధ్య సంబంధాల కోణంలో అన్వేషిస్తున్నారు. గతంలో ఇటువంటి చోరీలతో అనుబంధం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలో పట్టణంలోని ఆంధ్రబ్యాంకులో జరిగిన దొంగతనాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది. అప్పట్లో సెక్యూరిటీ గార్డును హత్య చేసి దొంగలు నగదును అపహరించారు.
భద్రతపై ఆందోళన
సాయిసంతోషి జ్యువెల్లరీ షాపు జిల్లాలో అత్యంత నమ్మకమైన సంస్థగా పేరొందింది. నిత్యం వందలాది మంది కస్టమర్లు సందర్శించే ఈ షాపు, ఎంజీ రోడ్‌ వాణిజ్య ప్రదేశానికి ప్రతినిధిగా నిలిచింది. అలాంటి స్థలంలో జరిగిన భారీ చోరీ, స్థానికుల్లో భద్రతపై తీవ్ర సందేహాలను కలిగిస్తోంది. ఎంజీ రోడ్‌ నడిబొడ్డులో, పక్కన ఉండే షాపులన్నీ సీసీ కెమెరాలతో నిండి ఉన్నా.. జ్యువెల్లరీ షాపులో భారీ దొంగతనం జరగడం కలకలం రేపింది. రాత్రివేళ పెట్రోలింగ్‌ జరగలేదా? పోలీసుల గస్తీ ఏమైంది? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటన పట్ల స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిందితులను పట్టుకుంటాం
ఇది ప్రణాళికబద్ధంగా జరిగిన చోరీ. ఇప్పటికే ఐదు బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. గతంలో 2011లో జరిగిన దొంగతనాన్ని తలపించేలా ఈ ఘటన ఉంది. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం. నగలను స్వాధీనం చేసుకుని యజమానులకు అప్పగిస్తాం.
– ఎస్పీ నర్సింహా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -