రౌడీలు, గుండాలపై ప్రత్యేక నిఘా
వెయ్యి సమస్యాత్మక ప్రాంతాల్లో సాయుధ పికెట్లు : డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి హైదరాబాద్‌లో మంగళవారం తెలిపారు. రాష్ట్రంలో ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాల్టీలకు ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహిస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర పోలీసులతో పాటు మరో రెండు వేల మంది అటవీ, ఎక్సైజ్ విభాగాల నుంచి కూడా సిబ్బందిని బందోబస్తుకు వినియోగిస్తున్నట్టు ఆయన తెలిపారు. మొత్తం వెయ్యి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామనీ, అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాయుధ పికెట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే రౌడీలు, గుండాలు, అవాంఛనీయ శక్తులను గుర్తించి వారికి ముందస్తు హెచ్చరికలు చేస్తూ బైండవర్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారానికి ఎలాంటి అవరోధాలు కలగకుండా వ్యూహాత్మకంగా ఆయా జిల్లాల ఎస్‌పీలు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారని తెలిపారు. లైసెన్స్‌గల ఆయుధాలను స్థానిక పోలీస్‌స్టేషన్లలో సంబంధిత వ్యక్తులు జమ చేయాలని, గత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా 1800 ఆయుధాలను జమ చేశారని అన్నారు. అక్రమ ఆయుధాలపై నిఘాపెట్టి స్వాధీన పర్చుకునేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌లను రంగంలోకి దింపామని తెలిపారు. పోలింగ్ రోజు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సాయుధ పోలీసులతో పాటు సీసీ కెమెరాలతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్సులను నిర్ణీత స్ట్రాంగ్ రూమ్‌లకు చేరుస్తామనీ, అనంతరం 13వ తేదీన ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచల పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ బందోబస్తును పర్యవేక్షించటానికి డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక అదనపు డీజీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24గంటలు పనిచేస్తారని తెలిపారు. పోలింగ్ పర్వాన్ని ప్రశాంతంగా నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లు చేశామనీ, ఓటర్లు నిర్భయంగా వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ మహేశ్‌భగవత్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపోల్స్‌కు భారీ భద్రత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



